తెలుగు భాషలో సామెతలు ది సుస్థిర స్థానం. భాషతో పాటుగా మన మనోభావాలను ఎదుటివారికి పంచుకోవడానికి
బలంగా చెప్పే మాటలే సామెతలు. జానపదుల గుండెల నుంచి ,అనుభవాల నుంచి, సంఘటనల నుంచి
మధించగా వచ్చే వాక్యాలే సామెతలు. నిజానికి అవన్నీ చాలావరకు జీవిత సత్యాలే.
సామెత అంటే... సామ్యత అనే పదం నుంచి పుట్టిందని పండితుల వాదన. సామ్రత అంటే "పోలిక"అని అర్థం. ఒక అంశాన్ని ఉదహరించినప్పుడు, సరిపోల్చినప్పుడు అలాంటి సందర్భానికి సరిపడిన వాక్యాలే సామెతలు. వీటినే "నానుడులు" అని కూడా అంటారు. "నుడి" అంటే మాట
అని అర్థం. నానుడి అంటే అందరి నోళ్ళల్లో నాని నాని ప్రసారంలో ఉన్న మాటలను నానుడులంటారని కొందరు చెబుతారు.
వీటి పార్శాలే జాతీయాలు, నుడికారాలు కూడా. సామెతలు, జాతీయాలు, నుడికారాలు సమీప పోలికల కలిగినవి అయినప్పటికీ జానపదుల వాడుకలో సామెతలు చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించాయి.
ముందుగా సామెతలు గురించి
మనం చర్చిస్తే, ఒక జాతి జీవన విధానం, వారి వృత్తులు, ప్రవృత్తులు, అలవాట్లు, ఆహార వ్యవహారాది క్రమం, వారి జ్ఞానసము పర్జన, వారికున్న శాస్త్రీయమైన ఆలోచనలు, సంస్కృతికి ప్రతినిధులుగా నిలుస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే సంబంధిత ప్రాంతంలో గల జనపదములో ఉన్న ప్రజల మనోభావాలకు దర్పణం నిలుస్తాయి.
ఉదా: "ఉట్టికి ఎగరలేనమ్మ
స్వర్గానికి ఎగిరిందట"
ఈ సామెత చిన్నపాటి ప్రయత్నం లేదా పనిచేయలేనివాడు
పెద్ద పని చేసినట్లుగా చెబితే ...
ఆ సందర్భంలో ఈ సామెతను
జోడిస్తారు.
ఇక్కడ సామెతను కొంచెం విశ్లేషణ చేస్తే.. పూర్వం పాలు పెరుగు దాచుకొనడానికి
ఇంటి దూలంలో ఉట్టిని కట్టేవారు. అది కొంచెం మనిషి కన్నా స్వల్పంగా వ్యక్తులు కట్టబడి ఉంటుంది. ఏదైనా ఆహార పదార్థాలు కిందన ఉన్నట్లయితే కుక్కల పాలు కాకుండా, చీమలపాలు కాకుండా ఎత్తుగా ఉంచేవారు.
ఈ సామెత ఒకనాటిపల్లె జీవన చిత్రంలో "ఉట్టి" పాత్ర చెబుతుంది. ఇలా జీవద్భాషలో
వస్తువులు సామెతల్లోకి వాడుకులోనికి వచ్చేవి.
ఇక మరొక సామెత
ఉదా:" ఎద్దుంటే అద్దె". పూర్వం పల్లెల్లో దూర ప్రయాణాలకు ఎడ్ల బండిని కట్టేవారు. కొందరు ఇదే పనిగా అద్దె బండ్లను తిప్పేవారు. ఆ క్రమంలో రైతులకు ఎద్దులు చనిపోయిన, కొనలేకపోయిన జీవనాధారానికి ఇబ్బందిగా ఉండేది. అంతే కాదు దూర ప్రాంతాల నుంచి సరుకులు తేవడానికి ఆనాడు ఎడ్లబళ్ళే కీలకపాత్ర వహించేవి. అటువంటి ఎద్దు లేకపోతే జీవనాధారం లేదు అని చెప్పే సందర్భంలో"ఎద్దుంటే అద్దె"అనే సామెత పుట్టింది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన సామెతగా కూడా దీనిని మనం పరిగణలోనికి తీసుకోవచ్చు.
జ్యోతిష్యం, వైద్యం, విద్య
మొదలైన అంశాల నుంచి కూడా ఎన్నో సామెతలు పుట్టాయి.
"చుక్కెదురు" ఇది జ్యోతిష్యం నుంచి పుట్టిన జాతీయం. ముఖ్యంగా పూర్వం బాలింతలు అత్తవారింటికి వెళ్లడానికి శుక్ర గ్రహం ఎదురుగా ఉన్నట్టయితే ఆ ప్రయాణం పనికిరాదని పురోహితుడు చెప్పేవాడు.
శుక్ర గ్రహానికి "చుక్క" అని మరో అర్ధం. "ఆచారి చేతిమాత్ర వైకుంఠ యాత్ర".. వైద్యానికి సంబంధించి. గ్రామ వైద్యుడు
ఇచ్చిన మాత్ర వికటించినప్పుడు మరణం తప్పదనే సందర్భంలో ఈ సామెత పుట్టింది."పొట్ట చింపితే అక్షరం లేదు"నిరక్షరాస్యుడు గురించి చెప్పే సందర్భంలో వాడే సామెత. విద్యా సంబంధి.
"అందితే సిగ అందకుంటే కాళ్లు".... ఇది ఒక వ్యక్తి అవకాశవాదానికి పాల్పడినప్పుడు ఉపయోగించే సామెత. ఒక వ్యక్తి తనకి లొంగితే సిగ పట్టుకుని వంచనట్టు, లేదంటే బ్రతిమాలితే కాళ్లు పట్టుకొని ప్రాధేయపడినట్టు. ఇందులో శరీర భాగాలు మనకి కనబడతాయి. శరీరంపై కూడా చాలా సామెతలు ఉన్నాయి.
ఇక జాతీయ గురించి కూడా రెండు వాక్యాలు మాట్లాడుకుందాం. "జాతీయం అంటే" ఒక ప్రాంతంలో నివసించే ఒక జాతి ఆ పదాన్ని అర్థం చేసుకునే విధంగా జాతి యావత్తు వినియోగిస్తే దానిని జాతీయం అంటారు. అది ఆ జాతి సొత్తు. ఆ ప్రాంతం సంబంధి. ఉదాహరణకు
"కొంగు బంగారం" ఇదో ప్రసిద్ధమైన జాతీయం. యదార్థం 'కొంగులో బంగారం" అని... దీని అన్యార్థం"గ్యారంటీ అని అంటే కొంగులు బంగారం ఉన్నట్లయితే డబ్బు సమస్య రాదు. దూర ప్రయాణాలలో చేతిలో డబ్బులు అయిపోయినప్పుడు, కొంగులో బంగారం గనుక ఉన్నట్టయితే దానిని తాకట్టు పెట్టి డబ్బులు వాడుకునేవారు. అంటే హామీ పూర్తిగా ఇస్తుంది అని అర్థం.
జాతీయాలు యదార్ధాలుగా కాక, అన్య అర్ధాలుగా ఆ జాతికి సంకేత భాషగా మాటల్లో ప్రయోగించి భాషకు సొగసును తీసుకొస్తాయి.
""నుడికారం" గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
మంచి సొగసైన మాటను నుడికారం అంటాము.
ఉదాహరణ"పట్టు గొమ్మ"
దీనికి ఊత కర్ర, ఊత కోల
అని అర్థాలు ఉన్నాయి. ఆ రాజు పండితులకు "పట్టుగొమ్మ" పండితులకు ఆధారమైన వాడు. పండితులను పోషించేవాడు. ఏదో ఒక విధంగా ఆదరణ లభించే గట్టి చోటు. ఇలా నుడికారాలు భాష యొక్క సొగసును పెంచుతాయి.
ప్రాచీన గ్రంథాల నుండి ఆధునిక కవుల కల్పనలు దాకా
సామెతలు జాతీయాలు నుడికారాలు ఎన్నో సందర్భాలలో చోటు చేసుకున్నాయి.
"కోప మొకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి"అంటాడు చామకూర వెంకట కవి ధర్మరాజును వర్ణించిన సందర్భంలో. ఇలా పూర్వకవులు ఎంతోమంది
వీటిని ఉపయోగించి కావ్యాలను సుసంపన్నం చేసి, భాషా పరిపుష్టిని పెంచారు.
కావున మాతృభాష బ్రతికి ఉంటేనే ఈ సామెతలు జాతీయాలు నుడికారాలు
దీపాలై వెలుగుతాయి. తెలుగు వెలుగులను పంచుతాయి.
----------------------------------------
వ్యాసకర్త:తెలుగు వెలుగు సాహిత్యవేదిక ముఖ్యసలహాదారుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి