శ్రీనివాసుడు.;- శార్దూలము//
శ్రీదేవుండవు నిన్ను నిల్పితినయా!చిత్తంబులోనన్ సదా
నీ దాస్యంబును జేయగన్ నిలుచు నన్నేలంగరావా ప్రభూ!
నా దీనత్వము దొల్గగన్ బడితి విన్నాణంబుగన్ గొల్వ నీ
పాదాబ్జంబుల మ్రోల!ద్రుంచవయ!నా ప్రారబ్ధముల్ శ్రీహరీ!//


మత్తేభము//

సుపథంబున్ గనుగొంచు మౌనులెపుడున్ శుష్కించి యోగంబుతో 
దపముల్ జేయగ గారవించి వరముల్ తర్షంబుతో నిత్తువే!
జపముల్ సల్పగ శక్తిచాలదయ!నా సంజ్ఞప్తి నాలింపుమా!
యపరాధంబులఁ లెక్కవేయకుమ!నాకాప్తుండవీవే హరీ!//

మత్తేభము //

దరహాసంబులఁ జిల్కుచుండి దయతో తాపంబులన్ గాల్చుచున్
గిరిపై నిల్చిన శ్రీనివాసుడవు నన్ గ్రీగంట వీక్షింపుమా!
దొరవై పాలనసేయువాడ!వరదా!తోతెంచుమయ్యా!వెసన్
స్థిరమై గొల్చెద నీదుపాదములనో!శ్రీమంతుడా నమ్మికన్!//

ఉత్పలమాల //

కొండలరాయుడా!యనుచు కూరిమితో జనులెల్ల మ్రొక్కి నీ
కొండకు వచ్చుచుంద్రు తమ కోర్కెలు తీర్చెడి దైవమంచు నీ
వండగ నిల్చియుందువట నార్తిని బాపుచు నాదరంబుగన్
దండమయా!ముకుంద!నిను దల్చెద నెమ్మిని శ్రీనివాసుడా!//


టి. వి. యెల్. గాయత్రి.

కామెంట్‌లు