ఒకప్పుడు ఆ వేదిక శ్రీకృష్ణ దేవరాయల భువన విజయాన్ని తలపించేది.నిరంతరం సాహిత్య, సాంస్కృతిక
కార్యక్రమాలతో కళకళలాడేది.జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనీ అనేక ఉద్దండులు,లబ్ద ప్రతిష్టులైన కవులు,రచయితలను పలకరించింది,ఆ ప్రాంగణం,వారి కవితలను విని పులకరించాయి ఆ గోడలు, అక్కడ ప్రదర్శించిన నాటకాలు,అందులోనీ కళాకారులు మైకు
లేకుండా పాడిన పద్యాలతో ఆ వేదిక దద్దరిల్లేది.హక్కుల
గురించి పోరాడే సంఘాలకు ఆ వేదిక గొంతుకయ్యింది.
పెళ్ళిళ్ళు, కవి సమ్మేళనాలు, చర్చాగోష్టులు,సాహిత్య సమావేశాలు, వివిధ పార్టీల మీటింగులు, విద్యార్ధి సంఘాలు,టీచర్ల సంఘాలు,వామపక్ష పార్టీల అనుబంధ సంస్థలైన అభ్యుదయ రచయితల సంఘం,యువ రచయితల సంఘాల సమావేశాలు...ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేదిక అయ్యింది నల్గొండ టౌనుహాల్.
అప్పట్లో అనేక సామాజిక,సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు టౌనుహాల్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
నల్గొండ పట్టణం 1950 వ సంవత్సరంలో మున్సిపాలిటీ అవతరించింది.దానికి మొట్టమొదటి చైర్మన్ గా చిత్తలూరి లక్ష్మినరసింహరావు ఆయన ఇల్లు
రామగిరి లోని ప్రస్తుతం సరస్వతి శిశు మందిర్.డాక్టర్
సునీతా అమరేందర్ రావు ఇంటి ఎదురుగా.
ఆయన హయాంలో నల్గొండలో పెళ్ళిళ్ళు,ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మొదటి మున్సిపల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఆ వెంటనే టౌనుహాల్ నిర్మాణం చేపట్టారు.సుమారు రెండు ఎకరాల
స్థలంలో ఎతైన అరుగులతో, ముందు,వెనకాల, రెండు పక్కలా స్థలాన్ని వదిలి, టౌనుహాల్ నీ నిర్మించారు.లోపల
ఒక ఆడిటోరియంలా ఫిక్స్ డ్ కుర్చీలు, కొంచెం ఎత్తులో
డయాస్.ఎంట్రెన్స్ లో ప్రధాన ద్వారంతో పాటు, లోపలికి వెళ్ళి, బయటకు రావడానికి హాలు రెండు వైపులా నాలుగు మినీ ద్వారాలు చాలా ప్లాన్డ్ గా నిర్మాణం చేశారు.
టౌనుహాల్ రోడ్డు ముఖంగా ఉండేది.దాని వెనుకాల మున్సిపల్ ఆఫీస్, ముందు రోడ్డుకు ఎదురుగా కలెక్టర్ ఇల్లు,దాని పక్కనే జిల్లా న్యాయమూర్తి గారి ఇల్లు ఉండేది.
టౌనుహాల్ పక్కన జిల్లాపరిషత్ కార్యాలయం,దాని ఎదురుగా జిల్లా కోర్టు ఉండేది.కోర్టు ఎదురుగా జవహర్ బాల భవన్ ఉండేది.పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేది.టౌనుహాలు కుడివైపున వంద సంవత్సరాల వయస్సు గల రెండు చింత చెట్లు ఉండేవి.ఆ చింత చెట్ల నిండా గబ్బిలాలు ఏలాడబడేవి.టౌనుహాల్ వెనకాల ప్రాంతమంతా పందొమ్మిది వందల డెబ్బై అయిదు,ఆరు సంవత్సరాల వరకు అడవిని పోలి ఉండేది.ఆ అడవి ప్రాంతంలో రేగుపండ్ల చెట్లు ఉండేవి.అక్కడే వారానికి
ఒకసారి పశువుల సంత జరుగుతుండేది....
