సునంద భాషితం -వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -297
శ్వ శుష్కాస్థి న్యాయము
*****
 శ్వ అంటే శునకము లేదా కుక్క.శుష్క అంటే ఎండినది. అస్థి అంటే ఎముక.
 శ్వ శుష్కాస్థి అంటే కుక్క ఎండిన ఎముకను నమలడం.
 కొంచెమైనా మాంసం లేని ఎండిన ఎముక దొరికినా చాలు కుక్క దానిని వదలకుండా నములుతూనే వుంటుంది.
ఆ ఎండిన ఎముక వల్ల కుక్కకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆకలీ తీరదు.కడుపూ  నిండదు. ఏదో  దొరుకుతుందనే భ్రమతో దానిని అదేపనిగా నములుతూ వుంటుందన్న మాట.
అలా నాలుక చీరుకుపోయి రక్తం వస్తున్నా ,ఆ ఎండిన ఎముకను విడిచి పెట్టకుండా కొరుకుతూ, నములుతూనే వుండటాన్ని శ్వ శుష్కాస్థి అంటారు.
సమాజంలో కొందరు మోసగాళ్ళు ,నాయకులు ఇలా కుక్కకు ఇష్టమైన ఎముక లాంటి  వాగ్ధానాలు  చేస్తూ అమాయకులను, కార్యకర్తలను తమ చుట్టూ తోకూపుకుంటూ అంటే నమ్మిన బంటుల్లా తిరిగేలా చేసుకుంటుంటారు.పాపం  తమకేదో మేలు,  ప్రయోజనం ఉంటుందని అలా వాళ్ళు చేసిన మోసపూరిత వాగ్దానాలు, ప్రమాణాలను నమ్మి బొమికల్లా నములుకుంటూ అందులో సారం తమకు అందుతుందనే భ్రమల్లో జీవితాంతం బతుకుతూ వుంటారు.
అందులోని వాళ్ళ మాయలను, మర్మాలను, చేస్తున్న  మోసాలను ఎవరైనా  హితైషులు విశదంగా విప్పి చెప్పినా ఆ చెప్పిన వారినే అనుమానిస్తారు కానీ అసలు వాళ్ళ మీద విశ్వాసాన్ని అణువంతైనా సడల నీయరు.
అయితే అలా భ్రమింపజేసి తమ కావలసిన పనులు అన్నీ చేయించుకునే వారిని  ప్రాణం పోతున్నా తమ పిచ్చి నమ్మకాలను వదలని వారిని ఉద్దేశించి మన పెద్దలు ఈ"శ్వ శుష్కాస్థి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
నేటి కాలంలో కొందరు నాయక శిఖామణులకూ, వారిని గుడ్డిగా నమ్మే కార్యకర్తలకూ,అమాయక  జనాలకు వంద శాతం ఇది వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఏది నిజం? ఏది అబద్దం? ఏది మంచి? ఏది చెడు?  ఎవరు ఎలాంటి వారో? విచక్షణతో తెలుసుకోకుండా, తెలియకుండా ఉన్నంత వరకూ ,నమ్మినంత కాలం  ఈ "శ్వ శుష్కాస్థి న్యాయము"లా  ఎవరైనా సరే  ఇలా మోసపోతూనే వుంటారు. 
 అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. కుక్కకు వేసే బొమికల్లాంటి హామీలు గుట్టలు గుట్టలుగా గుప్పించడం చూస్తూ ఉన్నాం.ఆచరణలో సాధ్యం కాని వాటికి ఆశపడితే ఇక ఐదు సంవత్సరాల పాటు అలా సారం లేని హామీల బొమికల్ని నములుతూ వుండాల్సిందే.
 కాబట్టి జర జాగ్రత్తగా వుండేలా మన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృతం చేద్దాం. మీరేమంటారు?
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు