ఈరోజే
నేను కొత్త చెంచాలు కొనుక్కొచ్చా
వాటిని చూడగానే
నా పురా జ్ఞాపకాలు
మదిలో ఊయలలూగాయి
ఈ చెంచాల్తోనే కదూ?!
అమ్మ ఉగ్గుపాల కవితలు
నాకు అందించింది!
ఈ చెంచాల్తోనే కదూ?!
అనారోగ్యాన్ని దూరం చేసే టానిక్కులు
అమ్మ నా శరీరంలోకి
ప్రవహింపజేసింది!
ఈ చెంచాల్తోనే కదూ?!
కమ్మటి పాయసాన్ని
నా స్నేహితుల పెదవులకు అందించింది!
ఈ చెంచాల్తోనే కదూ?!
చెంచాలు చెంచాలుగా
నా జీవన సహచరికి
జీవనగానం వినిపించింది!
ఈ చెంచాల్తోనే కదూ?!
నా పిల్లలు గమ్మత్తైన ఆటలు
ఆనందంగా ఆడుకున్నది!
ఈ చెంచాలే కదూ?!
నా వృద్ధాప్యానికి
వాత్సల్య హస్తాలై అనునయించేవి!
ఈ చెంచాలే కదూ?!
నా తదనంతరం
క“న్నీళ్ళ” తర్పణాలకు సహకరించేవి!
అందుకేనేమో!
ఈ చెంచాలను చూడగానే
కన్నీళ్ళాగలేదు
ఇవి...
చెంచాలు చెంచాలుగా
మనసు దోచిన చెంచాలు కదూ?!
*********************************
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి