సుప్రభాత కవిత ; - బృంద
చిరునవ్వు నీకే
విరితావి నీకే
చిరుజీవం నీదే
అంతర్యామీ!

అణువంత ప్రాణం
అందమైన రూపం
అలవికాని ఆరాధన
ఈ వరము నీదే స్వామీ!

నులివెచ్చని తాకిడికి
విరిబాల వికసించి
సిరివెలుగున కళలు చిందు
అరుణోదయ తరుణం

సుమకోమల స్పర్శతో
మమకారం పెరిగి
కుసుమాన్ని ముద్దాడె
దినకరుని కిరణం

చిన్నిపువ్వుకు అరుదైన
చిరుదీవెన వరమై దొరికి
తన జన్మమె ధన్యమై
దాసోహమనె దివాకరునికి

కలతీరగా కనులనిండా
కమనీయమూర్తిని
కనిపించు వరకూ 
కరువుతీర చూస్తూ...

కలగ కరిగి పోయాక
కళలు మాసిపోయి
ఇలను రాలిపోవు
కలతలేని జన్మ  పువ్వుదమ్మా!

అందరికీ  ఆత్మబంధువైన 
ఆదిత్యుని ఆగమనవేళ
అరవిరిసిన కుసుమాల
అపురూపమైన స్వాగతం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు