సునంద భాషితం ;- వురిమళ్ళ సునంద, ఖమ్మం

 న్యాయాలు -266
వృక్ష మూల నిషించన న్యాయము
*****
వృక్షము అంటే చెట్టు లేదా తరువు. మూలము అంటే  మొదలు లేదా వేరు. వృక్ష మూల నిషించన అంటే వృక్షం మూలములో అంటే  వేర్ల మొదట్లో నీళ్ళు పోయడం అన్న మాట.
చెట్టు తన మొదట్లో  పోసిన నీళ్ళను వేర్లు చెట్టు బోదెకు, కొమ్మలకు,ఆకులకు పంపుతుంది.తద్వారా చెట్టు పెరిగి పూలు పండ్లు మొదలైన వాటిని ఇస్తుంది.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే చెట్టుకు నీరు అవసరం. నీరుంటేనే చెట్టు పెరుగుతుంది. నీళ్ళు లేని చోట చెట్లు బతకవు. నీళ్ళు చెట్టుకు ఆహారం అన్న మాట.
అలాగే పశు పక్ష్యాదులకు  వాటికి  సంబంధించిన ఆహారం తినాలి.తింటేనే అవి మనగలుగుతాయి.
అయితే దీనినే భౌతికవాదులు  వేటినీ ఆహార లేమితో బాధపడేలా చేయకూడదు. ఆహారమే శక్తిని, బలాన్ని జీవితాన్ని ఇస్తుంది.కాబట్టి పశువా? పక్షినా? చెట్టునా? అనే భేద భావం లేకుండా వాటి మనుగడకు కావలసిన ఆహారం  అందివ్వడమే భూత దయ అంటారు.
 దీనినే ఆధ్యాత్మిక వాదులు పరమేశ్వర బుద్ధితో భూత తృప్తి గావించాలి.అలా చేయడం వల్ల సర్వభూతాలలోని ఆత్మాయువు అయిన పరమాత్మ ప్రసన్నుడవుతాడు. అలా పరమాత్మను ప్రసన్నం చేసిన వ్యక్తులకు పునర్జన్మ లేకుండా స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటారు.
 మొత్తంగా చూస్తే "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటారు.
జీవముండటానికి ప్రాణవాయువు తర్వాత ఇంకే లోపంతోనైనా బతకవచ్చు కానీ ఆహారం లేకుండా బతకలేం.అందుకే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు.కారణం ఏవి దానంగా ఇచ్చినా తీసుకునే వారికి తృప్తి ఉండదు. ఇంకా ఇస్తే బాగుండు.పెడితే బాగుండు అనిపిస్తుంది.అంటే దానం పొందే వారిని పూర్తిగా సంతృప్తి పరచలేం.
కానీ అన్నదానంలో అలా కాకుండా కడుపునిండా అన్నం తిన్న వారిని మళ్ళీ పెడతామన్నా వద్దు, ఇక చాలు అని తృప్తి పడతారు.మరింకే దానంలో ఇలా వుండదు కదా!. అలా  కడుపు నిండా తిన్న ఆహారం దేహంలోని అన్ని  భాగాలకు పరిపుష్టి కలిగిస్తుంది.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర కథను చెప్పుకుందామా...
మహాభారత యుద్ధంలో  మరణించిన కర్ణుడు అతడు చేసిన దాన ధర్మాల పుణ్యాన స్వర్గానికి వెళ్తాడు. అక్కడ పంచభక్ష్య పరమాన్నాలు, మృష్టాన్నము మొదలైనవి ఆరగిస్తూ ఉన్నా కర్ణుడికి ఆకలి తీరినట్లు అనిపించడం లేదట. ఎందుకలా జరుగుతుందో  స్వర్గాధపతి అయిన దేవేంద్రుడిని అడిగితే  దేవేంద్రుడు నవ్వుతూ "నిన్ను అనేక దానాలు చేసిన  వాడివనీ, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడని అంటారు కదా! మరి నువ్వు చేసిన దానాలలో అన్నదానం వుందా? అని ప్రశ్నిస్తే  కర్ణుడు "నేను అన్ని దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు." అన్నాడట.
"బాగా ఆలోచించు కర్ణా! ఆకలని అడిగిన వ్యక్తికి‌ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా? అనగానే గుర్తుకు వచ్చి "నిజమే ఓ వ్యక్తి అన్నం పెట్టించమని‌ అడిగాడు.ఆ సమయంలో నేను వేరే పనుల్లో నిమగ్నమయి ఉండటం వల్ల పెట్టలేదు.కానీ అన్నం పెట్టే ఇల్లును చూపించాను." అనగానే "అయితే ఏ వేలితో ఫలానా ఇల్లుని చూపించావో ఆ వేలిని నోట్లో పెట్టుకో." అన్నాడు ఇంద్రుడు.
సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకొని ఒక్క గుటక వేశాడో లేదో కర్ణుని ఆకలి తీరిపోయి కడుపు నిండిన సంతృప్తి కలిగిందట.
 అన్నదానం ఎంత గొప్పదో చెప్పడానికి పెద్దలు ఈ కథను చెబుతుంటారు.
 ఇదండీ "వృక్ష మూల నిషించన న్యాయము" లోని అంతరార్థం. 
 
 కాబట్టి భూత దయ కలిగి వుందాం. ఆకలి అని అడిగిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తులను చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు