సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -256
విషయ సూచికా న్యాయము
*************
విషయ అంటే గ్రంథముల నుండి తెలియబడిన అంశము. సూచిక అంటే సూది, తెలియ జేయునది అని అర్థము.
విషయ సూచిక అంటే ఏదైనా విషయమును గూర్చి ముందు క్లుప్తంగా రాయడం. ఏ పుస్తకం లోనైనా మొదటి పేజీలో ఈ విషయసూచిక వుంటుంది. అది లోపల పేజీలలో ఏ విషయం ఎక్కడుందో తెలియజేస్తుంది. విషయ సూచిక లేకపోతే  పుస్తకంలో ఏ అంశం ఎక్కడ వుందో తెలుసుకోవడం కష్టమవుతుంది. విషయ సూచిక లేకుండా దాదాపుగా ఏ పుస్తకాలు ఉండవు.
విషయ సూచికను జూసి గ్రంథము లేదా పుస్తకంలో ఏయే  అంశములు ఉన్నాయో తెలుసుకోగలగలడమన్న మాట.
 
దీనినే ముఖము చూసి  మనసులోని భావాలను పసిగట్టినట్టు అంటారు .అంటే చెప్పకుండానే తనంత తానుగా తానేమిటో స్పష్టంగా అర్థం కావడం అనే అర్థంతో ఈ విషయ "సూచికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే ఆంగ్లంలో "ది ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్"( The face is the index of mind) అంటారు. "ముఖము అనేది మనసు యొక్క సూచిక" అని అర్థం. అంటే ముఖం మనస్సు యొక్క దర్పణం.
మనం మన కుటుంబంతో పాటు,సమాజంలో ఇతరులతో కలిసి మెలిసి జీవిస్తూ వుంటాం. వారి వారి మొహాలను గమనిస్తూ వుంటాం. అలా గమనిస్తున్నప్పుడు వారి వారి ముఖ కవళికలు, మాటలు వారి మానసిక స్థితిని తెలియజేస్తాయి.
ఎవరైనా కోపంగా వుంటే, ఆ వ్యక్తి కోపం వెంటనే అతని ముఖంలో వ్యక్తమవుతుంది. లేదా సంతోషంగా వుంటే  ఆ వ్యక్తి మొహం ఒక విధమైన తేజస్సుతో వెలిగి పోతూ వుంటుంది. ఈ విధంగా ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో వున్నాడో తెలుసుకోవచ్చు.
 శ్రీమద్భాగవతంలో కూడా ఇదే మాట చెప్పబడింది.
స్థూల శరీరము యొక్క కార్యకలాపాలు, మానసిక స్థితి యొక్క ప్రతి చర్యలు, మనస్సు యొక్క కార్య కలాపాలైన ఆలోచించడం, అనుభూతి చెందడం, ఇష్టపడటం మొదలైనవి శరీరం యొక్క హావభావాల ద్వారా వ్యక్తం అవుతుంటాయి.
అంటే శరీరం మరియు ఇంద్రియాల ద్వారా వ్యక్తం అయ్యే వివిధ కార్యకలాపాలు  మనసు యొక్క స్థితిని ప్రభావితం చేసి.కనిపింప చేస్తాయన్న మాట.
ఉదాహరణకు మనసులోని కోపం నోటి ద్వారానో అంటే పరుషమైన  మాటల ద్వారా లేదా చేతి ద్వారా అంటే కొట్లాట ద్వారా వ్యక్తం అవుతుంది.
 ఈ విషయ సూచికా న్యాయము ద్వారా ఆయా పుస్తకాల్లో ఏముందో ముందుగా తెలుసుకోవడమే కాకుండా మనిషికి వర్తింప చేసి చూసి నట్లయితే ముఖమును చూసి మనసులో ఏముందో  తెలుసుకోగలమని అర్థం చేసుకోగలిగాం.
అయితే పుస్తకంలోని విషయ సూచిక ద్వారా  వివరాలు అర్థం  చేసుకోగలిగినంతగా మనిషిని అన్ని వేళలా అర్థం చేసుకోగలమా! అంటే కొంత వరకు మాత్రమేనని జవాబు వస్తుంది. మన వాళ్ళు  అంటుంటారు కదా ! " ఏ పుట్టలో ఏ పాము వుందో అని" అలాగే ఎవరి మనసులో ఏముందో తెలియదు.
ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగే మేకవన్నె పులులు,గోముఖ వ్యాఘ్రములు ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్త పరచకుండానే ఎంతటి దురాగతాలకు ఒడిగడుతున్నారో నిత్యం జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తూ, చదువుతూ వున్నాం. అందుకే  మన జాగ్రత్తలో మనం ఉండాలి.మీరేమంటారు!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు