మా మంచిర్యాల - చెన్నూర్ -కాళేశ్వరం సాహితీ యాత్ర;- పరిమి వెంకట సత్యమూర్తి హైదరాబాద్ చరవాణి:9440720324

  మా మంచిర్యాల మిత్రులు ప్రముఖ అవధాని పట్వర్ధన్ గారి నుండి 15.10.23. ఉదయం ఫోన్  కాల్ వచ్చింది. ప్రతి  సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వారి స్వగ్రామం మంచిర్యాల జిల్లా చెన్నూరులో దసరా నవరాత్రులు మూల నక్షత్రం నాడు అమ్మవారి పూజ, కవి సమ్మేళనం, తిరుపతి వాస్తవ్యులు ఆముదాల మురళి గారి అష్టావధానం  ఉంది  రమ్మని  చెప్పి ఆహ్వానించారు.
మిత్రులు డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఆయన ప్రముఖ అష్టావధాని.  ఇప్పటిదాకా మూడు శతావధానాలు, 116 అష్టావధానాలు, మూడు జంట అవధానాలు,ఒక ద్విగుణ‌ అవధానం అంటే 8×2: 16 అంశాలతో కూడిన అవధానం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మూల  నక్షత్రం నాడు  వారి స్వగ్రామం  చెన్నూరులో కవి సమ్మేళనం నిర్వహిస్తారు. అలాగే ఐదు రోజులు అమ్మవారి ఉపాసనలో ఉంటారు. ఆయన ఉండేది మంచిర్యాలలో అయినా ప్రతి సంవత్సరం  కన్నతల్లి లాంటి తన  పల్లెకు వెళ్లి  ఆ పాత 4 గదులు,పెద్ద స్థలం, పూలచెట్లతో అలరారే పెరడు కలిగిన పెంకుటింటిని  శుభ్రం చేయించి ఒక వారం రోజుల పాటు  అక్కడే ఉండి బంధుమిత్రులను అందరిని అక్కడికి పిలిపించి  దసరా పండుగ సంబరాలు జరుపుకుంటారు. మూల నక్షత్రం నాడు చెన్నూర్ లోని తన పాత మిత్రులను  కవులను అందరిని పిలిపించి కవి సమ్మేళనం నిర్వహించి వారికి  ఉచిత రీతిన శాలువాతో సత్కారం చేసి కమ్మటి భోజనం పెట్టి తగు పారితోషికం ఇచ్చి పంపిస్తుంటారు.
చెన్నూర్  పవిత్ర గోదావరి ఉత్తరవాహినిగా ప్రవహించే ప్రాంతం. ఆ ఊరులో ఇరుకు సందులు, గొందులు ఉన్నా ఇంటికో  బి.టెక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకా కార్లకు కొదవేలేదు.
మేము ఇంటికి వెళ్లేసరికి ఆయన పూజలో ఉన్నారు.ఈ నవ రాత్రుల్లో ఆయన నక్తం పాటిస్తారు.చాలా   నిష్టాగరిష్ఠుడు. మేము రాగానే వాళ్ళ శ్రీమతి స్వరూప రాణి గారు ఆప్యాయంగా పలకరించింది.లలితా సహస్రనామాలు,దుర్గా పూజ,అన్నపూర్ణ స్తుతితో ధూప దీప నైవేద్యం,మంగళహరతులతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరింపబడిన అమ్మవారి మందిరంలో ఘనంగా అమ్మవారిని పూజిస్తున్నారు.
గత సంవత్సరం కవి సమ్మేళనం జ్ఞాపకాలు
పోయిన సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి  నాడు  దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చింది. అప్పుడు కూడా వారు పిలిచారు, కానీ మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖనిలో ఆరోజు నేటి కవిత ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం వలన మూల నక్షత్రం నాడు హాజరు కాలేకపోయాము.  అయితే కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరుకు ఆ తెల్లారి  అంటే డిసెంబర్ 3 నాడు వెళ్ళాము.మేము నిన్నటి రోజున  అంటే మూలా నక్షత్రం రోజు  రాలేకపోయినా వారు మమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి  భోజనం పెట్టి, మా దంపతులకు బట్టలు పెట్టి దంపతి  తాంబూలం ఇచ్చారు.  తరువాత నిన్నటి దినాననే కవి సమ్మేళనం అయిపోయినప్పటికీ మమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి అమ్మవారి మీద కవితలు చదివించుకుని మాకు చెరొక శాలువా కప్పి చెరో 116/- పారితోషికం తాంబూలంలో పెట్టి ఇచ్చారు.
ఇది గతసంవత్సరం  ముచ్చట.
          
                 *
ఈ సంవత్సరం కూడా తప్పక హాజరు కావాలని, మూలా నక్షత్రం, సరస్వతి పూజ, కవి సమ్మేళనం  మిస్ కావద్దని  నిర్ణయించుకుని వారి పిలుపు అందుకున్నాక  ఒకసారి ఫోన్ లో మాట్లాడాము.ఈమాటు దసరా నవరాత్రుల్లో మూల నక్షత్రం అక్టోబర్  20వ తారీకు వచ్చింది ఇంకా వారం రోజులే సమయం ఉంది.
                  *
15 తారీకు పొద్దున రిజర్వేషన్ కౌంటర్ కి పరిగెత్తాను కానీ మేము సీనియర్  సిటిజెన్  అయినప్పటికిని దసరా సీజన్ కాబట్టి రైళ్లన్ని విపరీతమైన రద్దీగా ఉన్నాయి, వెళ్లే టికెట్టు (up  journey)మాకు దొరకలేదు వెయిటింగ్ లిస్ట్ 64 వచ్చింది. అయినా టికెట్ తీసేసుకున్నాను. రిటర్న్ టికెట్టు మాత్రం కన్ఫమ్ టికెట్  ఏసీ చైర్ కార్ దొరికింది.  టికెట్ కన్ఫర్మ్ కాకున్నా ఏమైతే  అయింది వెళ్లాలని నిశ్చయించుకున్నాం.
                   *
ఈనెల 19వ తారీఖు నాడు గురువారం మా కాలనీ సాయిబాబా గుడిలో మేము అన్నప్రసాద సమారాధనకు డబ్బులు కట్టాము. కాబట్టి సూట్ కేస్ సామానులు  అన్ని సర్దుకుని గుడికి వెళ్లి వచ్చిన భక్తులకు కొద్దిసేపు వడ్డించాము. ఆలయ నిర్వాహకులు మీరు వెళ్ళండి మీకు ట్రైన్ టైం అవుతుందని మమ్మల్ని  పంపించేశారు. గుడిలో అన్న ప్రసాదం తీసుకుని బయటపడి, సూట్ కేస్ తీసుకుని 279 ఇబ్రహీంపట్నం నుండి  JBS బస్సు ఎక్కి సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. టికెట్ వెయిటింగ్ లిస్టు ఎనిమిది దగ్గర ఆగిపోయింది. కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి జనరల్ కంపార్ట్మెంట్లో దూరి మొత్తానికి సీటు సంపాదించి హాయిగా కూర్చున్నాం. మూడున్నరకు భాగ్యనగర్  Express లో సికింద్రాబాద్ నుండి మంచిర్యాలకు బయలుదేరాము. రాత్రి 9 గంటలకు మంచిర్యాల చేరుకొని,మంచిర్యాల పట్టణంలో హైటెక్ సిటీ కాలనీలో  ఉండే శ్రీశ్రీ కళా వేదిక తెలంగాణ అధ్యక్షురాలు మాకెంతో ఆప్తురాలు కట్ల భాగ్యలక్ష్మి ఇంటికి చేరాం.
ఆ రాత్రికి  పప్పు,చపాతీలతో అల్పాహారం చేసి వాళ్ళింట్లో  రాత్రి బస చేశాం.
                   *
Day-2: 20.10.23.
డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారి ఊరు చెన్నూరు.  బొగ్గు గనుల నిక్షేపాలు కలిగి  సింగరేణి కాలరీస్ కంపెనీకి కేంద్ర స్థానమైన  మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో  చెన్నూరు పట్టణం ఉంది.
చెన్నూరు  విశేషమేమిటంటే
సామాన్యంగా నదులన్నీ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి,అయితే చెన్నూరులో గోదావరి నది ఉత్తరం వైపు ఐదు కోసులు అంటే 15 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. కాబట్టి దీనిని పంచకోశ ఉత్తరవాహిని అని పిలుస్తారు. అంటే గోదావరి నది ఉత్తరవాహినిగా ఈ ఊరు నుంచి ప్రవహిస్తుంది.  
గోదావరీ పరీవాహక ప్రాంతం కవులకు వరం..
చెన్నూరు పట్టణము ఎంతో మంది ప్రసిద్ధ కవులకు నిలయం.
ప్రసిద్ధకవి, 1600 పేజీల బృహత్గ్రంథం  పోతన చరిత్ర పద్య కావ్యం రచించిన పద్మభూషణ్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు పుట్టిన ఊరు ఇదే.
అలాగే సంగీత  విద్వాంసులు కే.శే., జెక్కేపల్లి కృష్ణశాస్త్రి గారు వారి కుమారుడు సంగీతంలో దిట్ట అయిన  జక్కేపల్లి నాగేశ్వర శర్మ గారు ఈ ఊరివారే. నాగేశ్వర శర్మ గారు మా  శ్రీమతి తరపున చుట్టాలు కూడా.
చెన్నూరు పట్టణంలో అంబా- అగస్తీశ్వర ఆలయం, జగన్నాథ ఆలయం అనే రెండు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.  ఎంతో పేరు పొందిన
ముక్తేశ్వర పంచాంగం సృష్టికర్త  శ్రీ రాంభట్ల ముక్తేశ్వర సిద్ధాంతి గారి ఊరు కూడా చెన్నూరు గ్రామమే కావడం విశేషం.
మేము  20th అక్టోబర్ ఉదయం  మా భాగ్యమ్మ ఇంట్లో అల్పాహారం చేసి బస్టాండ్ కి వెళ్లి చెన్నూరు బస్సు ఎక్కి 11 గంటల వరకు  పట్వర్ధన్ సార్ ఇంటికి చేరుకున్నాం. అప్పటికే  పట్వర్ధన్  గారి   పాత పెంకుటింట్లో ముందు  ఉన్న ఖాళీ స్థలంలో  టెంటు వేసి వేదిక ఏర్పాటు చేశారు. సార్ ఇల్లు చెన్నూరులో   సాయిబాబా గుడి దగ్గర, ప్రొఫెసర్ జయశంకర్ శాఖా గ్రంధాలయం పక్కన ఉన్నది.  టెంటు వేసిన  స్థలంలో  వేదిక  ముందు ఒక  50 కుర్చీలు వేశారు. అప్పటికే కవి సమ్మేళనం  ప్రారంభమైంది. రాగానే వేడి వేడి టీ ఇచ్చారు. పట్వర్ధన్ సార్ గారి సతీమణి స్వరూప రాణి గారు కూడా  పూజలో ఉన్నారు. వేదిక మీద చంద్రశేఖర్ అనే పెద్దమనిషి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు.  మంచిర్యాల, లగ్జేటి పేట, వరంగల్, అసిఫాబాద్, కాళేశ్వరం మొదలగు ఎన్నో చుట్టుపక్కల పట్టణాల నుండి,  అలాగే  చెన్నూరు పట్టణం నుండి కవులు వచ్చారు.
మన దర్పణం సాహిత్య వేదిక సభ్యులు నల్గొండ రమేష్ ,గుర్రాల వెంకటేశ్వర్లు, మాడుగుల నారాయణ మూర్తి గారు, ఆయన సతీమణి దేవరాజు రేవతి గారు  కూడా వచ్చారు. 
నేను బాసర సరస్వతి మీద రాసిన కవిత చదివాను.
కవి సమ్మేళనం ఒంటిగంటకు ముగియగానే 
మధ్యాహ్నం  చక్కటి విందుభోజనం ఏర్పాటు చేశారు. 
ఆముదాల మురళి గారి అష్టావధానం
అనంతరం పట్వర్ధన్ గారు స్వయంగా అవధాని అయినప్పటికీ, తిరుపతి నుండి ప్రముఖ శతావధాని ఆముదాల మురళి గారిని రప్పించి  అష్టావధానం నిర్వహించారు.
ఆముదాల మురళి గారు ప్రముఖ శతావధాని
ఆయనకు అవధాన కళానిధి, శతావధాన విద్వన్మరాళ అనే బిరుదులు ఉన్నాయి.  వారిని ఇంతకుమునుపు హైదరాబాద్ లో, పాలమూరులో  నిర్వహించిన  అవధానాలలో కలిశాం.
అలా వారితో మాకు పూర్వ పరిచయం ఉంది. 
ఈ అష్టావధానంలో పృచ్ఛకురాలిగా మా శ్రీమతి సీతాలక్ష్మిని  నియమించడం నాకెంతో సంతోషం కలిగించింది. ఆమె  వర్ణన అంశంలో పాల్గొన్నది.  అలాగే దర్పణం సాహిత్య వేదిక సభ్యులు అవధాని మాడుగుల నారాయణమూర్తి గారు, వారి సోదరులు భాస్కర శర్మ గారు అలాగే మా మిత్రులు  కే.ఎల్. కామేశ్వరరావు గారు అష్టావధానంలో పృచ్ఛకులుగా  పాల్గొన్నారు.
అవధాన సభ దాదాపు 2 గంటలు నడిచింది. మా సీతాలక్ష్మి అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని చంపకమాల వృత్తంలో వర్ణించమని అడిగితే  అవధాని గారు అందమైన పద్యాన్ని చెప్పారు.
సాయంత్రం 4:30  తర్వాత అవధాని గారికి మిగతా పృచ్ఛకులు అందరికీ సన్మానం చేశారు. అలాగే మా కవులందరికి వరుసగా పేరు పెట్టి పిలిచి ఒక్కొక్కరికి శాలువాతో  సన్మానం చేసి కవరులో  తగు పారితోషకం పెట్టి అందించారు. సాయంత్రం వేడి తేనీరు సేవించాము.
దర్పణం సాహిత్య వేదిక సభ్యులు ఆసీఫాబాద్ వాసులు గుర్రాల వెంకటేశ్వర్లు( జీ.వి),
నల్లగొండ రమేశ్ లు కలవడం పట్ల మేము చాలా సంతోషించాము.
మన దర్పణం సాహిత్య వేదిక సభ్యులు స్వయంగా అవధాని అయినటువంటి మాడుగుల నారాయణమూర్తి గారి స్వగ్రామం కాళేశ్వరం. భార్యాభర్తలు ఇద్దరూ ఆసిఫాబాద్ లో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్నారు. ఆయన మమ్మల్ని కాళేశ్వరానికి రమ్మని  శివుని దర్శనం చేసుకుని వెళ్ళమని ఆహ్వానించారు. ఎటుబడీ రేపు సాయంత్రం మా తిరుగు ప్రయాణం కాబట్టి మాకు  కాళేశ్వర స్వామి పిలుపు వచ్చింది అని సంతోషించి  ఆయనతో కార్ లో బయలుదేరాము.
అంతా కన్న ముందు పట్వర్ధన్  గారి ఇంటి పక్కనే ఉన్న   వారి చుట్టాలు వేదాంతం సురేష్ శర్మ గారి ఇంటికి వెళ్ళాము. ఆయన కూడా గొప్ప కవి,పండితుడు. మహారాష్ట్ర లోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. వారిని మేము  తమిళనాడు హోసూర్ లో ఒక ఆత్మీయ సమ్మేళనంలో కలిశాము.
వారింట్లో  వారి శ్రీమతి శ్రీలత ఇచ్చిన టీ తాగాము. శుక్రవారం నాడు ముత్తైదువ వచ్చిందని సంతోషించి  నాకు పెద్ద పరిచయం లేకున్నా ,మా శ్రీమతికి చాలా  సంవత్సరాల నుండి ముఖపుస్తకం ద్వారా పరిచయం ఉన్న  సురేష్ బాబు  దంపతులు  చీర పసుపు కుంకుమలు పెట్టి సత్కరించారు. 
వారి వద్ద సెలవు తీసుకుని
నారాయణ మూర్తి గారి కార్  లో సాయంత్రం 6:30 కు కాళేశ్వరం బయలుదేరాము.
చెన్నూరు నుంచి కాళేశ్వరం 33 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ దారిలో విశేషమేమిటంటే
చెన్నూరు నుండి  21 కిలోమీటర్లు ప్రయాణం చేశాక అర్జున గుట్ట అనే ప్రాంతం  వస్తుంది.  ఇక్కడ
ఉన్న  గోదావరి ఉపనది అయిన ప్రాణహిత నదిలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. పోయిన ఏడాది మేము కూడా మంచిర్యాల వెళ్లి అర్జున గుట్టలో ప్రాణహిత నదిలో పుష్కర స్నానం చేశాం.అర్జున గుట్ట దాటగానే మహారాష్ట్ర బోర్డర్ లోని "సిరోంచ"  అనే గ్రామం వస్తుంది ఇక్కడ  కూడా ప్రాణహిత ప్రవహిస్తుంది.ఈ గ్రామం కూడా  పుష్కర ఘాట్లు  కలిగి ఉండి ప్రాణహిత పుష్కరాలు ఇక్కడ కూడా జరుగుతాయి. సిరోంచ కాళేశ్వరం మార్గంలో  నాలుగు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. సిరోంచ కు అర్జున గుట్టకు ప్రాణహిత నదే  అడ్డం.  సిరోంచ మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో ఉంది.  సిరోంచ  గ్రామం దాటి   జాతీయ రహదారి మీద కుడివైపు తిరగగానే  మహారాష్ట్ర బోర్డర్ అయిపోయి  తిరిగి తెలంగాణ బోర్డర్ వచ్చి ఇంకో 8km వెళ్ళాక 
కాళేశ్వరం వస్తుంది. ఎడమవైపు జాతీయ రహదారిపై  మహారాష్ట్ర ప్రాంతం ఉంటుంది.
కాళేశ్వరం  మార్గంలో మనకు  ప్రాణహిత నది మీద వంతెన, మరియు గోదావరి నదిపై  వంతెన, అలా  2 పెద్ద పొడవైన వంతెనలు కనిపిస్తాయి.
అలా నారాయణమూర్తి గారి కారులో ప్రయాణం చేసి రాత్రి
8:30కు చేరుకున్నాం. కాళేశ్వరం బస్టాండ్ సమీపంలోని ఒక ‌కాటేజీ ఏసీ గదిలో  మాకు బస ఏర్పాటు చేశారు.
గదిలో దిగాక  దేవాలయం రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిసి కాళేశ్వరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి 
శ్రీ కాళేశ్వర-ముక్తేశ్వర దేవస్థానానికి వెళ్ళాము. శివాలయం  మూసి ఉంది. కానీ సరస్వతి అమ్మవారు శుభానందాదేవి అమ్మవారి ఆలయాలు తెరిచే ఉన్నాయి. అమ్మవార్లను దర్శించుకుని రాత్రి 11 గంటలకు అమ్మవార్ల దగ్గర  ప్రసాదం స్వీకరించి రూముకు వచ్చి పడుకున్నాం.
Day-3: 21.10.23.
పొద్దున 8:30 కల్లా స్నానం చేసి తయారై  గుడి ఎదురుగానే ఉన్నటువంటి మాడుగుల నారాయణమూర్తి గారి ఇంటికి వెళ్ళాం. మాడుగుల వారు  అప్పటికే వారి ఇంటి నుండి రెండు ఫర్లాంగుల దూరం లో ఉన్న గోదావరీ తీరానికి వెళ్ళిపోయారు.
వారి శ్రీమతి  దేవరాజు రేవతి గారు  కూడా ఉపాధ్యాయురాలుగా ఇక్కడ నుండి 100 కి.మీ. దూరంలో ఉన్న అసిఫాబాద్ లో భర్తతో పాటు పనిచేస్తున్నారు. అక్కడ కూడా వారు ఇల్లు కట్టుకున్నారు. 
మాడుగుల వారు ఐదుగురు అన్నదమ్ములు. సరిగ్గా ఆలయ ప్రవేశ ద్వారం ఎదురుగా వీధిలోనే ఐదుగురు అన్నదమ్ముల ఇళ్లు వరుసగా ఉన్నాయి. ఆ  రోడ్డు ఉన్న స్థలం వారిదే. దేవాలయం కు వెళ్ళే దారి కొరకు దాదాపు 16  గుంటల స్థలాన్ని ఉచితంగా మునిసిపాలిటీ కి  ఇచ్చినట్లు మాడుగుల వారు చెప్పారు. మాడుగుల వారి సతీమణి రేవతి గారిని  పలకరించాము. ఆమె కూడా తెలుగు పండిట్ మరియు పద్య కవి. వారెంతో సదాచార సంపన్నులు. మడి కట్టుకుని వంట చేసి మహా నైవేద్యం పెట్టాకనే వారు  భోజనం చేస్తారు.  మమ్మల్ని భోజనం చేసి వెళ్లమన్నారు   కానీ మాకు మధ్యాహ్నం  3 గంటలకు మంచిర్యాలలో ట్రైన్ ఉంది లేట్  అవుతుంది కాబట్టి మేము భోజనానికి ఉండలేమని చెప్పాము. ఇంకో విషయం ఏమిటంటే మేము మంచిర్యాల దారిలో చెన్నూరు దిగి పట్వర్ధన్ గారి ఇంటికి వెళ్లి వాళ్లను కలిసి తిరిగి మంచిర్యాల వెళ్లాలి కాబట్టి టైం సరిపోదు.
కాళేశ్వరం ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది.  తర్వాత జిల్లాల పునర్విభజనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోకి వచ్చింది. శివుడు,యముడు దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.  గోదావరి,ప్రాణహిత తో పాటు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి దీనిని  త్రివేణి సంగమం అనీ,దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.  త్రిలింగ క్షేత్రాలలో శ్రీశైలం,ద్రాక్షారామం తర్వాత కాళేశ్వరం మూడవది.
ఉదయం మళ్లీ శివాలయానికి వెళ్లి  స్వామివారిని దర్శించుకున్నాం. ఈ కాళేశ్వరం దేవాలయంలో విశేషమేమిటంటే ఒకే పానవట్టం  మీద రెండు శివలింగాలు ఉంటాయి. అలాగే అమ్మవారి పేరు ఒక ప్రత్యేకతతో కూడి ఉంటుంది. అమ్మవారి పేరు శుభానందాదేవి.
అలాగే సరస్వతి మాతను కూడ   దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని బయటికి వచ్చి మాడుగుల వారి ఇంటికి తిరిగి వచ్చాము.  వారి శ్రీమతి  రేవతి గారు మాకు టీ ఇచ్చి మా శ్రీమతికి పసుపు కుంకుమ గాజులతో  పాటు చీర పెట్టి సత్కరించింది. వారి వద్ద సెలవు తీసుకుని వెంటనే రూంకు వచ్చి మా సామాను తీసుకుని రూమ్ ఖాళీ చేసి, హోటల్ లో అల్పాహారం చేసి   పక్కనే ఉన్న బస్టాండ్  లో  మంచిర్యాల బస్ ఎక్కాము.
ఇంతకు ముందే చెప్పినట్లుగా మధ్యాహ్నం    మూడున్నరకు మాకు మంచిర్యాల నుండి  సికింద్రాబాద్  కు కాగజ్ నగర్ Express   ఉంది అయితే పట్వర్ధన్ గారికి మళ్లీ వస్తామని మాట ఇవ్వడం వలన  తిరిగి చెన్నూరుకు ప్రయాణం అయ్యాం. నిజానికి మంచిర్యాలకు వెళ్ళే దారిలోనే  చెన్నూరు ఉంది.మేము డైరెక్ట్ మంచిర్యాల బస్సు ఎక్కినప్పటికీ మళ్లీ చెన్నూరులో దిగి ఆటో చేసుకుని వారి ఇంటికి వెళ్లి వారిని పలకరించి కొంచెం అల్పాహారం  సేవించాం. భోజనం చేసి వెళ్ళమన్నారు కానీ అప్పటికే  1 pm. అవుతోంది. నాకు అసలే టెన్షన్. భోజనం చేసే టైం లేదు అని చెప్పాము. వారు మా శ్రీమతికి నాకు బట్టలు పెట్టి సత్కరించారు. మేము కూడా మా శక్తి మేరకు  మాకు తోచిన బట్టలు తీసుకొచ్చాము. కానీ స్వరూపరాణి గారు ఆ బట్టలు అమ్మవారి దగ్గర పెడతామనీ, దసరా నవరాత్రుల తర్వాతే ముట్టుకుంటామని చెప్పారు. ఆ బట్టల కవర్ ను అలాగే అమ్మవారి సమక్షంలో పెట్టేశారు. వారి వద్ద సెలవు తీసుకుని ఆటోలో తిరిగి చెన్నూరు బస్టాండ్  కు వచ్చాము. 
మంచిర్యాల బస్ రెడీ గానే ఉంది కానీ కండక్టర్  డ్రైవర్  తీరిగ్గా లంచ్ చేస్తున్నారు.  1.50 pm తర్వాత  బయలుదేరుతుంది అని చల్లగా చెప్పారు. నాకు ఇక్కడ చల్ల చమటలు పడుతున్నాయి. ఈ బస్ ను నమ్ముకుంటే అది మధ్యాహ్నం  ఏ 3 గంటలకో చేరుతుంది. మేము  హైటెక్ సిటీ కాలనీ  లో భాగ్యమ్మ ఇంటికి వెళ్లి మా సూట్ కేస్ తీసుకుని స్టేషన్ కు వచ్చేసరికి  గ్యారంటీగా 🚂  ట్రైన్ వెళ్ళిపోతుంది. ఒకటే టెన్షన్.  లేట్ అయితే ట్రైన్ దొరకదేమో అని దిగులు.
                *
ఇక  లాభం లేదని బస్టాండ్  బయటికి వచ్చి ప్రైవేట్ వెహికిల్ కోసం చూస్తే అక్కడ టాటా ఏస్  8 సీటర్ ప్రైవేట్ బండి  రెడీగా ఉంది. దబ దబా మా సామాను తీసుకుని బస్టాండ్ బయటికి వచ్చి ఆ టాటా ఏస్ బండి ఎక్కాం. ఆ డ్రైవర్ బండిలో ఒక 11 మందిని ఎక్కించి  మంచి ఫాస్ట్ గా  35 కిలోమీటర్ల దూరం ఉన్న మంచిర్యాల ను ఒక గంట లోపలే  డైరెక్ట్ గా మంచిర్యాల  చేర్చాడు. మేము బెల్లంపల్లి చౌరస్తాలో  దిగేసి వెంటనే ఒక ఆటోను  అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుని హైటెక్ సిటీలోని మా భాగ్యమ్మ ఇంటికి వెళ్లి   భాగ్యమ్మ కట్టి ఇచ్చిన చపాతీలు ప్యాక్ చేసుకుని వారి  దగ్గర వీడ్కోలు తీసుకుని అక్కడ ఉన్న మా సూట్ కేస్ తీసుకుని అదే ఆటోలో మంచిర్యాల స్టేషన్ కు  వచ్చేశాము.
                *
 3.30 pm. కు రావాల్సిన రైలు  4 pm. కు వచ్చింది.  వచ్చేటప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి కొంచెం అవస్థ పడ్డా తిరుగు ప్రయాణంలో చక్కగ ఏసీ చైర్ కార్ లో  ప్రయాణం చేసి రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరాము. 7:45 కు రావాల్సిన ట్రైన్ రాత్రి పది గంటలకు 2 గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరింది.  బయటికి వచ్చి మా కాలనీ బస్  279 ఎక్కి రాత్రి 11 గంటలకు మా ఇంటికి క్షేమంగా చేరాం.
రోజంతా కేవలం అల్పాహారం తో గడిపిన మేము రాత్రికి వేడివేడిగా వండుకుని తిని విశ్రమించాం.
ఇదండీ మా  మూడు రోజుల మంచిర్యాల- చెన్నూరు- కాళేశ్వరం సాహితీ యాత్ర విశేషాలు.😊
       :ఉప సంహారం:
ఈ సందర్భంగా మా కవితా యాత్రలో మమ్మల్ని ఎంతో ఆదరించిన పట్వర్ధన్- స్వరూప రాణి దంపతులకు,
మాడుగుల నారాయణమూర్తి- రేవతి దంపతులకు,   చెన్నూరు గ్రామ నివాసి   వేదాంతం సురేష్ బాబు- శ్రీలతదంపతులకు, అలాగే  మా అమ్మాయి, మాకెంతో ఆప్తురాలు, శ్రీశ్రీ కళా వేదిక తెలంగాణా రాష్ట్ర అధ్యక్షురాలు,శ్రీమతి కట్ల భాగ్యలక్ష్మి- మల్లేష్ కు... మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మళ్లీ వచ్చే విజయదశమికి మూల నక్షత్రం నాడు చెన్నూరు  కవి సమ్మేళనానికి రావాలని, ఆ అవకాశం భగవంతుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ... 


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ధన్యవాదాలు వేదాంతం గారికి.చాలా గొప్ప అనుభూతిని కలిగిబిక్కుగారు.మంచి వ్యాసం