సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -257
విష వృక్ష న్యాయము
***********
విష వృక్షము అంటే విషపు చెట్టు,విషపూరితమైన చెట్టు అని అర్థం.
మన చేతుల్తో నాటిన మొక్క వృక్షమైనందుకు సంతోషించాలో పెంచినది విష వృక్షమని తెలిసి చంపుకోవాలో? వద్దో ?అనే సంశయంలో పడిపోయి, చివరికి దానిని చేజేతులా నరికి వేయలేక వదిలేయడాన్ని "విషవృక్ష న్యాయం"తో పోలుస్తూ వుంటారు.ఇక్కడ మనకు కనిపించేది  పెంచిన ప్రేమ.
అది విష వృక్షం కదా! దాని వల్ల నష్టమే కానీ ఎలాంటి  లాభం లేదు కాబట్టి నరికేయడంలో తప్పులేదు.నరికేయొచ్చుననే  వారి తర్కంతో  ఏకీభవించక విష వృక్షము అయిననూ  మాచే  పెంచ బడింది కాబట్టి చంపలేము.చంపకూడదని  వాదించడం.
దానిని బలపరుస్తూ, మానవులకు అన్వయించి చూపిస్తూ...
పుట్టిన సంతానంలో ఎవరైనా దుర్మార్గుడు అయితే అతన్ని ఏ తల్లిదండ్రులూ చంపుకోరు కదా ! అంటారు.
మహా భారతంలో విదురుడు దృతరాష్ట్రుడితో దుర్మార్గుడైన దుర్యోధనుని వెళ్ళగొట్టి కురు వంశాన్ని కాపాడుకొమ్మని హితవు చెబుతాడు.ఆ మాటలకు దృతరాష్ట్రునికి చాలా కోపం వస్తుంది. "వాడు నా కన్నకొడుకు. వాడిని నేను వదిలి పెట్టలేను" అంటాడు.అంటే తల్లిదండ్రులకు కన్నవారి మీద ఎంత ప్రేమ వుంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే 'గుడ్డిప్రేమ' అంటారు.
 ఇక నరకాసుర వధ  కథను చూసినట్లయితే ... దుష్టుడైన తన కుమారుని సాక్షాత్తు తల్లియే చంపిందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
నిషిద్ధ సమయంలో అంటే అసుర సంధ్య వేళ కలిసిన భూదేవికీ,విష్ణువుకు ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ సమయ ప్రభావం వల్ల అతడిలో అసుర లక్షణాలు అంటే రాక్షస గుణాలు కలుగుతాయని భార్య భూదేవికి చెబుతాడు.ఆ మాటలు విన్న భూదేవి చాలా బాధ పడుతుంది.
 ఎప్పటికైనా విష్ణువు చేతిలో అతడికి మరణం తప్పదని భావించి అతడి చేతుల్లో మరణం లేకుండా వరం కోరుతుంది.
అప్పుడు విష్ణుమూర్తి అతడికి తన తల్లి చేతుల్లోనే మరణం వుంటుందని హెచ్చరిస్తాడు.
ఆ మాట విన్న భూదేవి "ఏ తల్లి అయినా తన బిడ్డను చంపుకోదు" అతడికిక ఏం ప్రమాదం లేదని భావిస్తుంది.
పెరిగి పెద్దవాడైన నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష పురమనే రాజ్యాన్ని పరిపాలిస్తూ వుంటాడు.
అప్పటి వరకు చక్కగా పరిపాలన చేసిన నరకుడు పక్క రాజ్యానికి రాజైన బాణాసురుడితో స్నేహం చేస్తాడు. బాణాసురుడి దృష్టిలో స్త్రీ భోగవస్తువు. అతడితో స్నేహం చేయడం వల్ల నరకాసురుడు కూడా అదే విధంగా మారిపోతాడు.వరగర్వంతో ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తాడు.అతడి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది.మరో జన్మలో శ్రీకృష్ణుడి భార్య సత్యభామ రూపమెత్తుతుంది‌ భూదేవి.నరకాసురుడిని వధించడానికి వెళ్తున్న శ్రీకృష్ణుడి వెంట నేనూ యుద్దానికి వస్తానని బయలు దేరుతుంది.సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడిని ఎగతాళి చేస్తాడు నరకుడు.
అప్పుడు సత్యభామ క్రోధావేశాలతో తన విల్లు తిప్పి బాణాలను వేగంగా  విసిరుతుంది.
దానితో  నరకుడు మరింత విజృంభించి శక్తి ఆయుధాన్ని కృష్ణుడి పైకి సంధిస్తాడు. దానితో కృష్ణుడు మూర్చపోతాడు.అది చూసి తల్లడిల్లి పోతుంది. వెంటనే తన దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధాన్ని నరకాసురుడిపై విసురుతుంది.అది వెళ్ళి నరకాసురుని గుండెల్ని చీల్చడంతో అతడు చనిపోతాడు. 
అంటే ఇక్కడ మనం  గమనించాల్సిన విషయం ఏమిటంటే తల్లి తన బిడ్డ అనే మమకారం కంటే అతడి వల్ల సమాజానికి కలిగే హానిని దృష్టిలో పెట్టుకొని అతడిని సంహరించడం.
మన తెలుగులో  సామెత  ఉంది "తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు"అని. ధర్మ పరిరక్షణ , సాధు రక్షణ కోసం ఇలాంటివి తప్పవని  పై కథ చెబుతోంది.
 పెంచుకున్న మమకారం,కన్నపేగు అనురాగం కంటే సమాజ హితమే ముఖ్యమని ఈ విష వృక్ష న్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు.
 కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల తప్పులను దాచి పెడుతూ వుంటారు.అవి చివరికి వాళ్ళ మెడకే పాముల్లా చుట్టూ కోవడం చూస్తున్నాం. సమాజంలో  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే  ఏం చేయాలో, చేయకూడదో ఈ "విషవృక్ష న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు