రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఉమామహేశ్వరి ఎంపిక

 విజయనగరం జిల్లా, రేగిడి ఆముదాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న బూరవెల్లి ఉమామహేశ్వరి, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వారు ఈనెల ఐదున విశాఖపట్నంలో నిర్వహించనున్న గురుపూజోత్సవ వేదికపై ఉమామహేశ్వరికి పురస్కార ప్రదానం చేయనున్నారు. 
1998లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా విధుల్లో చేరి, 2001 డిఎస్సీ ద్వారా బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. 2018లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
2020లో జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ జెఆర్సీ నోడల్ అధికారిణిగా పురస్కారం పొందారు.
ఈ సంవత్సరం సైన్స్ దినోత్సవం రోజు  ఇండియాలో  సారాభాయ్ టీచర్స్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికైనారు. 
డిజిటల్ టెక్నాలజీని సైన్స్ బోధనలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
 విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో ఈ పాఠశాలలో  అనేక సైన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయి లో జరిగే అనేక కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు పాల్గొంటూ బహుమతులు సాధిస్తున్నారు. 
గత సంవత్సరం ఐఐటి హైదరాబాద్ మరియు విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీ లో జరిగిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ కి విద్యార్ధులను తీసుకు వెళ్ళడం  జరిగింది. ఈమె చేసిన సేవలు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్  పాఠశాలకు గోల్డెన్ ఇన్స్టిట్యూషన్ అవార్డును ప్రకటించారు.  
'ఉమా సైన్స్ గురు' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవసరమైన వీడియోలను 115వరకూ రూపొందించారు. సుమారుగా 2000 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ విభాగంలో భాగంగా రెండుసార్లు మహా రక్తదాన శిబిరాలను విద్యార్థులచే నిర్వహింపచేశారు.   
ఎన్జీసీ నోడల్ ఆఫీసర్ గా పాఠశాలలో గుడ్డ సంచులపంపిణీ, మొక్కలపెంపకం, స్వచ్ఛతే సేవ వంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఈమెను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. 
ఉమామహేశ్వరి తండ్రి బూరవెల్లి త్రినాధరావు
పాడేరు డెప్యూటీ కలెక్టర్ గా పనిచేసియున్నారు. అమ్మ పద్మావతి గృహిణి.
ఉమామహేశ్వరి భర్త బలివాడ వెంకటరమణ, ప్రస్తుతం శ్రీకాకుళంజిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తూయున్నారు. 
శ్రీకాకుళం వాస్తవ్యులైన ఉమామహేశ్వరి, ఎంఎస్సీని చెన్నై అన్నామలై యూనివర్సిటీలో, బి.ఇడి.ఉపాధ్యాయ శిక్షణను శ్రీకాకుళం గురజాడ కళాశాలలోనూ పూర్తిచేసారు. 
ఆముదాలవలస మండలం తురకపేట, పాలకొండ మండలం పొట్లి, అర్దలి, బాలికోన్నత పాఠశాలందు పనిచేసి, ప్రస్తుతం రేగిడిఆముదాలవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సేవలను 22యేళ్ళుగా కొనసాగిస్తున్నారు. 
ఉమామహేశ్వరి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికగుట పట్ల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వావిలపల్లి లక్ష్మణరావు, మండల విద్యా శాఖాధికారి ఎం.వి.ప్రసాదరావు, సర్పంచ్ కె.రవిశంకర్, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఎం.రామకృష్ణ, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు