పరమేశా!- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
1.  అణువై జగములు నిండి యాద్యుడవై స
ద్గుణముల్ జనుల కొసంగు దోష నివారా!
క్షణమైనను కనిపించి కావుము దేవా!
మణులేమియు వలదంటి! మా పరమేశా!//

2. ధరయందున నిను బోలు దైవము లేకే
పరమాత్మవనుచు నీదు పాదములే నా
శిరమందున ధరియింతు సేమము నొందన్
సిరులన్నియు తృణ మంటి!శ్రీ పర మేశా!//

3. సురపూజిత!పరమాత్మ!శోధన లేలా!
నిరతంబు నిను భజింతు నిష్ఠగ శంభో!
తరియింపగ!దయ జూపు దైవము నీవే!
పరిపాలక!కరుణించవా పరమేశా!/

4. జగమేలెడి హర!నీదు సన్నిధి చెంతన్
నిగమావళి నిరతమ్ము నిల్చును శంభో!
నగజాపతి!నిను నా మనంబున గొల్తున్
వగబాపగదె!సదాశివా!పరమేశా!//

5. సురగంగను సిగయందు సొంపుగ నీవే
మురిపెంబుగ ధరియించి మోదము తోడన్
జిరునవ్వులు చిలికించు శ్రీకర నిన్నే
వరమే యడగను!కావవా!పరమేశా!//

-------------------------


కామెంట్‌లు