నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 సుగ్రీవాజ్ఞ
----------
    సుగ్రీవాజ్ఞ అనే ఈ నానుడి రామాయణ కథ నుండి వచ్చింది. తిరుగులేని ఆజ్ఞకు పర్యాయపదమే సుగ్రీవాజ్ఞ. తమ మాటను తిరుగులేకుండా చెల్లుబాటు చేసుకుంటే అలాంటి మాటను సుగ్రీవాజ్ఞతో  పోలుస్తారు. కొందరి మాటలను భయం వల్లనో లేక భక్తివల్లనో అందరూ వింటూ వుంటారు అలాంటి ఎదురులేని మాటలనే సుగ్రీవాజ్ఞలు అనటం పరిపాటి. ఈ నానుడి ఎలా వచ్చిందో?, ఎందుకు వచ్చిందో? చూద్దాం.
        సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తరువాత ఆమె జాడ కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు  వెదుకుతూ తిరుగుతున్నారు.  కొండలు, గుట్టలు, లోయలు దాటుతూ శ్రీ ఋష్యముక పర్వతం చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడు అనే వానరుడిని కలుసుకున్నారు. అతడి సోదరుడు వాలి. కిష్కింధ రాజ్యానికి రాజు వాలి. అతడు చాలా చెడ్డవాడు. తమ్ముడైన సుగ్రీవుడిని తన్ని తరిమాడు. దుర్మార్గంగా బయటకు పంపాడు. ఆ సమయంలో రాముడు కలిశాడు. తన విషయం చెప్పాడు. రాముడు అంతా విని దుష్టుడైన వాలిని చంపాడు. సుగ్రీవుడిని  కిష్కింధకు రాజును చేసాడు. వానరులంతా పండుగా చేసుకున్నారు. వానరులకు సుగ్రీవుడు అంటే ఎంతో ఇష్టం. సుగ్రీవుడు మాట వారికి వేదవాక్కు. ఆయన చెపితే ఎంత కష్టమైన పనైనా కాదనకుండా చేసేవారు. నష్టమైనా భరిస్తారు కానీ సుగ్రీవుని మాటను ధిక్కరించేవారు కాదు. సుగ్రీవుడు సీతను వెదకమని  పంపగానే  వానరులంతా పల్లెత్తి మాట అనకుండా తరలి వెళ్లారంటే  సుగ్రీవాజ్ఞ ఎలాంటిదో ఊహించుకోవొచ్చు.
     సుగ్రీవాజ్ఞ ఎలాంటిదంటే, ఆ రాజ్యంలో ఓ పళ్ళ తోట ఉండేది. ఆ తోటలో ఎన్నో మధురమైన పండ్లు ఉండేవి. కోతులకు పండ్లు అంటే వల్లమాలిన ప్రీతి. తినాలని మనసు ఉవ్వెల్లూరుతున్నా తినలేదు. ఎందుకంటే సుగ్రీవాజ్ఞ లేకపోవడం. హనుమంతుడు లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకున్నాడు. వనరుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందంలో పండ్ల తోటలో పడి తిన్నా సుగ్రీవుడు ఏమి అనేవాడు కాదు. కానీ సుగ్రీవుడు ఆజ్ఞ కోసం కోతులన్ని కడుపు కాల్చుకున్నాయి. చిన్న కోతి పిల్ల కూడా తోటలోకి వెళ్ళలేదు. సుగ్రీవాజ్ఞ అంటే అదే మరి.
కామెంట్‌లు