తెలుగు విన్యాసాలు;- గుండ్లపల్ల్ రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగు
వెలుగులు చిమ్ముతుంటే
చూస్తా
సంతసిస్తా

తెలుగు
తేనెచుక్కలు చల్లుతుంటే
చప్పరిస్తా
తృప్తిపడతా

తెలుగు
సౌరభాలు వెదజల్లుతుంటే
ఆఘ్రానిస్తా
ఆనందిస్తా

తెలుగు
అందాలు చూపుతుంటే
వీక్షిస్తా
వినోదిస్తా

తెలుగు 
కవితలను వినిపిస్తుంటే
ఆస్వాదిస్తా
ఆహ్లాదిస్తా

తెలుగు
పాటలను పాడిస్తుంటే
వింటా
వీనులవిందు చేసుకుంటా

తెలుగు
చెంతకురమ్మని పిలిస్తే
పరిగెత్తుకుంటూ వెళ్తా
పరవశించిపోతా

తెలుగు
అమృతం కురిపిస్తే
పాత్రలలో పడతా
పలువురికి పంచుతా

తెలుగు
వర్షిస్తుంటే
తడుస్తా
తనువును శుభ్రపరచుకుంటా

తెలుగు
పారుతుంటే
దిగుతా
ఈతకొడతా

తెలుగు
వెన్నెల కాస్తుంటే
విహరిస్తా
వివిధకైతలు వ్రాస్తా

తెలుగు
తలలో తలపులులేపితే
కలంపడతా
కైతలు కాగితాలకెక్కిస్తా

తెలుగు
విన్యాసాలు చూపుతుంటే
పరికిస్తా
పరవశిస్తా


కామెంట్‌లు
Krishna Rao చెప్పారు…
కవిత చాలా బాగుంది. తెలుగు భాషాభిమానం బాగా తెలిపారు.అభినందనలు మీకు.