పందొమ్మిది వందల యాబై అయిదు, యాబై ఆరు సంవత్సరాలలో ప్రారంభమైన టౌన్ హాల్ నిర్మాణం
దాదాపు 1962 వ సంవత్సరం వరకు జరిగింది.కట్టడం పూర్తయ్యింది కానీ ఇంకా రంగులు వేయలేదు.1962 వ
సంవత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం తరుపున నిర్వహించాలి,అందుకు పల్టీ పర్పస్ స్కూలు హెడ్ మాస్టర్ ద్వారా టీచర్ ట్రైనింగ్ చేస్తున్న కొల్లోజు కనకాచారి గారికి పిలుపొచ్చింది.ఆయన తన మిత్రులతో 1962 సంవత్సరంలో టౌనుహాల్ లో 'స్వేచ్ఛ కోసం' అనే నాటకాన్ని ప్రదర్శించారు.హాలు నిర్మాణం అయ్యాక మొదటి ప్రదర్శన.అప్పట్లో ఆ నాటకం బాగుందని అనేక మంది ప్రశంసించారు, అంతేకాకుండా డిఈఓ కార్యదర్శిగా ఉన్న సుబ్బారాయుడు ఈ నాటకం గురించి గొప్పగా పొగిడారు.ఇక అప్పటి నుంచి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు,బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు టౌనుహాల్ లోనే జరిగేవి.జిల్లా డీపిఆర్ఓ ద్వారా డీఈవోకు ,ఆయన ద్వారా సంబంధిత స్కూళ్ళకు తెలిపేవారు.ఆ కార్యక్రమాలు అన్ని ఆచార్య కొల్లోజు కనకాచారి ఆద్వర్యంలోనే జరిగేవి.1965 నుంచి 1985 వరకు అన్ని అధికార కార్యక్రమాలకు ఆయననే కర్త కర్మ క్రియగా వ్యవహరించారు.నాటకాలు,రాయడం, మాటలు, పాటలు, సంగీతం,మేకప్,దర్శకత్వం అన్నీ ఒంటిచేత్తో
చేసేవారు.ఆ తరువాత రోజుల్లో గీతా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నడిచే లలిత కళా పరిషత్ వసంతోత్సవాలను అయిదు రోజుల పాటు టౌనుహాల్ లో
నిర్వహించారు.దానికి సారధిగా ఆచార్య కొల్లోజు కనకాచారి ఉన్నారు.ఆ తరువాత ఆయన తన మిత్రులైన లైబ్రేరియన్ పసుపులేటి మధుసూదనరావు,లేబర్ ఆఫీసులో పనిచేసే వై.ఆర్.బాబు,కాతోజు వెంకటేశ్వర్లు లతో కలిసి నవోదయ కళా నికేతన్ అనే సంస్థను స్థాపించి
టౌనుహాల్ లో అనేక నాటకాలు ప్రదర్శించారు.అందులో
చాలా వరకు పేద విద్యార్థుల సహాయార్థం బెనిఫిట్ షో లు
నిర్వహించారు.
ఎనబైవ దశకంలో టౌనుహాల్ వేదికగా అప్పట్లో పెరిక రాజారత్నం సారధిగా కోమలి నాటక సమాజం ఆద్వర్యంలో నాటక వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.అప్పట్లో మిర్యాలగూడ వాస్తవ్యులు ఎం.ఎల్.నర్సింహ్మ రావు,హుజూర్ నగర్ చెందిన గజవెల్లి సోదరులు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆనేక మంది కళాకారులు టౌన్ హాల్ లో నాటకాలు వేసేవారు.అందులో సినీనటుడు జయ ప్రకాష్ రెడ్డి కూడా ఒకరు.
పందొమ్మిది వందల డెబ్బై వ దశకం
వరకు కూడా నల్గొండ పట్టణంలో అభివృద్ధి అంతగా లేదనే చెప్పుకోవాలి.వినోదం కోసం పట్టణ ప్రజలు రకరకాల పద్ధతుల్లో కాలక్షేపం చేసేవారు, అప్పట్లో టీవీ
కొనుక్కోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం
టౌనులో కొందరి ఇళ్ళల్లో మాత్రమే టీవీలు ఉండేవి.పెద్ద
వాళ్ళు రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలలో
జరిగే హరికథ, బుర్రకథ కార్యక్రమాలకు వెళ్లి కాలక్షేపం చేసేవారు.లేదంటే టౌనుహాల్ లో ప్రదర్శించే నాటకాలను
తిలకించేవారు.టౌను హాలులో ప్రతి రోజు సాయంత్రం చిన్న పిల్లల నృత్య ప్రదర్శనలు,లేదంటే నాటక ప్రదర్శనలు లాంటి ఏదో ఒక కార్యక్రమం జరుగుతుండేది.
ప్రతి ఆదివారం టౌనుహాల్ లో ముక్కా ఫిల్మ్స్ ప్రదర్శించేవారు, పౌరాణిక,జానపద, సినిమాలను,హాలు
బయట ఒక పెద్ద స్క్రీన్ ని ఏర్పాటు చేసి చూపించేవారు.
ఇప్పటి మన ఓపెన్ ఎయిర్ థియేటర్లు అన్నమాట.ఈ ముక్కా ఫిల్మ్స్ ఒక్క టౌనుహాల్ ముందరే కాకుండా అప్పట్లో నల్గొండ పట్టణంలోని రహదారుల అన్ని ప్రధాన
కూడలిలలో ప్రదర్శించేవారు.ఇతర వినోద మాధ్యమాలు లేక అప్పట్లో ఆడ,మగ అని తేడా లేకుండా పుస్తకాలు బాగా చదివేవారు.వార పత్రికలు, వివిధ రచయితల నవలలు, డిటెక్టివ్ నవలలు, కిరాయికి తీసుకొని చదివే వాళ్ళు.రామగిరిలో గోపాలరావు సార్ ది ఒక బుక్ స్టాల్ ఉండేది,ఆయన నవలలు కిరాయికి ఇచ్చేవారు, ఇంకొకరు
జ్యోతి బుక్ స్టాల్ శ్రవణ్ కుమార్....ఈయన కూడా నవలలు కిరాయికి ఇచ్చేవారు.పెద్ద గడియారం, గర్ల్స్ జూనియర్ కళాశాల,పాత బస్టాండ్, రామగిరి గిరి పాన్ షాప్, కుమ్మరి అక్కమ్మ పాన్ షాప్, రామాలయం ముందు కూడా బుక్ స్టాల్ల్స్ ఉండేవి,అక్కడ వార పత్రికలు,ఇతర నవలలు, కొనుక్కోవడానికి దొరికేవి.మొత్తం మీద ఇప్పటిలా వినోద మాధ్యమాలు అందుబాటులో లేక పోవడం వల్ల చాలా మందికి పుస్తకాలు చదవడం ఒక
కాలక్షేపంగా ఉండేది.
ఇంకా పిల్లలు, యువకులకు ఆదివారం వచ్చిందంటే టౌనుహాల్ వెనకాల ఉన్న రేగుపండ్ల చెట్లు
ఎక్కడం రేగుపండ్లు తెంపుకోవడం,లేదంటే టౌనుహాల్ పక్కన ఉన్న చింత చెట్ల కింద దాగుడు మూతలు ఆడుకోవడం,అదీ కాకుంటే ఎల్ బావి,కాంతి బాబు తోటలో ఉన్న బావుల్లో ఈత కొట్టడం లాంటివి కాలక్షేపం.
మరీ చిన్న పిల్లలు అయితే టౌన్ హాల్ పక్కన ఉన్న జవహర్ బాల భవన్ లో ఉన్న జారుడు బండ, ఉయ్యాల
లాంటి ఇతర ఆటలు ఆడుకునే వారు.ప్రతి సంవత్సరం
శ్రావణ మాసంలో రామగిరి ముత్యాలమ్మ గుడిలో జరిగే బోనాలు..ఈ బోనాలకు రామగిరి,బోయవాడ,పానగల్ నుంచి బోనాలు సమర్పించేవారు.ఒక వారం రోజులు చిన్నా, పెద్దా అందరికీ మంచి వినోదం.అలాగే చెట్ల కిందికి
పోవడం, రామగిరి, పాతబస్తీ,బీటిఎస్, అన్ని ప్రాంతాల
కుటుంబాలు శ్రావణ మాసంలో చెట్ల కిందికి పోయి అక్కడ
వండుకొని తిని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు.ఇంకా లతీఫ్
సాబ్ గుట్ట ఉర్సు,పానగల్ దసరా పాలపిట్ట దర్శనం,
అక్కడి పచ్చల సోమేశ్వర ఆలయం,నల్గొండకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు గట్టు జాతర... ఇవన్నీ
అప్పట్లో అందరికీ వినోదాన్ని పంచేవి....
పందొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో టౌనుహాల్
వేదికగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయి.అప్పట్లో జిల్లాలో ప్రముఖ న్యాయవాది ఆవంచ వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో అనేక సభలు జరిగాయి.ఆ సమావేశాలకు మర్రి చెన్నారెడ్డి, మెదక్ చెందిన మల్లికార్జున్ లు హాజరైన సందర్భాలు, ఉన్నాయి.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను ఆవంచ వేణుగోపాల్ రావు ఎలాంటి ఫీజు తీసుకోకుండా బేయిల్ ఇప్పించడాలు, కేసులు,కొట్టేయించడాలు చేస్తుండేవారు.ఇది గమనించిన ప్రభుత్వం ఆయనను
జైలుకు పంపించింది.జైలులో ఉన్నా ఆయన ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం, చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు.
మునుగోడు కు చెందిన న్యాయవాది రామకృష్ణారెడ్డి, విద్యార్ది నాయకుల్లో పెద్ద,చిన్న సుదాకర్ లు కూడా చాలా ఆక్టివ్ గా ఆ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో ప్రముఖ కవి కాంచనపల్లి చిన వెంకటరామారావు మొదలుకొని కవి మునాసు వెంకట్ వరకు అనేక మంది కవులు టౌనుహాల్ వేదికగా తమ కవితా గళాన్ని గట్టిగా వినిపించిన వారే.పందొమ్మిది
వందల డెబ్బై సంవత్సరం ముందు వామపక్ష పార్టీల
అనుబంధ సంస్థ అయిన అభ్యుదయ రచయితల సంఘం,ఆ తరువాత కవి కాంచనపల్లి చిన వెంకట రామారావు ఆద్వర్యంలో ఏర్పడ్డ యువ రచయితల సంఘం సమావేశాలు సభ్యుల ఇళ్ళల్లో జరిగేవి.
అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా రాఘవ రంగారావు ఉండేవారు.ఆ తరువాత టౌనుహాల్ లో తమ
సమావేశాలు నిర్వహించుకునే వాళ్ళు.కవి సమ్మేళనాలు,
ఇష్టాగోష్టి కార్యక్రమాల్లో కవులు బోయి జంగయ్య,నోముల సత్యనారాయణ,ఎన్.కే.రామారావు,గింజల రామకృష్ణా
రెడ్డి, రామచంద్రా రెడ్డి,బి.రాములు, ఆచార్య వేణు సంకోజు,బోయినపల్లి కిషన్ రావు,మేరెడ్డి యాదగిరి రెడ్డి, ఆచార్య గోపి,దేవులపల్లి కృష్ణమూర్తి,దేవరాజ్ మహారాజ్
పెన్నా శివరామకృష్ణ,చకిలం కొండల నాగేశ్వరరావు, మునాసు వెంకట్ లు పాల్గొని తమ కవితలను,టౌన్ హాల్ వేదికపై చదివారు.
జిల్లా ఆర్డీఓ ఫణి కుమార్ ఆధ్వర్యంలో 1983
సంవత్సరం నల్గొండ యువ రచయితల సంఘం, జిల్లా రచయితల మహాసభలను టౌన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించింది.ఆ మహాసభలు నభూతో నభవిష్యతి అన్న చందంగా జరగడంతో నల్గొండ జిల్లా కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి.ఆ సభలు జరిగిన మూడు రోజులు నల్గొండ పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది.రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభలకు ప్రముఖ కవులు, రచయితలు హాజరైయ్యారు.
వారిలో మన జిల్లా కవులే కాకుండా శ్రీశ్రీ, రావిశాస్త్రి,గజ్జెల మల్లారెడ్డి, జ్వాలాముఖి,ఆవంత్స సోమసుందర్, అప్పట్లో భరణి అనే పేరుతో కవితలు రాసే సిరివెన్నెల సీతారామశాస్త్రి, అభిసారిక పత్రిక ఎడిటర్ రాంషా లు ఉన్నారు.రావిశాస్త్రి కోరిక మేరకు ఆర్డీఓ ఫణి కుమార్ రాచకొండ గుట్టలను దగ్గరుండి చూపించారు.ఈ మహా
సభలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు గర్వించదగ్గవిగా
చెప్పుకోవచ్చు.
మునాసు వెంకట్,నళినీ రంజన్ రావు, డాక్టర్
కొండల్ రావులు ప్రారంభించిన హేతువాద నాస్తిక సంఘం
ఆధ్వర్యంలో దాదాపు ఒక దశాబ్దం పాటు వివిధ కార్యక్రమాలు టౌనుహాల్ లో జరిగాయి.వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలకు ప్రేమ్ చంద్ ,హేమంత లవణం,ఫిన్ లాండ్ ఉద్యమకారుడు, ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
అరుణోదయ సంస్థ,జననాట్య మండలి,
ప్రజానాట్యమండలి,పౌర హక్కుల సంఘం సమావేశాలతో పాటు, ట్రేడ్ యూనియన్లు,టీచర్ల సంఘాలు, విద్యార్ధి సంఘాలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసంఘ్, బీజేపీ పార్టీల, దిశానిర్దేశం,అంజెండా,డిమాండ్స్, కార్యాచరణ రూపకల్పన, ఇత్యాది విషయాలపై తమ గొంతు ప్రభుత్వానికి తెలుపడానికి టౌనుహాల్ లో సమావేశమయ్యేవారు.మూడు వందల అరవై అయిదు రోజులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతుండేది.
ప్రస్తుతం...
టౌనుహాల్ ను పూర్తిగా కూల్చివేశారు.ఒకప్పుడు సాంస్కృతిక సాహిత్య కళా వేదిక అయిన ఆ ఆడిటోరియం నేడు కనుమరుగయ్యింది.గొప్ప నాటక కళాకారులు, కవులు, రచయితలు,సంగీత విద్వాంసులు
నడిచిన ఆ నేల నేడు బోసిపోయింది.ఆ నేలపై తమ హక్కులకై గొంతు విప్పిన వివిధ సంఘాల గళాలు గాలిలో
కలిసిపోయాయి.ఒకప్పుడు వెలుగు వెలిగిన నాటక రంగం
గుర్తింపు కోల్పోయి, ఆకలితో పాడే పద్యాలు నేడు ఆ నేలపై నీరసంగా వినిపిస్తున్నాయి.ఒకప్పుడు భువన విజయాన్ని తలపించే ఆ నేల గత వైభవాన్ని కోల్పోయి
నిర్మానుష్యం అయ్యింది.... అవును ప్రస్తుతం నల్గొండ టౌన్ లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక వేదిక లేదు.అధికారిక కార్యక్రమాలు,చేసుకోవడానికి టౌనుహాల్ లాంటి ఒక
ఆడిటోరియం లేదు....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి