సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు -250
వాల కర్కటక న్యాయము
*********
వాలః అంటే తోక.కర్కటః అంటే,ఎండ్రి  లేదా ఎండ్రకాయ, పీత,కర్కట రాశి.
నక్క తన తోకను పీత (🦀 )కన్నంలో పెడుతుంది.పీత ఆ తోకను పట్టుకోగానే చటుక్కున ఇవతలికి లాగి దాన్ని తింటుంది.
ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... నక్క ఆ ప్రాంతంలో తరచూ తిరుగుతూ వుండటం వల్ల,నక్కలోని దుర్మార్గమైన మనసును పీత గుర్తించలేక పోయింది. 
అలాగే దుర్మార్గుడు కూడా ఏమీ ఎరగనట్టు మన మధ్యే తిరుగుతూ వుంటాడు.మనం అతని దుర్మార్గమైన ఆలోచనలు పసిగట్టలేక పోతే అవకాశం రాగానే వెనువెంటనే కీడు, హాని తలపెడతాడు  అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే భాస్కర శతక కర్త ఇలా ద్రోహి/మోసకారి  గురించి ఇలా అంటాడు.
"పాపపు ద్రోవవాని కొకపట్టున మేను వికాస మొందినన్/లోపల దుర్గుణంబె ప్రబలుంగద నమ్మగగూడ దాతినిన్/ బాపట కాయకున్ నునుపు పైపయిగల్గిన కల్గుగాక యే/ రూపున దానిలో గల విరుద్ధపు జేదు నశించు భాస్కరా!"
అంటే దుర్మార్గునికి శరీర సౌందర్యమున్నా వాడి మనస్సులోని చెడు గుణం అలాగే వుంటుంది. పాపట కాయ పైకి రమణీయంగా కనిపించినా స్వతసిద్ధంగా దాని లోని చేదు విరగడం అసాధ్యం.ఉప్పు నీటి యూట నుంచి మంచినీళ్ళు పుట్టనట్లు పాతకుని మనస్సులో పాపపు ఆలోచనలే ఊరుతుంటాయి.వాడు ఎప్పుడూ మంచివాడు కాలేడు అంటారు.
 కాబట్టి దుర్మార్గుడు పైకి ఎంత మంచివాడుగా ఉన్నా లోపల దుష్టత్వం అలాగే వుంటుందనీ అలాంటి  వ్యక్తి వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని,మన వెంట తిరుగుతూనే అవకాశం రాగానే హాని తలపెట్టడానికి వెనుకాడడని గ్రహించాలి.
 "ద్రోహియైన వాడు సాహసంబున నెట్టి/ స్నేహితునికినైన చెరుపు చేయు/నూహ కలిగియుండు నోగుబాగులు లేక "
అలాగే  వేమన కూడా మోసకారి నైజాన్ని గమనించమని అంటాడు .
ద్రోహం చేసే బుద్ధి ఉన్న వాడు స్నేహితుడికి సైతం అపకారం చేయడానికి వెనుకాడడు.అలాంటి ద్రోహులు, మోసకారులు మన మధ్యే తిరుగుతూ వుంటారనీ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా  పీత వలె మోసపోవలసి వస్తుందని ఈ "వాల కర్కటక న్యాయము" ద్వారా మన పెద్దలు చేసిన హెచ్చరికలను గమనంలో పెట్టుకుందాం. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు