సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -292
శ్రుతి బలీయస్త్వన్యాయము
******
శ్రుతి అనగా వినికిడి,చెవి, వేదము, సుతి ,సుద్ది అనే అర్థాలు ఉన్నాయి.బలీయస్త్వ అనగా మిక్కిలి బలంగా అని అర్థము.
 శ్రుతి క్రమ,అర్థ క్రమ,పాఠ క్రమ, ప్రవృత్తి క్రమముల యందు ప్రవృత్తి క్రమము కన్న పాఠ క్రమమును, పాఠ క్రమము కన్న అర్థ క్రమము, దాని కన్నా శ్రుతి క్రమమును క్రమంగా బలీయములైనట్లు అని అర్థం.
ఆశించిన ఫలితాలు క్రమేణా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ పూర్వాపూర్వ ఔన్నత్యాన్ని ,  ఒకదానిని మించి మరొకటి మెరుగైన ఫలితాలను సూచించడాన్ని "శ్రుతి బలీయస్త్వన్యాయము" అంటారు.
శ్రుతి అనగానే మనకు చటుక్కున గుర్తుకొచ్చేది పాట. శ్రుతి క్రమం లేని పాట మనసును రంజింప నీయదు.
సంస్కృత పదమైన 'శ్రుతి' సందర్భాన్ని బట్టి అనేక అర్థాలు కలిగి ఉంది.సంస్కృతంలో విన్నది అని అర్థం. వేదాలు, ఉపనిషత్తులను శ్రుతులు అంటారు.
సంగీత ప్రపంచంలో శ్రుతి అనే పదాన్ని అనేక మార్లు వాడుతూ ఉంటారు. ఈ శ్రుతిని శృతి అని కూడా  అనవచ్చు. శ్రుతి అంటే మనిషి యొక్క చెవి గుర్తించే స్వరస్థాయి యొక్క చిన్న విరామాన్ని శ్రుతి అంటారు. శ్రుతి యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ముందు భారతీయ సంగీతం గురించి తప్పకుండా అంతో ఇంతో అవగాహన పెంచుకోవాలి. అప్పుడే శ్రుతిని సరిగా నిర్వచించవచ్చు.
మన ప్రాచీన భారతీయులు శృతిని వినడం, కంఠస్థం చేయడం మరియు పఠించడం వంటి పద్ధతులుగా అభివృద్ధి చేశారు. వేదాలు మరియు ఇతర జ్ఞాన గ్రంథాలను ఒక తరం నుండి మరో తరానికి ప్రసారం చేయడంలో అనేక రకాల పాఠాలను రూపొందించారు.
వేదాలలోని నాలుగు రకాల గ్రంథాలలో మూడు గ్రంథాలు ప్రవర్తనా సూత్రాలను కలిగి వున్నాయి.ఇవి ఉపాధ్యాయుని నుండి విద్యార్థులకు మౌఖికంగా అందజేయబడినవి.ఇలా గురువు నుండి శిష్యుడికి చెప్పడం.ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్పడం అనే పరంపరలో నడిచాయి. ఇలా వినడం ద్వారా  వేల సంవత్సరాలుగా మౌఖికంగా పరంపరాగతంగా వచ్చిన వాటిని శ్రుతులు అంటారు.
ఈ విధంగా ప్రతి  వచనం అనేక మార్గాలలో అనగా విద్యార్థి యొక్క ప్రవృత్తి అభ్యాస క్రమముగానూ,పాఠ క్రమముగానూ, అంత కంటే తనకు తానుగా తెలుసుకోగలిగే అర్థ క్రమముగానూ...ఇలా దశల వారీగా శృతి అనగా ధ్వని పరంగానూ తరతరాలుగా ఋషుల నుండి మరో తరానికి వినికిడి  అంటే శృతి ప్రధానంగా మౌఖికంగా ప్రసారం చేయబడింది.అందుకే పురాణాలు శృతిని దైవిక మూలం అన్నాయి.
 ఇదండీ శ్రుతి బలీయస్త్వన్యాయము యొక్క కథా కమామీషు. ఇది  కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశమే మరి.
తరతరాలుగా విస్తరించిన శ్రుత పాండిత్యం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చెప్పడం.
అలాగే  సంగీత ప్రపంచంలో శృతికి ఉన్న ప్రాధాన్యత,గొప్పతనాన్ని గురించి చెబుతూ ,అది  స్వయంగా మనసునెలా రంజింప జేయగలదో చెప్పడమే ఈ న్యాయము యొక్క ప్రత్యేకత.దానిని ఆస్వాదించాలి అనుభూతించాలి అంటే తప్పకుండా వినాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు