ప్రకృతి-వికృతి ;- పద్మావతి పి,-హైదరాబాద్.
ఉషోదయ అరుణ కిరణములు పగల సెగలై దాహార్తితో ఆర్ద్రంగా వేదనతో మూల్గు తున్నాయి..

శుభకృతు శోభల నలరించే ప్రకృతి 
కాలుష్యంతో  చిగురులు తొడగని
కొమ్మలతో మోడులై 
మిగిలి పోతున్నాయి..

సస్యశ్యామలమంటూ కీర్తించే భరతావని కొంగులలో మంటలు
వ్యాపిస్తున్నాయి..

ఊహల ఊయలలూగించే  ఝరులై పొంగే భావాలు వేడిగాలులనిట్టూర్పులతో క్రుంగిపోతున్నాయి..

అధినేతల ప్రతీకార జ్వాలలు అణుబాంబుల క్షిపణుల ప్రయోగాలతో
ఖండాలనే విచ్ఛిన్నం చేస్తున్నాయి..

మనిషిని మనిషే చంపుకుంటూ 
దారి తెన్నూ ఎరుగని బతుకులు
స్మశానాల బాటలు పడుతున్నాయి..

విజ్ఞానంతో లోకాన్నే ఏకం చేసిన శాంతీ సౌభాగ్యాలు అశాంతీ హింసలతో పుడమిని బూడిదగా మార్చి 
వేస్తున్నాయి...

ఏది ఏమైనా! ఆశలే శ్వాసలై
బతికే మానవుని భవితలు శుభములకి ఆహ్వానం పలుకుతున్నాయి..

గతితప్పిన మతిలేని స్వార్ధంతో వేసే మనిషి
మనుగడలే కోల్పోయి అడుగులు తడబడుతున్నాయి
ప్రగతికి కనిపించని మార్గంలో జీవితం ఇంటా బయటా కాలుష్యంతో అథోగతి పాలవుతూ ఉంది..
**********


కామెంట్‌లు