న్యాయాలు -261
వృశ్చిక చోర న్యాయము
*************
వృశ్చికము అంటే తేలు 🦂. చోర అంటే దొంగ
తెలుగులో దీనిని "దొంగకు తేలు కుట్టినట్లు అనో "తేలు కుట్టిన దొంగ అనో" అంటారు.
మరి దొంగకు తేలు కుట్టినట్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమిటి అనిపిస్తుంది కదండీ!
దొంగకు తేలు కుట్టినా దొరకు తేలుకుట్టినా బాధలో ఏమైనా తేడా వుంటుందా? మరీ చోద్యం గానీ ఇలాంటి ప్రశ్నేమిటి? అని గుర్రుగా చదువుకోకండి.
తేడా ఏం వుండదు కానీ వ్యక్తం చేసే పరిస్థితులే ఇద్దరికీ ఒకేలా ఉండవు మరి.
దొరకో మనకో తేలు కుడితే ఏం చేస్తాం.ఇల్లంతా ఏకం చేసేలా పెడబొబ్బలు పెడతాం. ఆ తర్వాత జరిగే హంగామా అంతా ఇంతా కాదు.
కానీ దొంగ పరిస్థితి అలా కాదే వచ్చిందేమో దొంగతనానికి. కుట్టిందేమో తేలు. బాధను మింగలేక కక్కలేక పడే యాతన ఏమిటో? ఏం జరిగిందో వికటకవి తెనాలి రామకృష్ణుడు రాసిన కథనొకటి చూద్దామా మరి.
ఆ రోజుల్లో పంటలు సరిగా పండక రాజ్యమంతటా కరువు తాండవిస్తోంది. దానితో దొంగల బెడద ఎక్కువయ్యింది.ప్రతి రోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతూ వుండేవారు.
తెనాలి రామకృష్ణుడికి అనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు తన ఇంటికి కూడా దొంగలు తప్పకుండా వస్తారు. వాళ్ళనుండి తమ నగా నట్రా ఎలా కాపాడుకోవాలా? అని ఆలోచిస్తూ వుంటే ఓ మంచి ఉపాయం తట్టింది.
వెంటనే దానిని అమలులో పెట్టి, భార్యతో ఏమేం చేయాలో చెప్పాడు. అనుకున్నట్టుగానే సరిగ్గా అదే రోజు రాత్రి ఒక దొంగ రామకృష్ణుడి ఇంటికి రానే వచ్చాడు.
అది గమనించిన రామకృష్ణుడు భార్యతో " ఏమోయ్..! మొన్న మా పెద్దన్న ఉంగరం ఇచ్చాడు కదా? అది ఎక్కడ పెట్టావు? అన్నాడు.
ఆ మాటకు " ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా? అయ్యో! నా మతి ముండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ. దాన్ని పెట్టెలో పెట్టడం మర్చే పోయాను " అంది.
ఎంత పని చేసావు? అదసలే లక్షల విలువైన వజ్రాల ఉంగరం. ఎవరైనా దొంగ ఎత్తుకు పోతే మన గతేంటి? కొంచెం కోపంగా అన్నాడు.
"ఏమీ కాదు కానీ పడుకోండి.పొద్దున్నే లేవగానే పెట్టెలో పెట్టేస్తాగా!" ఆవులిస్తూ అంది భార్య.
వాళ్ళిద్దరి మాటలు విన్నాడు దొంగ.
భార్యాభర్తలిద్దరూ గుర్రుపెట్టి నిద్ర పోవడం గమనించి మెల్లగా వెళ్ళి గూట్లో చెయ్యి పెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు.
అగ్గిపెట్టె అక్కడ పడేసి ఉంగరం వేలికి పెట్టుకుని పోదాం అనుకుని, దాన్ని తీసుకోవడానికి పెట్టెలో వేలు పెట్టాడు.
ఇంకేముంది తేలు చటుక్కున వేలుని కుట్టేసింది. నొప్పికి తాళలేక విలవిల్లాడాడు.అరిస్తే పదిమంది వచ్చి పట్టుకుంటారు. అలా బాధను మింగలేక కక్కలేక పట్టుకుంటారన్న భయంతో మెల్లిగా బయటకు నడవసాగాడు.
అదంతా గమనిస్తూ వున్న రామకృష్ణుడి దంపతులు గట్టిగా నవ్వుకున్నారు."మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రయినట్లుంది పాపం " అన్న రామకృష్ణుడి మోసమనీ ,అతడాడిన నాటకమని తెలిసిపోయి, కాలికి బుద్ధి చెప్పాడా దొంగ.
ఇదండీ "వృశ్చిక చోర న్యాయము" అంటే.
దీనికి సంబంధించిన మరో సరదా కథ . నా చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు. చూద్దామా...
ఒకానొక వూరిలో ఒక వినాయకుడి దేవాలయం ఉంది. అందులో ఉన్న హుండీలో డబ్బులను ఎవరో దొంగలు దోచుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులైన కొందరు దొంగలను పట్టుకొని గుడిలోకి తీసుకొని వచ్చి ఆలయ పూజారి ముందు నిలిపారు."వీరిలో ఎవరి మీదైనా మీకు అనుమానం వుందా?" అని అడిగారు.
అలా అనుమానించి నిర్ధోషిని దొంగను చేయడం ఎందుకని? అతడు పోలీసులకు ఓ సూచన చేశాడు.
అదేమిటంటే "ఒక్కొక్కరు వెళ్ళి వినాయడి బొడ్లో వేలు పెట్టాలి. అంతా ఆ గణపయ్యే చూసుకుంటాడు." అని చెబుతాడు.
దొంగల్లో ఒక్కొక్కరు వెళ్ళి వినాయడి బొడ్లో వేలు పెట్టి, అలా పక్కకు వచ్చి నిలబడుతున్నారు.ఇకదొంగతనం చేసిన వాడి వంతు వచ్చింది.అతడు వెళ్ళి వేలు పెట్టాడు.వెంటనే చటుక్కున తేలు కుట్టినట్లయింది.విలవిల్లాడుతూ బయట పడితే తానే దొంగనని తెలిసి పోతుందని నోరుమూసుకుని పక్కకు వెళ్లి నిలబడతాడు.
అసలే పోలీసులు కదా అతడిని గుర్తించి నిలదీశారు.తప్పు ఒప్పుకోక తప్పలేదా దొంగకు.
నిజంగా తేలు అందులో వుంటే మొదటి వ్యక్తినే కుట్టాలి కదా అనే అనుమానం మనందరికీ రావచ్చు.
అందులో ఉన్నది బొమ్మ తేలే. ముందు వాళ్ళు వేలు పెట్టి వచ్చారు. తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు భయపడలేదు.ఇతడు వేలు పెట్టగానే బొమ్మ తేలు వేలికి తాకడంతో కుట్టిందేమోనని భయపడి పోయాడు.అలా దొరికిపోయాడన్న మాట.
ఇదం
డీ! దొంగకు తేలు కుట్టినట్లు లేదా తేలు కుట్టిన దొంగ కథ.
అయితే మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి వారు కొందరు కొన్ని సందర్భాల్లో తారసపడుతూ వుంటారు.
అలాంటి వారిని గమనించి తేలులాంటి మాటల చురకలు వేసేవారు కూడా వుంటారు.
అలాంటివి చూస్తున్నప్పుడు మనకు ఈ "వృశ్చిక చోర న్యాయము" గుర్తుకు రాకుండా వుంటుందా! తగిన శాస్తి జరిగిందని అనుకోకుండా వుంటామా!.. చెప్పండి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి