శివ పంచాక్షరీ ప్రాశస్థ్యం; - సి.హెచ్.ప్రతాప్
 పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం గా వేద శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. కేవలం కోరిన భౌతిక కోరికలు  తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని సమకూర్చే  మహాద్భుత మంత్రం. ఓం ‘నమఃశివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని, అంతేకాకుండా ఒక చిత్తశుద్ధితో, పవిత్రమైన మనస్సుతో ఎవరైతే జపిస్తారో వారికి సకలం సిద్ధిస్తుందని  శివపురాణం చెబుతోంది.
ఈ మంత్రాన్ని నిత్యం చిత్తశుద్ధితో పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.
భక్తితో ఉచ్చరించినంతమాత్రానే భక్తులకు  కైలాసం సిద్ధిస్తుందని అదే  అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది అని శాస్త్రం పేర్కొంటోంది.
ఓం నమః శివాయ మంత్రం సెకనుకు అనేక ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ తరంగాలు మానవ మేధస్సును వాంఛనీయ స్థాయికి పెంచుతాయి. ధ్యానం సమయంలో ఓం నమః శివాయ నిదానంగా జపించడం వల్ల సామరస్యం, ఏకాగ్రత మరియు బలం లభిస్తాయి.

కామెంట్‌లు