సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -247
వాయు శైత్యౌష్ణ న్యాయము
*****
వాయువు అంటే గాలి,పయ్యెర,మారుతం,పవనం,అనిలం, ప్రభంజనం వాయువుకు పర్యాయ పదాలుగా చెప్పబడినవి.శైత్యం అంటే చలువ, జలుబు. ఉష్ణము అంటే వెచ్చని, వేడి.
గాలికి చల్లదనమును, వేడిని ఆపాదించినట్లు...
 
వాయువుది మనకంటికి కనిపించని అదృశ్య స్థితి.వాయువు యొక్క పదార్థాలు చాలా ఎక్కువ వేగంతో శాశ్వత కదలికలో ఉంటాయి.
వాయువుకు ఎటువంటి ఆకారము గానీ ఖచ్చితమైన ఘన స్థితి కానీ వుండదు.
కానీ "ఇందుగలడందు లేడను సందేహం వలదు చక్రి " అన్న చందంగా వాయువు అంతటా వ్యాపిస్తుంది‌,విస్తరిస్తుందన్న మాట.
అయితే గాలి మన జీవితం ఉనికిలో ఉండటానికి, మొక్కలు, జంతువులు జీవించడానికి  ఉపయోగపడుతుంది.వాయువు సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునేందుకు ఓ పొరను కూడా ఏర్పాటు చేస్తుంది.
అలాంటి వాయువుకు వేడి లేదా వెచ్చదనం, చల్లదనం అనే లక్షణాలు ఏమీ ఉండవు. కానీ వాయువును స్పర్శ ద్వారా అనుభూతించవచ్చు.వాతావరణంలో మార్పులను బట్టి  వాయువు లక్షణం మారుతుంది.
 వాతావరణం వేడిగా వుండే సమయంలో వాయువు కూడా వేడిగా మారుతుంది. చల్లని ప్రదేశంలో చల్లగా మారుతుంది.
వాయువు రస అంటే రుచి, గంథ అంటే వాసన, రూపం అంటే రూపములనే గుణాలను త్యాగం చేయడం వల్ల వాయువును మనం కళ్ళతో చూడలేము. వాయువే తనంత తానుగా మనల్ని స్పృశించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
 ఈ వాయువు తాను తిరిగే ప్రదేశాన్ని బట్టి తన గంథ  గుణాన్ని మార్చుకుంటూ ఉంటుంది.పూల తోటలో తిరిగేటప్పుడు పరిమళభరితమై మనసును ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
 
దుర్గంధ భూయిష్టమైన ప్రదేశాలలో తిరిగేటప్పుడు దుర్గంధముతో  మనిషిని యిబ్బంది పెట్టడమే కాకుండా తన స్వచ్ఛతను కోల్పోయి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా శైత్య, ఉష్ణ ప్రదేశాలలో సంచరించినప్పుడు వాటి లక్షణాలను గ్రహించి చల్లగానూ, వేడిగానూ మారిపోతుంది.
 మరి ఈ "వాయు శైత్యౌష్ణ న్యాయాన్ని"  మన పూర్వీకులు ఎందుకు ఉదహరించి వుంటారో లోతుగా అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏమిటంటే...
 మనం ఎలాంటి ప్రదేశాలలో   ఉండటానికి ఇష్టపడితే అలాంటి లక్షణాలను పొందుతాము. పూలవంటి ఉత్తమ లక్షణాలు కలిగిన వారితో ఉంటే మనమూ అలాంటి ప్రదేశంలో సంచరించిన పరిమళభరితమైన వాయువు వలె రస గంథ గుణాలను పొందగలము. 
ఇదండీ "వాయు శైత్యౌష్ణ న్యాయము" యొక్క  అంతరార్థము.ఇందులోని మంచిని గ్రహిద్దాం. ఆచరిస్తూ ఆనందంగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు