చిన్నప్పుడు ఉప్పు, నెయ్యి,అన్నం నేను ఇష్టంగా తినే వాడిని.అమ్మ నాకు వేడి వేడి అన్నంలో ఉప్పు, నెయ్యి వేసి ముద్దలు కలిపి పెట్టేది.ఆ తరువాత రోజుల్లో అమ్మ చేసే ఆనపకాయ తియ్య కూర, చాలా ఇష్టంగా తినే
వాడిని.ఆ ఆనపకాయ తియ్య కూర చాలా రుచిగా ఉండేది.మా నాన్న పచ్చి పులుసులో,పప్పుచారులో చెక్కెర వేస్తే చాలా ఇష్టంగా తినేవారు.ఆ అలవాటే నాకూ వచ్చిందేమో..... ఆ తరువాత ఆనపకాయ అంటుపులుసు,ఆలుగడ్డ కూర నా ఫేవరేట్స్, ఇవి అమ్మ చేస్తేనే చాలా రుచిగా ఉండేవి. ఇంకా అమ్మ అరటికాయ వేపుడు,అరటికాయ పులుసు చాలా బాగా రుచిగా చేసేది.ఆ రెండు అమ్మకు కూడా ఎంతో ఇష్టం.ఇంట్లో కాకుండా ఇంకా ఎక్కడ తిన్నా ఆ రుచి ఉండేది కాదు.అమ్మ చేతిలో ఏదో మహిమ ఉండేది. మామిడికాయ పచ్చడితో అన్నం కలిపి నూనె వేసి అమ్మ చేతితో తిన్న ముద్ద రుచి ఎక్కడ దొరుకుతుంది... మేము నలుగురం పోటీలు పడి నాకంటే నాకు అని తిన్న అమ్మ చేతి ముద్దలు... ఇప్పుడు తినగలుగుతామా... అప్పట్లో ఇంకా గ్యాస్ సిలిండర్లు రాలేదు, అమ్మ మొదట కట్టెల పొయ్యి మీద,ఆ తరువాత కిరోసిన్ స్టౌ మీద ఆదివారం చేసి ఇచ్చిన దోశలు ఎన్ని తిన్నా ఇంకా... ఇంకా... కావాలి అంటూ అడిగిన రోజులు ఎలా మర్చిపోతాం.కొన్ని ఆదివారాలు వర్షం కూడా కురుస్తుండేది,మా ఇంట్లో వంటిల్లుకి మిగితా గదులకు కొంచెం గ్యాప్ ఉండేది.ఆ గ్యాప్ నుంచి కురిసే వర్షం చినుకులను చూస్తూ,ఆ తుంపరలు చేతులపై పడుతుంటే చేతిలో వేడి వేడి దోశ ప్లేట్.... ఇంతకన్నా అధ్బుతమైన అనుభూతి ఎక్కడైనా దొరుకుతుందా..అదీ నేను చిన్నప్పుడుఅనుభవించాను... ఇంతకన్నా గొప్ప అనుభవం ఉంటుందా..ఏమో..నేనైతే ఉందని అనుకోను.. సాయంత్రాలు స్కూలు నుంచి వచ్చాక అమ్మ ఇచ్చే ఉడకబెట్టిన వేడి వేడి మోరంగడ్డలను పొట్టు తీసుకొని చక్కెరలో అద్దుకొని తింటుంటే రుచి తియ్య తియ్యగా నోరు వేడి వేడిగా
కాలుతుంటే ఓహో.. అద్బుతహా......
అమ్మ ప్రతి బేస్తవారం చర్లపల్లి నుంచి నల్గొండకు అంగడికి పోయేది.అప్పుడు వెంట ఎండబెట్టిన అన్నాన్ని తీసుకొని పోయి,నల్గొండ ప్రేమ్ టాకీసు డౌనులో ఉన్న పేలాల బట్టీలో వాటిని పట్టించేది.వచ్చేటప్పుడు ఆ
వారానికి సరిపడా కూరగాయలు కూడా తెచ్చేది.ఆ పట్టించిన పేలాలలో పల్లీలు,పుట్నాలు,ఎండు కొబ్బరి ముక్కలు,నువ్వులు, ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి ఎండు మిరపకాయల పోపు పెట్టేది.వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచేది.తినడానికి ఎంతో రుచిగా వుండే ఆ పేలాలు సాయంత్రాలు మేము స్నాక్స్ గా తినేవాళ్ళం.ఇవి కాకుండా నాన్న సీజనల్ గా వచ్చే పండ్లను తప్పకుండా
తెచ్చేవారు.ముఖ్యంగా మేము మామిడి పండ్లు, సీతాఫల
పండ్లను ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం.నాన్న సీతాఫల కాయలను తెచ్చి గడ్డిలో మక్కబెట్టేవారు.అవి పండిన తరువాత తినేవాళ్ళం.ఇంకా జామ కాయలు, సపోటా పండ్లను కూడా నాన్న ఎక్కువగా తెచ్చేవారు.ఆ తరువాత రోజుల్లో ఆ పండ్లంటేనే మొహం కొట్టేసింది.నాన్న చిట్యాల
స్కూల్లో పనిచేసేటప్పుడు అప్పటి మూడు పైసల బిళ్ళ
సైజులో ఉండే జీరా ఉప్పు బిస్కెట్స్ డబ్బా తెచ్చేవారు.
ఆ డబ్బాలు అల్యూమినియం రేకులతో తయారు చేసేవారు.చాలా రుచిగా ఉండేవి.ఆ బిస్కెట్లను రెండు పిడికెళ్ళ నిండా తీసుకొని జేబులో పోసుకొని స్కూలుకు
వెళ్ళేవాళ్ళం.పొద్దున్నే పాలు,బన్నుతో రోజు మొదలయ్యి,ఆ తరువాత టిఫిన్, లంచ్, సాయంత్రం
స్కాక్స్.. మిరపకాయ బజ్జీలు,తప్యాల చెక్క( సర్వపిండి)
మోరంగడ్డలు, లాంటివి రోజుకొక ఐటమ్ ఉండేది.రాత్రి కందీలు లైట్ డిన్నర్ తో రోజు ముగిసేది.అప్పట్లో కరెంట్
అసలు ఉండేదే కాదు.మొత్తం రోజులో కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే పవర్ సప్లై ఉండేది.అందుకే
మేము అనేక సమయాలు కందీలు లైట్ డిన్నరే చేసే వాళ్ళం....ఇవి కాకుండా పండులప్పుడు సన్నసేగు,
పుల్లలప్పాలు,చకిలాలు,కారపప్పాలు( కారపు అప్పాలు),కరియలు,బక్షాలు,రవ్వ లడ్డూలు, అమ్మ ఎంతో ఓపికగా చేసి పెట్టేది.
అప్పటివన్నీ గోల్డెన్ డేస్.ధరలు చాలా తక్కువగా ఉండేవి.టీచర్ గా నాన్నకు తక్కువ జీతం వచ్చినా అమ్మ ఎంతో పొదుపుగా ఖర్చు పెట్టేది.దుబారా ఖర్చు చేసేది
కాదు.... అమ్మ..... అమ్మ చేతి ముద్దలు తిని పెరిగిన
ఈ శరీరం......అమ్మ పెట్టిన బిక్షే కదా ఈ జీవితం....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి