నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 ముసలం పుట్టింది
----------------------------                    
        పోయేకాలం దగ్గర పడింది అనే అర్థం వచ్చే  విధంగా  ఈ *ముసలం పుట్టింది* నానుడిని వాడతారు. ఒక మంచి పనిని ఎవరైనా అడ్డగిస్తే  వీడికి ముసలం పుట్టే ఈ పని చేస్తున్నాడు అంటారు.  ముసలం పుట్టింది అంటే పోగాలం  వచ్చింది అని అర్ధం. అసలు ఈ ముసలం పుట్టింది నానుడి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కథ  మహా భారతంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ద్వారా వచ్చింది. 
      భారత యుద్ధం ముగిసింది. రాజ వంశాలన్ని నశించాయి. శ్రీకృష్ణుని దయవల్ల యాదవ వంశం మాత్రం మిగిలింది. దీనితో యాదవులకు గర్వం బాగా పెరిగింది. ఎవరిని లెక్క చేసే వారు కాదు. పెద్దల యెడల గౌరవం చూపకుండా  ఇష్టానుసారంగా జీవించసాగారు.  ఇలాంటి సమయంలో ద్వారక నగరం సమీపాన ఉన్న పిండారక తీర్ధానికి విశ్వామిత్రుడు, అసితుడు, కన్యుడు, దూర్వాసుడు, అంగీరసుడు, అత్రి వంటి మహా మునులు వచ్చారు. అక్కడ అల్లరి చేస్తున్న యాదవ యువకులు, ఆ మునులను ఆటపట్టించాలి అనుకున్నారు. వారిలో సాంబుడు అనే యువకుడికి ఆడవేషం వేశారు. పొట్ట చుట్టు వత్తుగా గుడ్డలు చుట్టి నిండు చూలాలుల తయారు చేశారు. మునుల వద్దకు వెళ్లారు.
       "అయ్యా! మీరు త్రికాల వేదులు కదా? ఈ అమ్మాయికి పుట్టబోయేది ఆడబిడ్డ? మగ బిడ్డ? సెలవీయండి?" అని అడిగారు. వారికున్న శక్తితో అంతా గ్రహించి కోపంతో  "యాదవ కులాన్ని నాశనం చేసే 'ముసలం పుడుతుంది' అని అక్కడ నుండి వెళ్లిపోయారు. 
     వారన్నట్టుగానే సాంబుడికి విపరీతమైన పురిటి నొప్పులు వచ్చాయి. ఇనుప ముసలం పుట్టింది.  వారు దాన్ని అరగదీశారు.  అరగదీసాక పదునుగా ఉన్న చిన్న కొన మిగిలింది. దాన్ని తీసుకు వెళ్లి సముద్రంలో కలిపారు. అమ్మయ్య అనుకున్నారు. మునుల శాపం ఊరకనే పోతుందా? ఆ మొనదేలిన ఇనుప ముక్కను చేప మింగింది. అది ఓ జాలరి వలలో పడింది. దాన్ని ఓ బోయవాడు కొన్నాడు. కూర కోసం బోయవాడు చేపను కోయగానే ఆ మొనదేలిన ఇనుప ముక్క కనిపించింది. దాన్ని అతడు తన బాణానికి ములుకులా పెట్టుకున్నాడు. 
   ఒకరోజు అతడు వనంలో వేటకు వెళ్ళాడు. దూరంగా అక్కడెక్కడో పడుకున్న శ్రీకృష్ణుని పాదం కనిపించి. దాన్ని వాడు కుందేలుగా భ్రమించాడు. ములుకున్న బాణంతో కొట్టాడు. అది శ్రీకృష్ణుని బొటన వ్రేలులో నుండి పాదంలోకి వెళ్ళింది. దాంతో శ్రీకృష్ణుడు తనువు చాలించాడు. ఆ తరువాత కొంత కాలానికి ద్వారక నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇలా యాదవ వంశం సర్వం నాశనం అయింది. ఈ కథ ఆధారంగా ఈ 'ముసలం పుట్టింది' అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఇది దీని కథ.

కామెంట్‌లు