సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -300
శ్వాన మకర న్యాయము
*****
శ్వానము అంటే శునకము లేదా కుక్క. మకరము అంటే మొసలి.
"శ్వాన మకర న్యాయము" అంటే కుక్క మొసలి యొక్క బలాబలాలు ఎప్పుడు? ఎక్కడ? ఎలా వుంటాయి? అనే అర్థంతో చెప్పబడింది.
 కుక్క నేల మీద ఉంటుంది.మొసలి నీళ్ళలో ఉంటుంది.కుక్క నీళ్ళలోకి వెళితే...? మొసలి నేల మీదకి వస్తే? ఏం జరుగుతుంది? అనగానే ఎవరైనా చటుక్కున చెప్పేస్తారు.కుక్కకు నేల బలం, మొసలికి నీళ్ళు బలమని.
నేల మీదైతేనే కుక్క తన బలాబలాలను చూపించుకోగలదు.అలాగే మొసలి కూడా  నీళ్ళలో ఐతేనే బలాన్ని ప్రదర్శించగలదు.ఇలా వాటి బలాబలాలను,శక్తి సామర్థ్యాలను అవి వుండే స్థానాన్ని బట్టి చూపగలవని మనకు అర్థం అవుతుంది.
అందుకే వేమన గారు ఏమంటారంటే...
"నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు/బయట కుక్క చేత భంగపడును/ స్థాన బలిమి గాని తన బల్మి గాదయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
నీళ్ళలో ఉన్నప్పుడు మొసలి ఎంత చిన్నది అయినప్పటికీ చాలా పెద్ద ఏనుగును కూడా నీటిలోపలికి లాగి చంపేయగలదు. కానీ అదే మొసలి తన స్థానమైన నీటిని వదిలి బయటికి వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది.అవమానింపబడుతుంది.మరి మొసలికి అంత బలం తన స్థానం వల్లే వచ్చిందే కానీ,తన స్వంత బలము కాదని అర్థం.
ఈ విషయాన్ని గురించి పోతన భాగవతంలో రాసిన గజేంద్ర మోక్షము చదివితే తెలుస్తుంది.
ఒకానొక సారి గజరాజు ఓ సరోవరంలో దిగి జలక్రీడ జరుపుతున్న సమయంలో ఒక మొసలి గజరాజు కాలు పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేస్తుంది.అంత గొప్ప గజేంద్రుడు మొసలిని గెలవలేని దీనావస్థలో  విష్ణుమూర్తిని ప్రార్ధించడం. స్వయంగా విష్ణు మూర్తే వచ్చి ఆ గజరాజును రక్షించడం మనందరికీ తెలిసిందే.
 అంటే ఇక్కడ మనం గ్రహించ వలసింది స్థాన బలం యొక్క గొప్పతనం. అది  జంతువులకే కాదు మనుషులకూ వర్తిస్తుందని తెలుసుకోవడం.
మనుషులకు తాము పుట్టి పెరిగిన ఊర్లో ఉన్న స్థాన బలం పలుకుబడి, పొరుగు ఊర్లో ఉండదు. కారణం స్వంత వూరిలో సంఘ బలం ఉంటుంది. తానేంటో తెలుసు కాబట్టి కష్టానికైనా, నష్టానికైనా ఆదుకునే వారు వుంటారు. కాబట్టి స్థానబలాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదని ఈ "శ్వాన మకర న్యాయము" ద్వారా గ్రహించి, తదనుగుణంగా మన సంఘ బలాన్నీ, సంస్కార బలాన్నీ పెంచుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు