ఘనంగా బాలిక పుట్టినరోజు వేడుకలు

 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న అనుముల మనస్వి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని తన సొంత ఖర్చులతో రెండు కిలోల కేక్ తీసుకొచ్చి బాలిక జన్మదిన వేడుకలను పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య గత పది సంవత్సరాల నుండి పాఠశాల పిల్లల జన్మదిన వేడుకలను తన సొంత ఖర్చులతో పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల పిల్లల్ని తన సొంత బిడ్డల్లాగా ఆప్యాయంగా చూసుకోవడమే కాకుండా వారి ఆనందం, సంతోషం కోసం తన సొంత డబ్బులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో పాటు పిల్లలకు చక్కటి విద్యను అందిస్తున్నారు. ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారు చేశారు. మంగళవారం మనస్విని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలు మనస్వికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతిలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్వికి కేకు తినిపిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ రోజురోజుకు ప్రైవేట్ విద్యా వ్యాపారం జోరుగా సాగుతోందని, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిన పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని నాణ్యమైన గుణాత్మక విద్యా బోధన జరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన కోరారు. చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ మోజులో పడి, కష్టించి సంపాదించిన వేలాది రూపాయలను వృధా చేసుకుంటున్నారని, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి తమ డబ్బును ఆదా చేసుకోవాలని ఈర్ల సమ్మయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతి, పిల్లల తల్లిదండ్రులు అనుముల రమేష్, శోభ, మధ్యాహ్న భోజన పనివారు విజయ, సుశీల, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు