బహుభాషా పండితులు నెల్లూరు నగర వాస్తవ్యులు దువ్వూరి రామిరెడ్డి గారి రచనలను చదవని వారు అరుదు సులభశైలిలో సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే భాషలో ఎన్నో కొత్త విషయాలను తెలియపరిచారు వారి కవితా ఖండికలు ఎన్ని మారులు చదివిన మరొకసారి చదవాలని అనిపిస్తుంది పలిత కేశం లో చెప్పిన వేదాంత విశేషాలు అందరికీ అర్థం కాకపోయినా ఆ సొగసులు అర్థం చేసుకున్న వారే స్వతహాగా ఆయన వ్యవసాయదారుడు గనక కృషివలుడు చదువుతూ ఉంటే మనం చేసే భోజనం వెనుక ఎంత కష్టం దాగి ఉందో మనకు అర్థమవుతుంది వ్యవసాయదారుల మీద విపరీతమైన మమకారం పెరుగుతుంది పాదాభివందనం చేయాలనిపిస్తుంది వారు ఏ అంశాన్ని తీసుకున్నా ఆ అంశానికి పూర్తి న్యాయం చేశారు పద్య కవితలే కాక వచనములో కూడా వారు రాసిన గ్రంథాలు ప్రతిదీ పాఠ్యాంశమే స్వయంకృషితో పరభాషలను అధ్యయనం చేసిన రామిరెడ్డి గారు అంటే నాకు అమితమైన ప్రీతి.
వ్యవసాయదారునిగా ఉండి
భాగవతాన్ని అనువదించిన సహజ కవి పోతన గారిలా మరో సహజ కవిగా కలం పట్టారు కనక కొత్తగా కలం పట్టిన నేను వారంటే నా మనసులో దాగి ఉన్న అభిమానాన్ని అతి పవిత్రమైన స్వచ్ఛమైన వారి గురించి తెల్లటి కాగితంపై నల్లటి అక్షరాలతో వ్యక్తం చేశాను. ఉదాహరణకు ఈ కవిత నెల్లూరులో వారి గురించి పోటీలు పెట్టిన గౌరవ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను బహుమతిని కూడా పొందాను.
కవి కోకిల
అక్షర సుగంధాల పరిమళాలు
వెల్లివిరిసిన కవన పూదోటలో రంగురంగుల భావాల, భావోద్వేగాల చిత్రాల పూలు
ఎన్నో ఎన్నెన్నో కాగితాల కౌగిలిలో బందీగానే ఉండి పోయాయి...
తెగిన దారంలా ఆలోచనలను, అనుభవాలను
ఆధునికాత్మకంగా పొందుపరిచిన గ్రంథాల గాలిపటాలు దారి కానరాక,
దిక్కుతోచక చిత్రంగా చరిత్ర పుటలలోనే చిక్కుకుపోయాయి...
తెలుగు సాహిత్యాన్ని ప్రయోజనాత్మకంగా మలిచి,
బడుగు బలహీనుల, రైతుల, పీడిత ప్రజలలో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపుతూ,
ఊహలతోనే ఉప్పెన జ్వాలలను రగిలింపజేస్తూ,
సమాజ చిత్రాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరిస్తూ,
అన్వేషణ మార్గంలోనే కాల మొందిన ఎందరో సరస్వతీ పుత్రుల
సుచరిత్రలు ఉపేక్షకు గురికాబడినాయి...
అలాంటి నిర్లక్ష్యానికి గురి కాబడినవే
మన "సింహపురి సిరి" దువ్వూరి రామి రెడ్డి గారి రచనలు కూడా...
బహుభాషా కోవిదుడుగా ఖ్యాతిని గడించి,
రచనలలో తనదైన శైలిని కనబరిచి, విమర్శకుడిగా,
విశ్లేషకుడిగా పరిపూర్ణ పరిజ్ఞానంతో రాణించి,
ఎందరో పండితుల మన్ననలను పొందిన "కవికోకిల" మన దువ్వూరి...
తెలుగు వాకిళ్ల తోరణాలు వారు వెలువరించిన పద ప్రబంధాలు...
భావయుక్త కవితా సౌరభాలు వారు రచించిన పద్య కావ్యాలు…
సహజ కవిగా, సహజ పాండిత్యుడిగా వారు సాహితీ సీమకు
అందించిన కృషి ఎన్నటికీ మరువలేనిది...
కష్టాల ఊబిలో కూరుకుపోయి కన్నీటి రాజ్యాన్ని ఏలుతున్న
రైతుల గొంతుకగా మారి కలమన్న హలాన్ని పట్టి ఆలోచనాత్మక బీజాలను
మొలకెత్తింప చేసిన "కృషీ వలుడు"
నలజాలమ్మ, పానశాల, వన కుమారి లాంటి ఖండ కావ్యాలను రచించి,
అలంకార ఝరీ ప్రవాహంలో పయనిస్తూ,
అలవోకగా తెలుగు పదాల సొగసులను ఆవిష్కరింపజేసి
అభ్యుదయ భావాలకు ఊపిరి పోసిన గొప్ప తాత్వికుడు...
తళుక్కున మెరిసెనొక పలిత కేశమంటూ వేదాంతాన్ని చెప్పిన తార్కికుడు...
ఒమర్ ఖయ్యాం రచనలను జాను తెలుగులో అనువదించిన రైతు బిడ్డ,
వేమన తత్త్వమెరిగిన మన పెద్దన్న రామి రెడ్డి గారు...
అలాంటి మహనీయుడు పుట్టిన ఈ నేల పైన మనం కూడా పుట్టినందుకు గర్విద్దాం...
వారి రచనలను, వారి చరిత్రను మరింతగా ప్రచారం చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడదాం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి