సుప్రభాత కవిత ; - బృంద
అందరిలో ఒకరుగా
జన్మపొంది
కొందరితో రక్త బంధాలు
నిలుపుకుని
ఆత్మబంధువులను
ఎంచుకుని
రాగబంధాలు కొన్ని
ఏర్పరచుకుని
మూగబంధాలు కొన్ని
అలవరచుకుని
భవబంధాలు అన్నీ
కలుపుకుని
పేగు బంధాలను
పెంచుకుని
స్నేహ బంధాలు కొన్ని
చేసుకుని
మానవ సంబంధాలతో
నడచుకుని
ఏ బంధం ఎంత 
లోతైనదైనా

ఎవరూ చివరకు తోడు
రారనీ..

మన మనసు
మన ఆలోచనలు
మన ఆచరణలూ
మన సంస్కారాలు
మన అభిమానాలూ
మన నిర్ణయాలూ
మన గెలుపులూ
మన ఓటములూ

అన్నిటికీ మనమొకరే
బాధ్యత వహించాలనీ

అంచెలంచెలుగా 
అన్నీ విడిపోతూ వస్తాయనీ

అరిషడ్వర్గాల పైనే
మన పోరాటమనీ

అంతర్యామి సన్నిధికి
చేరడానికే ఆరాటపడాలనీ

ఆస్తులూ అంతస్థులూ
పదవులూ అధికారాలు

ఏవీ మనని ఇక్కడ
పదికాలాలు ఉంచవనీ

అహం వదిలితేనే
ఇహంలో సుఖమనీ

పరానికి ప్రయాణం
సుగమమౌతుందనీ

ఎరుక గలిగిన పయనమే
ఏలిక వద్దకు చేర్చుననీ

అన్నీతెలిసిన అమాయకులం
ఏమీ తెలియని మేధావులం

ఎన్ని ఆలోచనలు చేసినా
రేపటికై తూరుపు
చూడక తప్పదుగా!

ప్రచోదనమిచ్చే ప్రభాతానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు