న్యాయాలు -289
శ్యామ రక్త న్యాయము
******
శ్యామ అంటే నల్లనిది,ఆకుపచ్చనిది, మబ్బు, కోయిల అనే అర్థాలు ఉన్నాయి.
రక్త అంటే రంగు వేయబడిన, ఎర్రనైన, అనురాగ యుక్తమైన, ప్రియమైన, మధురమైన అనే అర్థాలు ఉన్నాయి.
వస్త్రానికి శ్యామల వర్ణము పోయినప్పటికీ ఎరుపు రంగో మరొక రంగో లేకుండా మాత్రం ఉండదు.అంటే ఏదో ఒక రంగు మాత్రం వస్త్రాన్ని అంటి పెట్టుకొని వుంటుంది.
అనగా ఏ వస్తువైనా తనదైన ఏదో ఒక గుణాన్ని కలిగి ఉంటుంది. ఏ గుణము లేకుండా వుండదు అనే అర్థంతో ఈ "శ్యామ రక్త న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే తెలుగులోని" పుట్టుకతో వచ్చే బుద్ధులు పుడకలతో కానీ పోవు" అనే సామెతతో మనుషుల మనస్తత్వాన్ని, గుణాలను పోలుస్తూ వుంటారు. అంటే చిన్న నాటి నుండి వచ్చిన అలవాట్లు కానీ గుణాలు కానీ అంత తొందరగా పోవని అర్థము.
మరి దీనికి సంబంధించిన ఓ ఉదాహరణను చూద్దాం...
వాల్మీకి రామాయణంలోని యుద్ధ కాండలో "రామునితో యుద్ధం వద్దని" రావణాసురుడికి తాత వరుసైన మాల్యవంతుడు హితవు చెప్పబోతాడు.
అప్పుడు రావణుడు " నా శరీరము రెండు ముక్కలైనా సరే నేను ఎవ్వరికీ లొంగను. అది నా సహజ గుణము" అంటాడు.
అలా పుట్టుకతో వచ్చిన గుణమును 'జాయమానము' అంటారు.అలాంటి సహజ గుణాన్ని గాని, బుద్ధిని గాని ఎన్ని పుటాలు పెట్టినా మారదన్న మాట.
దీనికి సంబంధించి ఓ పంచతంత్ర కథను కూడా చూద్దాం...
ఓ నక్క ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఓ గ్రామానికి చేరింది. దాన్ని చూసి అక్కడున్న గ్రామస్తులు దాని వెంట పడి తరుముతారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంట్లో వాళ్ళు కలిపిన నీలిరంగు నీటిలో పడుతుంది. అందులోంచి బయటకు వచ్చేసరికి దాని ఒళ్ళంతా నీలం రంగులోకి మారుతుంది. అది చూసుకుని మురిసిపోతూ అడవిలోకి వెళ్ళి తానో ప్రత్యేక జంతువుగా అడవికి రాజుగా గుర్తింప బడుతూ పులి, సింహాలను కూడా భయపెడుతుంది.అలా కొద్ది రోజుల తర్వాత ఓ అర్థ రాత్రి నక్కలు అన్ని కలిసి ఊళ వేస్తాయి. అది విన్న నీలం రంగు నక్క కూడా ఊళ వేస్తుంది. అది తన సహజ గుణం మానలేదన్న మాట.
వేష భాషలు ఎన్ని మారినా లోలోపల ఉండే సహజ సిద్ధమైన గుణం మారదని, అది ఎప్పటికైనా బయటికి వస్తుందని ఈ"శ్యామ రక్త న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి