సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -251
వాలి సుగ్రీవ న్యాయము
**************
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు.సుగ్రీవునికంటే వాలి మహా బలవంతుడు . 
 బలవంతులో, బలహీనులో.. ఎవరైతేనేం.ఈ అన్నదమ్ములకు సంబంధించిన న్యాయము ఏమిటా? అనే సందేహం తప్పకుండా వస్తుంది.ఐతే వారిలోని బలాబలాలను గురించి అంచనా వేస్తూ, న్యాయము ఎటువైపు ఉంటే అటు వైపే చివరికి గెలుపు తథ్యమనే విషయాన్ని చెప్పడమే ఇందులోని అంతరార్థంగా గ్రహించాలి.
ఇక వారి బలాబలములు మనకు అవసరమా అని అనిపించవచ్చు కానీ అసలు విషయం తెలిస్తే ఈ ప్రస్తావన అవసరమేనని తెలుస్తుంది.
కిష్కింధకు రాజు వాలి.ఓరోజు మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధానికి దిగుతాడు కానీ. వాలి బలం,శక్తి ముందు నిలువలేక భయపడి పారిపోతుంటే శత్రువైన అతడి అంతు చూస్తానని వెంటబడి  పరుగెత్తుతాడు.
మాయావి ఓ పెద్ద  బిలంలోకి అంటే  గుహలోకి వెళ్తాడు.వాడిని సంహరించి వచ్చేంత వరకూ ఆ గుహ వద్ద ఉండమని తమ్ముడైన సుగ్రీవునికి చెబుతాడు.
సంవత్సరం గడిచింది. ఓ రోజు ఆ గుహ లోపలి నుండి అరుపులు, కేకలు నురుగుతో కూడిన రక్తం ప్రవహిస్తూ బయటకు వస్తుంది.ఇక అన్నయైన వాలి మాట గానీ, అలికిడి గానీ వినబడలేదు. తన అన్న వాలి చనిపోయి వుంటాడని ఆ రాక్షసుడు బయటికి వస్తే ప్రమాదమని భయపడి ఆ గుహ ద్వారం వద్ద పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి విచారంగా కిష్కింధకు వస్తాడు.
వాలి విషయం తెలిసిన మంత్రులు సుగ్రీవుని రాజును చేస్తారు.అలా రాజ్య పాలన చేస్తున్న సమయంలో హఠాత్తుగా వాలి వస్తాడు. సుగ్రీవుడు జరిగిన విషయం  చెబుతుంటే వినకుండా అన్న ఐన తనకు ద్రోహం చేశాడని మండిపడుతూ సుగ్రీవుని చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. భయంతో పారిపోతున్న తమ్ముడిని భూమండలమంతా తరుముతాడు.
అలా ప్రాణభయంతో పరుగెత్తిన సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపైకి వెళతాడు.అక్కడికి మాత్రం వాలి పోలేడు. కారణం మతంగ మహర్షి శాపం.
దుందుభి అనే రాక్షసుడిని సంహరించి, అతడి కళేబరాన్ని విసిరేసినప్పుడు అది ఋష్యమూక పర్వతంపై తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షి ఆశ్రమం ముందు పడుతుంది.ఆ ప్రాంతమంతా రక్తంతో తడుస్తుంది.దీనికి కారణమైన వాలిని ఋష్యమూక పర్వతంపైకి అడుగు పెడితే  మరణిస్తావని శపిస్తాడు.అందువల్ల సుగ్రీవుడు బతికి పోతాడు.
అలా అన్నదమ్ముల మధ్య చంపుకునేంత శత్రుత్వం ఏర్పడుతుంది.సీత జాడను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులతో సుగ్రీవునికి స్నేహం కలుగుతుంది.
తన భార్యను చెరపట్టి తనను  అన్యాయంగా తరిమేసిన వాలిని చంపమని శ్రీరాముని శరణు కోరుతాడు.
వాలి సుగ్రీవులు ఇద్దరూ పోరాడుతున్న సమయంలో రాముడు వాలిని  చెట్టు చాటునుండి  చంపుతాడు.
దీనిని బట్టి వాలి సుగ్రీవుని కంటే మహా బలవంతుడైనా, అతడు అధర్మవర్తనుడు కాబట్టి రాముడు వాలిని చంపాడని  అంటారు.
అదే విధంగా మహా భారతం చదివినట్లయితే...కౌరవ పాండవుల విషయంలో కూడా ఇదే న్యాయము వర్తిస్తుంది.ఇరువైపులా బలవంతులే కానీ కౌరవులు  అధర్మవర్తనులు. పాండవులు ధర్మవర్తనులు.ధర్మం ఎటు వైపు ఉంటే గెలుపు అటువైపు ఉంటుంది.
 కాబట్టే  ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం చేశాడు. అందుకే ఎంతో బలవంతులు ఐనప్పటికీ కౌరవులు ఓడిపోయారు.
 ఇదండీ "వాలి సుగ్రీవ న్యాయము"లోని  అంతరార్థం. బలము ఎంత ఉన్నా న్యాయ అన్యాయ ప్రవర్తన బట్టి తుది తీర్పు ఉంటుంది.
 ఎప్పటికైనా ధర్మవర్తనమే గెలుస్తుందని  ఈ న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు