గురి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నీవు
ఓటముల పునాదులపైనే
నీ ఆకాశ హార్మ్యాలను నిర్మించుకో!
నిన్ను కిందికి వంచితే 
అగ్ని శిఖగా మారి పైకిలే!
నిన్ను భూమిలోకి అణగదొక్కితే
మొక్కై అనంతహస్తాలతో పైకిలే! 
నీవు ఒక చిరుదీపమైతే 
చిరుగాలే నిన్నార్పేస్తుంది! 
అందుకే, కార్చిచ్చుగా మారిపో!
నీవొక నీటి బిందువైతే
నీ నిశ్శ్వాసమే 
నిన్ను నామరూపాల్లేకుండా చేస్తుంది! 
అందుకే అనంతవారాశిగా మారిపో!
నిన్ను, ప్రాణంతీసే
బొగ్గుపులుసు వాయువనుకున్నవారికి 
నువ్వే, ప్రాణంపోసే
ప్రాణవాయువని తెలిసేలా చెయ్యి!
నువ్వు భూమిమీదే నిలబడు
కాని, ఆలోచనలతో 
అంతరిక్షంలోకి వెళ్ళు!
నీ లక్ష్యాన్ని ఎప్పుడూ అలక్ష్యం చేయకు 
నీ ధ్యేయం ఎప్పుడూ 
విజయాధ్యాయం కావాలి!
నీ గురి ఎప్పుడూ తప్పకు!!
*********************************

కామెంట్‌లు