సుప్రభాత కవిత ; -బృంద
చీకటికి సెలవిస్తూ
వేకువగ వరమిస్తూ
తూరుపును మెరిపిస్తూ
ఉదయించు వెలుగుపువ్వు

జలజల జలపాతాలు
గలగల పారే సెలయేళ్ళు
తళతళమనే ప్రవాహాలు
కలకలమంటూ పరుగులు.

గువ్వల కువకువలూ
పువ్వుల మిలమిలలూ
ఆకుల కలకలలూ
గాలుల గుసగుసలూ....

చురచురమనే తొలికిరణాలు
గజగజమనే చలికి సెలవులు
వెలవెలపోయే నింగిని తారలు
కళకళగా తోచే అవని అందం

జిలిబిలి నగవుల చిన్నిపువ్వులు
ఘుమఘుమ లాడే పరిమళాలు
కోయిల కుహుకుహూలు
గోరొంకల కిచకిచలూ....

అరుణోదయాన అవనీ సంబరం
రంగులతో వెల్లి విరిసే అంబరం
ప్రతిరోజూ జరిగే అద్భుతం
ఆదిత్యుని ఆగమన సమయం


మిన్నుల మెరిసే మిత్రుని రాకతో
కన్నుల నిండిన కన్నీరే
కమనీయ మూర్తికి
అర్ఘ్యమూ అభిషేకమూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు