ఊపిరిలో ఆవిరయ్యే జ్ఞాపకం..- ప్రమోద్ ఆవంచ- 7013272452..
గుండెల్ని కోసుకుంటూ విరహ తంత్రులను 
మీటుతుందో  జ్ఞాపకం 
తపించే మనసుకెప్పుడూ రంపపు 
కోతలే 

లేత ఆకుల రెపరెపలు,వసంత 
మోహాలై 
మనసును తీపి గాయం చేసాయి 

చిగురు తొడిగిన మొగ్గ లేత పచ్చని ప్రేమ 
కథలను రాసుకుంటుంటుంటే 
అంతు చిక్కని అందాన్ని అడవంతా 
కళ్ళప్పగించి చూస్తుంది

రాత్రంతా జాబిలమ్మ చెంత స్నానమాడి
వేకువ వెలుగులో వళ్ళు విరుకుంది 
ఆకాశం 
కళ్ళల్లో మత్తును రెప్పల కింద దాచింది 
తెలిసినదేదో తెలియని మైకం 
మనసును మాయలా తాకింది 

అర్థం అయ్యీ కాక గుండె విలవిల 
లాడింది 
మనసెప్పుడూ అర్ధం కాని విషయం
మన చుట్టూ అల్లుకునే ప్రశ్నార్థకం 

ప్రతి క్షణం ఏదో ఒక జ్ఞాపకం 
ఊపిరిలో ఆవిరవుతూనే ఉంది 
క్షణం సేపు కాలం ఆగిపోయి 
మేఘం వర్షించింది

మనసుకూ కళ్ళున్నాయి అవి
బాధతో కన్నీళ్ళను కురిపిస్తున్నాయి
ఒక ప్రవాహం ప్రేమ లోతుల్లోకి
ఒక ప్రయాణం నిశీధిల్లోకి....
                    

కామెంట్‌లు