సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు -246
వాయు భక్షణ న్యాయము
******
వాయువు అంటే గాలి.భక్షణము అంటే భుజించడం.
వాయు భక్షణము అంటే గాలిని భుజించడం అని అర్థం.
ఈ "వాయు భక్షణ న్యాయము" గురించి చెప్పాలంటే మనం పురాణాల్లోని వాయుపురాణాన్ని చదవాల్సిందే.
 అష్టాదశ పురాణములలో వాయు పురాణము ఒకటి. అందులో సప్త ఋషుల గురించి చెప్పబడింది.ఈ సప్త ఋషులలో ఒకడైన క్రతువు మహర్షి గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. ఇతడు దేవహుతి,కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకుంటాడు.
ఈ క్రతువు మహర్షికి భార్య అయిన క్రియకు వాలఖిల్యులు అనే అరవై వేల మంది సంతానం కలిగారనీ, వీరు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వేలాడుతూ కఠినమైన తపస్సు చేశారని ఈ వాయు పురాణంలో చెప్పబడింది.
ఈ వాలఖిల్యుల గురించి  బ్రహ్మాండ పురాణం మరియు భాగవతంలో కూడా  చెప్పబడింది.వీరు కేవలం వాయుభక్షణే చేసేవారట.
ఇందులో మనం గమనించాల్సిన విషయాలు  ఏమిటంటే స్వప్రయోజనాల కోసమో, సమాజ హితం కోసమో ఋషులు తపస్సు చేసేవారని తెలుస్తోంది.
ఇక తపస్సు  విషయానికి వస్తే గాలి పీల్చుకోకుండా  ఏ ప్రాణీ జీవించదని, దానికి వాలఖిల్యులు కూడా అతీతులు కారు అని చెప్పడం విశేషం.
 అలా  వాలఖిల్యులు మహా నిగ్రహ శక్తి కలవారు.మరే ఇతర ఆహార పదార్థాలను భుజించకుండా కేవలం వాయుభక్షణ చేస్తూ  దేహాన్ని నిలుపుకుని  అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారట.
ఇలా ఋషి సంతతికి చెందిన వాలఖిల్యుల పట్టుదల ఎంతటిదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం.
వాలఖిల్యులు ఉండటమే అతి చిన్నగా బొటన వేలు లో సగం ఉండేవారట.‌ఒకసారి కష్యప ప్రజాపతి సంతాన ప్రాప్తి కోసం యాగం చేస్తున్న సమయంలో దానికి కావలసిన వంట చెరకు తెచ్చే బాధ్యతను ఇంద్రుడు, దేవతలు మొదలైన వారికి అప్పగించాడట.
వాలఖిల్యులు కూడా తేవడంలో తమ వంతుగా చిన్న చిన్న ముక్కలను తీసుకుని రావడం చూసి ఇంద్రుడు ఎగతాళిగా నవ్వాడట.మరి వారి ఆకారం చిన్నదవడం  మూలాన పెద్దవి మోయలేరు కదా ! అందుకే చిన్నవి తేవడం జరిగింది. అలా తేవడంతో ఇంద్రుని అవమానానికి గురయ్యారు.
దాంతో వాలఖిల్యులకు బాగా కోపం వచ్చింది. మరో ఇంద్రుడిని సృష్టించమని బ్రహ్మను కోరేందుకు ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించారట.
ఇది తెలిసి భయపడిపోయిన ఇంద్రుడు కశ్యపుని ఆశ్రయించాడట. వాలఖిల్యుల తపస్సు వృధా కాకుండా, ఇంద్రుడికి  ప్రమాదం వాటిల్లకుండా ఉండేలా పుత్ర కామేష్టి యాగం చేసిన కశ్యపునకు గరుడుడు జన్మిస్తాడు.గరుడునకు పక్షీంద్రుడు అనే పేరు కూడా ఉంది.ఈ విధంగా తమ పంతం నెగ్గించుకున్నారు వాలఖిల్యులు.
ఇవండీ! _వాయుభక్షణ న్యాయ' విశేషాలు.
 కృషి పట్టుదల, కఠోర దీక్ష,నియమ నిష్ఠలతో అనుకున్నది సాధించవచ్చని, ఋషులలో కొందరు కేవలం వాయుభక్షణతో కఠోర తపస్సు చేసేవారని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు