సునంద భాషితం ; - వురిమళ్ళ సునంద, ఖమ్మం

 న్యాయాలు -268
వ్యాఘ్ర చోర ధనుర్న్యాయము
*******
వ్యాఘ్రము అంటే  పెద్దపులి.చోర అంటే దొంగ.ధను అంటే ధనుస్సు.
ఏదైనా జంతువును వేటాడాలి అనుకున్న పెద్దపులి ఎంతో భయపడేదాని వలె పొదల మాటున  పొంచి వుంటుంది.తాను తినాలనుకున్న జంతువు సమీపంలోకి రాగానే చటుక్కున మీద బడి చంపేస్తుంది.
దొంగ కూడా అలాగే ఎవరింట్లోనైనా దొంగతనం చేయడానికి వెళితే తన  పాదాల కింద ఉన్న చీమకు కూడా ఏ మాత్రం నొప్పి కలుగకుండా అడుగులు వేస్తూ , ఇంటిలో ఉన్న వారికి ఎలాంటి నిద్రాభంగం కలగకుండా , చడీచప్పుడు కాకుండా ఆ ఇంటికి కన్నం వేసి దోచుకుని వెళతాడు.
ఇక ధనుస్సు విషయానికి వస్తే బాణం సంధించేముందు వినయముతో వంగుతుంది.అలా విడిచిన బాణం ఎవరికో ఒకరికి హాని కలిగిస్తుంది.
ఇలా దుర్మార్గులైన వ్యక్తులు కూడా ఎంతో అణుకువతో ఉంటూ నమ్మించి మోసం చేస్తారని  చెప్పడానికి మన పెద్దలు ఈ "వ్యాఘ్ర చోర ధనుర్న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
  పరవస్తు చిన్నయసూరి గారు రాసిన పంచతంత్ర కథల్లో మిత్రభేదంలో ఆషాఢభూతి అనే కథ ఉంది. ఈ ఆషాఢభూతి అనే వాడు తన గురువును ఎలా నమ్మించి మోసం చేస్తాడో తెలుసుకుందామా...
దేవశర్మ  అనే వ్యక్తి స్వాముల వారిలా నటిస్తూ ఉండేవాడు.ధన కనక వస్తు వాహనాల మీద ఎలాంటి ఆసక్తి లేనట్లుగా నటించే వాడు.
అలా ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి లేని వాడుగా, వైరాగ్య భావనతో కనిపించే అతడిని భక్తులు విపరీతంగా నమ్మేవారు.అతడు ఎంత వద్దన్నా భక్తులు మరింత భక్తితో కానుకలు సమర్పించుకునేవారు.అలా వాళ్ళు ఇచ్చినవి వద్దు వద్దంటూనే ఇచ్చినవన్నీ పుచ్చుకుని రహస్యంగా దాచేసేవాడు. అతడికి పడుకోవడానికి ఓ బొంత వుండేది. రాత్రి  ఆ బొంతలోని మడతల్లో నోట్లను పెట్టి పైకి కనబడకుండా కుట్లు వేసేవాడు.అలా పైకి  ఏమీ అవసరం లేని విరాగిగా నటిస్తూ  లోలోపల ఈ  వ్యామోహపు పనులు చేసేవాడు. బొంతలో డబ్బు ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడూ, ఎక్కడా వదిలి పెట్టకుండా పట్టుకొని తిరిగే వాడు.
ఇదంతా ఆషాఢభూతి అనే దొంగ పసిగట్టాడు.ఆ సొమ్మును ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. అనుకున్న తడవుగా పరమ భక్తుడి వేషం వేసుకుని  స్వాముల వారైన దేవశర్మ దగ్గర చేరాడు. అతి వినయంతో  గురువు గారూ! గురువు గారూ! అంటూ  అతి  భక్తితో చెప్పకుండానే పనులు, సేవలు చేయ సాగాడు. 
దేవశర్మ ఆషాఢభూతి సేవలకూ,వినయవిధేయతలకు  పొంగిపోయాడు. తన దగ్గర జ్ఞానధనాన్ని పొందాలని ఆశతో వచ్చానని శిష్యుడిగా స్వీకరించమని వేడుకున్న ఆషాఢభూతి మాటలు నమ్మి అలాగేనని అన్నాడు.ఇక అప్పటి నుండి గురువుగారూ అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంట వెళ్ళే వాడు.తనకు కూడా ఐహిక సుఖాల మీద,పరుల సొమ్ము మీద ఆశలేదన్నట్లుగా నటించేవాడు.
 ఓ రోజు భక్తులకు జ్ఞాన బోధ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. ఆషాఢభూతి చటుక్కున తన పంచెకు అంటుకున్న గడ్డిపరక చూసి,దాన్ని  దేవశర్మకు చూపుతూ "ఘోరం జరిగిపోయింది గురువుగారూ! ఈ గడ్డి పరక ఎవరిదో వారికి ఇచ్చేసి వస్తాను" అన్నాడు.
గడ్డి పరకే కదా ఫర్వాలేదులే అన్నా వినకుండా "మనది కానిది ఏది మన దగ్గర వుంచుకోకూడదని మీరే కదా చెప్పారు. అందుకే అది ఎవరిదో తెలుసుకుని ఇచ్చి వస్తాను." ఎంత చెప్పినా వినకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి పోయి కొద్ది సేపయిన తర్వాత వచ్చి "హమ్మయ్య! ఇచ్చి వచ్చాను"  అన్నాడు.
అతనిలోని నిజాయితీకి ఎంతో సంతోషపడ్డాడు దేవశర్మ. ఎంతో నమ్మకమైన శిష్యుడు దొరికాడని సంబరపడి పోయాడు. తన దగ్గర ఉన్న  బొంతను కూడా ఇచ్చే ‌స్థితికి వచ్చాడు.
బొంతలో డబ్బు రోజు రోజుకూ పెరుగుతుండటంతో మోయలేక పోతున్నాడు. ఆషాఢభూతితో ఆ బొంతను మోయమని చెప్పాడు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తూ  నమ్మకంగా మోస్తున్నట్టు నటించిన ఆషాఢభూతి ఎంతో వినయంగా దాన్ని మోస్తూ మోస్తూ ఆ బొంతతో సహా ఓ రోజు ఉడాయించాడు.
"ఔరా! నేనే జనాలను ఆకట్టుకొని మోసం చేసి సంపాదిస్తే, అంతకంటే వినయం నటించి ఎంత పని చేశావు ఆషాఢభూతీ? అనుకుంటూ సొమ్మసిల్లి పడిపోయాడు.
ఇలా నమ్మించి మోసం చేసే  వాళ్ళు ఉంటారు తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్న ఈ "వ్యాఘ్ర చోర ధనుర్న్యాయము" లోని విషయాలను, విశేషాలను ఆకలింపు చేసుకుని తగు జాగ్రత్తతో మెలుగుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు