సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -291
శ్యేనాధికరణ న్యాయము
******
శ్యేనము అంటే గద్ద లేదా డేగ. అధికరణము అంటే  ఆధారము,ఒక విషయమునకు సంబంధించిన వాదోపవాదములు, న్యాయస్థానము  అనే అర్థాలు ఉన్నాయి.
పావురములు, కొంగలు మొదలైన వాటిపై డేగకు అధికారము ఇచ్చినట్లు...
డేగ అంటేనే ఆధిపత్యానికి ప్రతీక. డేగకు శతాబ్దాల  చరిత్ర ఉంది. డేగను ధైర్యానికి, గౌరవానికి,గర్వానికీ, సంకల్పానికి, నాయకత్వానికి  చిహ్నంగా భావిస్తారు. బాబి లోనియన్ కాలం నుండి కూడా  డేగకు ప్రత్యేకమైన స్థానం ఉండటం విశేషం.యుద్ధానికి మరియు సామ్రాజ్య శక్తికి చిహ్నంగా డేగను  తీసుకోవడం  చదువుకున్నాం.అంతేకాదు అమెరికా,రష్యా, పోలాండ్  మొదలైన దేశాలు డేగను తమ జాతీయ పక్షిగా(అందులో  కొన్ని రకాలను)తీసుకున్నాయి అంటే డేగకు ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు.
డేగ అంటే  దేనికి ప్రధాన చిహ్నమో మనకీపాటికి అర్థమైపోయింది కదా!
మరి దానికి  కొంగలు,పావురాలపై అధికారం ఇస్తే ఎలా ఉంటుంది? అవి ఇక క్షణ క్షణం భయం భయంతో బతకాల్సిందేగా!.
 అలాంటి అర్థాన్ని దృష్టిలో పెట్టుకొనే మన పెద్దలు ఈ "శ్యేనాధికరణ న్యాయము"ను సృష్టించారు‌.సమాజంలో ప్రజలను, నాయకులను చూసి వారికి వర్తింప జేశారు.
అలాంటి ఆధిపత్య, సామ్రాజ్య వాద దోరణి కలిగిన దుష్టులకు అధికారం ఇస్తే  సామాన్య ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో  నియంత అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ల చరిత్ర చదివిన  వాళ్ళందరికీ తెలుసు.అలాంటి నియంతల చరిత్రలు చదివినట్లయితే  వారి  అకృత్యాలు, ఆధిపత్యం లాంటి అనేక విషయాలు తెలుస్తాయి.
కాబట్టి అలాంటి  దుష్టులకు అధికారాన్ని చేతికి ఇవ్వడం అంటే మన గొయ్యి మనం తోడుకున్నట్లేననీ. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరిచి బిక్కు బిక్కు మంటూ దయనీయమైన జీవితం గడిపే పరిస్థితులు వస్తాయనీ చెప్పేందుకు సరిగ్గా సరిపోతుంది ఈ "శ్యేనాధికరణ న్యాయము."
 దీనిని సదా గమనంలో పెట్టుకొని  మన అభివృద్ధికి తోడ్పడే వారిని, సమ సమాజ నిర్మాణానికి అవసరమైన సేవలు చేయ గలిగే  వారినే ప్రతినిధి/ అధికారిగా ఎంపిక చేసుకుందాం. ఇదే ఈ "శ్యేనాధికరణ న్యాయము"లో గ్రహించాల్సిన అసలైన నీతి.అది గ్రహిద్దాం.ఆచి తూచి అడుగులు వేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు