సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -252
విప్రతిషేధ న్యాయము
**********
విప్రతిషేధము అంటే మిక్కిలి అడ్డగింత, మిక్కిలి ప్రతికూలము,నిషేధము అని అర్థం.
రెండు కార్యములకు తుల్య బల విరోధములు అనగా మిక్కిలి ప్రతికూలతలు వచ్చినప్పుడు అందులో ఒక దానిని విడిచి బలవత్తరమైన రెండవ దానిని ఆశ్రయించుట లేదా ఆచరించుటను, చేయుటను  మన పెద్దలు ఈ  "విప్రతిషేధ న్యాయము"తో పోల్చి చెబుతారు.
బలాబలాలను గురించి చెబుతూ ఎవరితో ఎలా మెలగాలో చెప్పిన ఈ క్రింది సంస్కృత సుభాషితాన్ని చూద్దాం.
"అనులోమేన బలినాం ప్రతిలోమేన దుర్జనమ్/ఆత్మ తుల్య బలం శత్రువు వినయేన బలేన వా /"
అంటే శక్తివంతమైన వ్యక్తులను సానుకూలంగా, మర్యాద పూర్వకంగా చూడాలి మరియు దుష్ట వ్యక్తులతో చాలా దృఢంగా, వ్యతిరేక పద్ధతిలో వ్యవహరించాలి. ఇక శత్రువు కలిగి వుంటే అతడు మనతో సమానమైన శక్తి కలిగి వుంటే.. అలాంటప్పుడు అతనితో మర్యాదగా లేదా ప్రస్తుత పరిస్థితులను బట్టి దృఢంగా వ్యవహరించాలి.అని అర్థము.
 మనం ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు కొన్ని అవకాశాలు ఎదుట కనిపిస్తూ ఉంటాయి. వాటిలో దేనిని స్వీకరిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అనేది ఆ అవకాశాల బలాబలాలను బట్టి ఉంటుంది.
ఫలాన దానిని ఆశ్రయిస్తే లేదా ఆచరిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు  రెండింటిలో ఒకదానిని మాత్రమే స్వీకరించడం జరుగుతుంది.
అంటే ఇక్కడ ఇతర అవకాశాన్ని ఇది అడ్డగిస్తుంది లేదా వ్యతిరేకిస్తుందని అర్థం.
 ఇంకా సామాన్యమైన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు అన్వయం చేసినట్లయితే...ఒకే రోజు ఒకే సమయంలో రెండు ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళ వలసి ఉంటుంది.మరి రెండింటికీ ఒకేసారి వెళ్ళడమనేది అసాధ్యం.
అలాంటప్పుడు మనం ఆ రెండింటిలో ఏది బలవత్తరమైనదో,అవశ్యమైనదో,అత్యవసరమైనదో దానికే ప్రాముఖ్యత ఇస్తాం...అంటే మరొక దానిని ఇది నిరోధించినట్లే కదా!
అంటే రెండూ సమాన బలాలు ఉన్నప్పటికీ  ఒకదానిని విడిచి మరో దానిని ఆశ్రయించడమన్న మాట.
అలాగే మనకు ఇష్టమైన వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే స్వీకరించాలి అన్నప్పుడు, దేనివైపు మనసు మొగ్గు చూపుతుందో, బలంగా కోరుకుంటూ ఉంటుందో దానినే చివరకు స్వీకరిస్తాం.
ఇలా మంచి ,చెడులు కూడా మనుషుల స్థిరత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని పట్టి సమానంగా ప్రభావితం చేస్తుంటాయి. అయితే తీసుకునే తుది నిర్ణయాన్ని బట్టి ఆ యా వ్యక్తుల్లో ఏది విప్రతిషేధము అయ్యిందో గమనించి దానిని బట్టి ఆయా వ్యక్తుల మనస్తత్వాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.
ఇలా ఉద్యోగ, ఉపాధి, కుటుంబం,బంధాల అనుబంధాల్లో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు తీసుకునే నిర్ణయాల్లో  ఏదో ఒకటి ఇతరములను అన్నింటినీ  పక్కకు పెట్టేసి తీసుకునే తుది నిర్ణయం ఈ "విప్రతిషేధ న్యాయము"నకు సరిగ్గా సరిపోతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు