నిత్యోదయాలు ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నిత్యోదయాలు
నిత్యావస్థలు
నిత్యకర్మలు
నవీకరించి చెప్పమంటున్నాయి

ప్రభాత గాలి
తనువును తాకి
మెల్లగా లేపి 
మంచంపై కూర్చోబెడుతుంది

ఉదయపు కాంతి
కిటికీనుంచి దూరి
కళ్ళలోకి ప్రవేశించి
లేచి నిలబెట్టిస్తుంది

పక్షులుకిలకిలా అరచి
బద్ధకంవిడిచి లెమ్మని
బయటకురమ్మని గోలచేసి
ఉద్యానవనాల్లో నడవమంటాయి

గుడిలో గంటలుమ్రోగి
సుప్రభాతగేయాలు వినిపించి
రారమ్మంటూ పిలిచి
భక్తిని పెంపొందిస్తాయి

వేడివేడికాఫీ వెంటనేత్రాగమని
వంటికి వేడెక్కించమని
దేహాన్ని ఉత్సాహపరచి
దైనందిన కార్యాల్లోకిదించుతాయి 

దినపత్రిక వరండాలోపడి
తాజాతాజావార్తలు చదవమని
మనసును తట్టి
తలుపును తెరిపిస్తుంది

మదిలో ఆలోచనలుపారి
పనులకు ఉసిగొలిపి
ప్రణాళికను ఇచ్చి
కార్యాలను అప్పగిస్తాయి

కడుపుఖాళీ అయి
ఆకలి అయి
అల్పాహారం తీసుకోమని
పేగులు గొడవచేస్తాయి

కలము చేతికెక్కి
కాగితాలపైచెక్కించి
కమ్మనికవితను కూర్పించి
పత్రికలకుసమూహాలకు పంపమంటుంది

పాఠకలోకం
ప్రశంసిస్తే పరవశం
సాహిత్యలోకం
సన్నుతిస్తే సంతోషం


కామెంట్‌లు