సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు -249
వార్తాహర న్యాయము
 *****
వార్తా హరః అంటే సందేశమును తెచ్చు వ్యక్తి
మరి ఈ సందేశమును తెచ్చినందుకు కూడా ఓ న్యాయమా? ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ మన పూర్వీకులు దీనిని కూడా ఓ న్యాయాన్ని ఎందుకు చేశారో...ఆ సందేశాన్ని తెచ్చిన  వ్యక్తి  అనుభవాలు ఎలా వుంటాయో, అతడు ఎలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చిందో  చదివిన తరువాత "నిజమే కదా!" అనిపించక మానదు.
ఇక విషయానికి వస్తూ ఈ ఉదాహరణలు చూద్దాం.పల్లెల్లో పాముల బెడద ఎక్కువగానే ఉంటుందనేది మనందరికీ తెలిసిందే.పాముల ఆహారం కప్పలు, ఎలుకలు. వాటిని తినడానికి పొలాల దగ్గర్లోని ప్రాంతాల్లోనూ , ఇండ్లలో కట్టుకున్న రాళ్ళ గోడల  సందుల్లోనూ  ఎలుకలు కప్పలు సంచరించే ప్రదేశాలలోనూ  తరచూ పాములు కనిపిస్తుంటాయి.
ఇక పల్లెవాసుల గురించి  మనకు తెలిసిందే.మూఢనమ్మకాలను ఎక్కువగా కలిగి వుంటారు.
పాములకూ, మూఢ నమ్మకాలకు సంబంధమేమిటీ ? అని అనిపిస్తుంది కదా! ఉంది కాబట్టే ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది.
పల్లెల్లో ఎవరికైనా పాము కరిస్తే  ప్రథమ చికిత్స చేయాలన్న విషయం తెలియక  'పాము మంత్రం' వేస్తుంటారు. మరికొందరైతే మీద వేసుకున్న తువ్వాలు/ కండువాను చించి వేస్తుంటారు.(ఆ చించిన దానిని  కరిచిన చోట  కట్టినా ఆ విషం పైకి పోకుండానైనా వుంటుంది.)మరికొందరైతే పాము కరిచి బాధ పడుతున్న వ్యక్తి చెవిలో 'పారిపో ' అని చెప్పిస్తుంటారు.
ఇదంతా  ఓ రకమైన మూఢత్వమైతే,ఇక మరొక రకం  మూఢత్వం ఎలాంటిదంటే "ఎవరైతే   ఫలానా వ్యక్తికి పాము కరిచింది .వెంటనే వచ్చి కాపాడమని మంత్రగాడి దగ్గరకు చెప్పడానికి వెళతాడో... ఆ వార్త విన్న వెంటనే మంత్రగాడు వార్త తెచ్చిన వ్యక్తి యొక్క దౌడలు పగిలేట్టు బలంగా కొడతాడు.తెచ్చిన వ్యక్తికి ఆ దెబ్బ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా పాము కరిచిన వాడి బాధ తగ్గిపోతుందనే పిచ్చి నమ్మకమన్న మాట.అక్కడ ఆ వ్యక్తి పాము కాటేమో కానీ వార్త చెప్పిన వ్యక్తి మాత్రం దౌడపాటుకు గురయ్యాడన్న మాట.
మరికొన్ని చోట్ల  కొందరు పాము కరిచిన చోట నోరు పెట్టి విషాన్ని పీల్చి లాగేస్తుంటారు. అది అత్యంత ప్రమాదకరం. విషాన్ని లాగే వ్యక్తి నోటిలో ఏమైనా పుళ్ళు ఉన్నట్లయితే వాటి ద్వారా విషం పీల్చిన వ్యక్తి లోకి  ప్రవహించి అతడు కూడా మరణించే పరిస్థితి వస్తుంది.
 ఇలాంటివన్నీ చూసిన తెలుగు వాళ్ళు" వెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది" అనే సామెతతో పోలుస్తారు.
 ఏ పోలికలు అయినా గ్రామాల్లో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు పోకపోవడం చాలా విచారకరం. "మంత్రాలకు చింతకాయలు రాల్తాయా!" అనేది అందుకే...
పాము విషపూరితం కాకపోతే ఆ వ్యక్తి బతికి బయట పడతాడు. అదే విష పూరితమైనది అయితే ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల నిండు ప్రాణాలు బలై పోయినట్లే.
 ఈ "వార్తాహర న్యాయము" ద్వారా మనం చదువరులం కాబట్టి తెలుకోవలసింది ఏమిటంటే సాధ్యమైనంత వరకూ అలాంటి మూఢ నమ్మకాలను తొలిగించే ప్రయత్నం చేయడం.మన చుట్టు పక్కల ఎవరైనా అలాంటి ప్రమాదానికి గురైతే " వెంటనే ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత వైద్య సహాయం పొందేలా చూడటం." సాటి వారిగా మనం చేయాల్సినవి ఇవే.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు