సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -255
విషభక్ష న్యాయము
   ****************
విష అంటే విషము లేదా గరళము. భక్ష అంటే భుజించడం లేదా తినడం.
విషమును తిని జీవించునట్లు….
అపాయకరమైన విషమును కొంచెం కొంచెంగా తినడం అలవాటు చేసుకొనుట వలన క్రమంగా దేహము దానికి అలవాటు పడి పోతుంది.తుదకు అది లేకపోతే బ్రతుకలేని పరిస్థితి ఎదురవుతుంది.
అదే విధంగా దుర్మార్గమైన పనులు లేదా  ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా మొదలు పెట్టిన వారికి చివరికి అవే ప్రవృత్తిలో భాగమై పోయి వృత్తిగానూ మారుతుందనే అర్థంతో ఈ "విషభక్ష న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అలవాటు అనేది  విష భక్షణం వంటిదే. దానిని నెమ్మదిగా మొదలు పెడితే అది తుదకు ఓ వ్యసనంగా మారుతుంది.మనసును తారుమారు చేస్తుంది.అది లేకపోతే బతకలేమనే పరిస్థితికి దిగజారుస్తుంది.
మొదట చిన్న ఆనందంతోనో, అవసరంతోనో మొదలైన చెడు అలవాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరంగా మారి ప్రవర్తనలో విపరీత ధోరణిని కలిగిస్తుంది.
 క్రమక్రమంగా దానికి మనసును, మనిషిని బానిస చేస్తుంది. 
అలా ఓ దుర్మార్గమైన ఆలోచన లేదా అలవాటు వ్యక్తిని దుర్మార్గపు వృత్తంలోకి లాగుతుందనేది నిజం.అదొక విష వలయం లాంటిది.అందులోకి ప్రవేశించిన తరువాత బయటికి రానివ్వదు. * మనిషి లోని యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది.
మనసు దానిని నియంత్రించే శక్తి కోల్పోయి, ఆ అలవాటు లేదా వ్యసనానికి  పూర్తిగా బానిసై పోతుంది.
హితులో సన్నిహితులో  ఆ అలవాటు, లేదా వ్యసనం మంచిది కాదు తప్పు అని ఎంత చెప్పినా ఒప్పుకోని స్థితిలోకి నెట్టివేస్తుంది.
ఇలా చెడు అలవాట్లకు లోనైన వ్యక్తి జీవితంలో ఎన్నో నష్టాలను పొందుతాడు.వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు.వంశ గౌరవం పోతుంది.
అలవాటు వ్యసనంగా మారడం అనేది కామ క్రోధాల వల్ల కలిగే దోషమని మహా భారతం చెబుతుంది.
 వ్యసనాలు ఏడు ఉన్నాయని వాటి జోలికి పోరాదని చెప్పిన మహా భారతంలోని ఈ పద్యాన్ని చూద్దాం.
"వెలది,జూదంబు,పానంబు,వేట,పలుకు/ప్రల్లదంబును దండంబు బరుసదనము/ సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత/యనెడు సప్త వ్యసనముల జనదు తగుల. "
స్త్రీ లోలత్వము,జూదమాడుట, మద్యపానము,వేటాడుట,పరుషంగా మాట్లాడటం,కఠిన దండన, వృధాగా ధనాన్ని వెచ్చించడం అనేవి సప్త వ్యసనాలు. ఎవ్వరు కూడా ఈ వ్యసనాల జోలికి పోకూడదు.పోతే ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలు  ఎంతగా దిగజారి పోయాయో  భారత, రామాయణాల్లోని  చాలా కథలు  మనకు  చెబుతాయి.
కాబట్టి విషము లాంటి చెడు వ్యసనాలను వదిలేద్దాం.
సమాజ హితమైన దానం, ధర్మం,పరోపకారం భూతదయ లాంటి వ్యసనాలను అలవర్చుకుందాం.సంతృప్తి, సంతోషాన్ని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు