విఘ్నేశ్వరుడి నుండి మనం పొందే ప్రేరణ,;- మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా.
 తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌,  
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.  
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై,  
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

విఘ్నేశ్వరుడి పెద్ద తల విశాల దృక్పథంతో ఆలోచించమని చెబుతోంది. వివేకాన్ని పెంచుకొని, ప్రయోజనకరమైన ఆలోచనలు చేయమని చెబుతోంది.పెద్ద పెద్ద చెవులు కొత్త సలహాలను,
సూచనలను శ్రద్ధగా,ఓపికగా వినమని చెబుతున్నాయి. చిన్న కళ్ళు లక్ష సాధన పై దృష్టి కేంద్రీకరించమని చెబుతున్నాయి. కదలాడుతున్న తొండం అన్ని కోణాల్లో అన్వేషణ కొనసాగించమని చెప్తోంది. చిన్న నోరు తక్కువ మాట్లాడమని,ఎక్కువ వినమని చెప్తోంది.ప్రసన్న వదనం పరిసరాలలో ప్రశాంతతను,ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతుంది. చెక్కుచెదరని ప్రసన్నతను హృదయంలో నింపుకొని ముఖంలో స్పష్టంగా అగుపించేలా జీవించాలని తెలుపుతుంది.విఘ్నేశ్వరుడి నుండి మనం ప్రేరణ పొందితే మార్గం సుగమమవుతుంది. నిజ జీవితంలో శ్రద్ధగా ఆచరిస్తే విజయాన్ని పొందడం సాధ్యమవుతుంది.జీవితం ధన్యమవుతుంది.

కామెంట్‌లు