సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -254
విష కృమి న్యాయము
***************
విష కృమి అంటే విషములో పుట్టిన పురుగు లేదా విష పురుగు.
విషములో పుట్టిన పురుగు విషమే తిని జీవిస్తుందనీ,మనుషులు కూడా అలాగే జీవిస్తారనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
 ఇదే విషయం  చాణక్య నీతి దర్పణములో కూడా చెప్పబడింది.ఈ" విష కృమి న్యాయము"ను మానవులకు అన్వయింప చేస్తూ  ఓ చక్కని సంభాషణ కూడా ఉంది.
అదేమిటో చెప్పుకునే ముందు చాణక్యుడు గురించి రేఖా మాత్రంగా తెలుసుకుందాం.
చాణక్యుడు చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మహా మేధావి.ఈయనను కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు.ఈయన మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు.
ఇతడు రాసిన అర్థశాస్త్రం ఎంత ప్రాముఖ్యత పొందినదో అందరికీ తెలిసిందే.
అర్థశాస్త్రంతో పాటు, రాజనీతి శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం , నీతి శాస్త్రము  మొదలైనవి రాశాడు.
ఇతడు రాసిన చాణక్య నీతి చాలా ప్రసిద్ధి పొందినది.సంస్కృతంలో చాణక్య నీతి దర్పణము  అని రచించిన పుస్తకంలోని నీతి కథలు నేటికీ ఆచరణ యోగ్యంగా ఉండటం విశేషం. ఇందులో జీవిత సత్యాలతో పాటు, జీవితంలో విజయాలు సాధించాలంటే ఏం చేయాలో చెప్పారు.
అలాంటి గొప్ప శాస్త్రమైన చాణక్య నీతి దర్పణములోని జీవనసత్యానికి సంబంధించినదే ఈ సంభాషణ.
అదేమిటో చూద్దామా మరి...
ఒకానొక వ్యక్తి యాచనకై  అంటే  అడుక్కోవడానికి ఓ వూరికి  వెళతాడు.
ఆ సమయంలో ఆ వూరికి సంబంధించిన వ్యక్తి ఊరి వెలుపల తారసపడతాడు.యాచకుడు అతనిని ఆ ఊరి  గురించి విశేషాలు తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
యాచకుడు అడిగిన  ప్రశ్నలకు ఆ వూరి వ్యక్తి ఎలాంటి సమాధానాలు చెబుతాడంటే...
యాచకుడు: అయ్యా! ఈ వూరిలో అందరికన్నా గొప్పవాడు ఎవరు?
ఆ వూరి వ్యక్తి దానికి "అదిగో ఆ తాటితోపు" అని జవాబిస్తాడు.
"మరి ఇచట సమర్థుడైన వ్యక్తి ఎవరు? అని అడిగితే 
"పరుల ధనమును, ఆస్తులను దొంగిలించుటలో ఈ వూరి వారంతా సమర్థులే" అంటాడు.
"పోనీ, దాత ఎవరో చెప్పగలరా? "
మా వూరి రజకుడు.అతడొకడే వూరంతటికీ మహా దాత. ఎందువలన అంటే ఉదయం తీసుకొని పోయిన వస్త్రాలను రాత్రికి మరల తెచ్చి ఇస్తాడు." అంటాడు.
ఈ జవాబులతో ఖంగు తిన్న యాచకుడు"అయ్యో! అవునా! మరి ఇలాంటి వూరిలో మీరెలా ఉండగలుగుతున్నారు? అని  బాధని వ్యక్తం చేస్తాడు.
అప్పుడు ఆ  వ్యక్తి "అయ్యా! ఏమి చెప్పను."విషకృమి న్యాయము"గా జీవించుచున్నాను.అంటాడు.
ఈ వూరిలో పుట్టిన వాడిని అవడం వల్ల ఇచటి పరిస్థితులకు, మనుషుల ప్రవర్తనకు అలవాటు పడి బతుకుతున్నాను."అంటాడు.
 మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే విషములో పుట్టిన పురుగుకు విషమే ఇష్టమైన ఆహారం. ఆ విషము దానిని ఏమి చేయదు. కానీ ఆ విషకృమి వల్ల ఇతరులకు మాత్రం తప్పకుండా హాని కలుగుతుందని అర్థం.
అలాగే ఆహార పదార్థాల విషయంలో గమనించినట్లైతే "ఒకరి శరీరానికి పడిన పదార్థాలు మరొకరికి పడవు. అవి తినడం వలన ఎలర్జీ లాంటి దుష్ఫలితాలు ఇస్తాయి. హాని కలిగిస్తాయి.
ఇక మనస్తత్వాల విషయానికి వస్తే కూడా అదే  వర్తిస్తుంది.కొందరి మనోభావాలు ఆధ్యాత్మిక దృష్టితో ఉంటాయి.మరికొందరి మనోభావాలు భౌతిక దృష్టితో ఉంటాయి.
వారిలోని విరుద్ధ భావాలు, సిద్దాంతాలు ఎప్పుడూ కలవవు.కలవాలనే మానసిక సంసిద్ధత కూడా ఉండక పోవచ్చు.బలంగా వేళ్ళూనుకున్న భావజాలం ఒక పట్టాన ఒప్పుకోనీయదు. "విషకృమి న్యాయము" వలె వారి వారి లక్షణాలను బట్టే ,ఒకరి పొడ ఒకరికి గిట్టకుండా జీవిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.
 ఇదండీ "విషకృమి న్యాయము" యొక్క కథా కమామీషు. బావుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు