శ్రీ బాలత్రిపురసుందరిదేవి;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
మత్తకోకిల.

బాలరూపిణి!భానుశోభిత!భద్ర!పంకజవాసినీ!
మూలశక్తివి విశ్వమేలెడి పుణ్యశాలిని!భక్తులన్
మేలుగా కనిపెట్టి కాతువు మీనలోచని!యంబికా!
దాలిమిన్ నను గాంచుమమ్మరొ!దైన్యవారిణి!చిన్మయీ!//

మత్తకోకిల.

అక్షమాల ధరించి భక్తుల నాదరింతువు బాలగన్
దక్షతన్ బరిమార్చి దైత్యులఁ దాసకోటిని బ్రోచిమా
కక్షరంబుల నిచ్చుతల్లి!కృపాంబుధీ!నిను వేడుచున్
దీక్షతోడ యజింతు నమ్మరొ!దేవవందిత భాగ్యదా!//

మత్తకోకిల.

శైలపుత్రిక!హైమ!పార్వతి!శంభురాణి!శుభాంగినీ!
కాలచక్రముఁ ద్రిప్పుచుందువు కాలరూపిణివైయుమా!
కాలుచుందుము జన్మలందున కాల్చివేయుమ!పాపముల్
జాలిచూపవె!శ్యామలా!నిను సన్నుతింతును భక్తిగన్.//

ధ్రువకోకిల.

త్రిపుర సుందరివై జగత్తును తీర్చిదిద్దెడి తల్లి!నీ
కృపను గోరితి పేదరాలను గేహమందున నిల్వుమా!
జపతపంబులఁ జేయబోవగ శక్తిలేదని తెల్పి నీ
సపరిచర్యలు జేసి కొల్తును సమ్మతించుమ!శాంకరీ!//


కామెంట్‌లు