ధర్మో రక్షతి రక్షిత,;-మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా
 ధర్మం అంటే ప్రతి వ్యక్తి తప్పక నెరవేర్చాల్సిన విధి. ప్రకృతిలోని ప్రతిదీ తన విద్యుక్త ధర్మాన్ని తప్పక నెరవేరుస్తుంటాయి.వర్షాలు సకాలంలో పడడం వల్ల పంటలు పండుతున్నాయి. మానవాళి ఆకలి తీరుతుంది.చెట్లు సకాలంలో చిగురించి పూలను,పండ్లను ఇస్తున్నాయి.
మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.సూర్యుడు ప్రతిరోజు తూర్పున తన ఎర్రని కాంతులతో లోకానికి వెలుగులను ప్రసాదిస్తాడు. జీవకోటికి ప్రాణం పోస్తాడు. చందమామ తన చల్లని  వెన్నెలతో మనసుకు ఆనందాన్ని కలిగిస్తాడు. కోయిల వసంత కాలంలో సుమధురమైన తన గానమాధుర్యంతో మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది.మన చుట్టూ ఉన్న చెట్టు,చేమ సకల జీవరాసులు వాటి విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నాయి. ఆ ధర్నమే వాటికి రక్షణగా ఉంటుంది.మనిషి మాత్రమే తాను చేయాల్సినటువంటి ధర్మకార్యాలను ఆచరించకుండా,అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు.అదే అతనికి శాపంగా మారుతుంది. సమాజంలో మంచి చేయాల్సిన మనిషి, ఇతరులకు అపకారాన్ని కలిగిస్తున్నాడు.ధనం మీద వ్యామోహంతో చేయరానిక తప్పులు చేస్తున్నాడు. తద్వారా ప్రశాంతత కరువై  అకాల మరణాలను పొందుతున్నాడు.ప్రకృతిని పరిరక్షించాల్సిన మనిషి దాని వినాశనాన్ని కోరుకుంటున్నాడు.తద్వారా భారీ వర్షాలు,వరదలకు ప్రజలు బలైపోతున్నారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.ధర్మానికి హాని కలిగిస్తే మనకు వినాశనము తప్పదు.కావున ప్రతి ఒక్కరూ ధర్మం బద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ఉపాధ్యాయుడు తన ధర్మమైనటువంటి బోధనను సక్రమంగా చేసి, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు తమ ధర్మంగా చక్కగా చదువుకొని ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగి తల్లిదండ్రులకు, గురువులకు,దేశానికి మంచి పేరును తీసుకురావాలి. మనం ఎదగడమే కాకుండా పదిమందికి సహాయపడడం నేర్చుకోవాలి.అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది.ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు.
"పరోపకారార్థం ఇదం శరీరం"
"పరోపకారం పుణ్యం- పాపాయ పరపీడనం"
"ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న"
సర్వేజనా సుఖినోభవంతు

కామెంట్‌లు