కవితలకబుర్లు ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలం
పట్టమంటుంది
కాగితం
నింపమంటుంది

గళం
విప్పమంటుంది
గానం
ఆలపించమంటుంది

విషయాలు
వెంటబడుతున్నాయి
కవితలు
కూర్చమంటున్నాయి

అక్షరాలు
అర్ధిస్తున్నాయి
పదాలు
ప్రార్ధిస్తున్నాయి

ఆలోచనలు
తడుతున్నాయి
భావాలు
పుడుతున్నాయి

ప్రాసలు
పొసుగుతున్నాయి
పంక్తులు
ప్రవహిస్తున్నాయి

పత్రికలు
ఎదురుచూస్తున్నాయి
పాఠకులను
నిరీక్షింపచేస్తున్నాయి

ఫేసుబుక్కు
పంపమంటుంది
వాట్సప్పు
పెట్టమంటుంది

ఈమైలు
తొందరచేస్తుంది
మెస్సెంజరు
ముందుకొస్తుంది

సమూహనిర్వాహకులు
కోరుతున్నారు
బృందాలసభ్యులు
కాచుకొనియున్నారు

కవిలోకం
కలంపట్టి కృషిచేస్తుంది
పాఠకలోకం
పఠించి పరవశించాలనిచూస్తుంది


కామెంట్‌లు