ఆరోగ్యమే మహాభాగ్యం(బాలపంచపదులు );- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 1.
పంచభూతాత్మ సమ్మిళితమీ దేహం
త్రిగుణాత్మక సంచలిత మానసం
మనోబుద్ధ్యహంకార యోగభరితం
ధర్మార్థమోక్షసాధనాత్మకరూపం
మేలగు జీవనమే సుఖం విజయ!//
2.
ప్రకృతితో మమేకమైన జీవనం
ఆరోగ్యప్రదాయకమానందమయం
ప్రకృతిని వీడి చరించననర్థం
కలుగుచుండ దేహమౌను శిధిలం
మేలగు జీవనమే సుఖం విజయ!//
3.
పరిమళించు ప్రాతఃకాల సమీరం
స్వచ్ఛమై శ్వాసకిడుచుండులే ప్రాణం
ఉషోదయాన్ని తప్పక వీక్షించటం
ఆయుష్షును పెంచెడి యమృతపానం
మేలగు జీవనమే సుఖం విజయ!//
4.
సమతుల్యమౌ శాకాహారమే బలం
పాశ్చాత్య జీవనం పెంచుననారోగ్యం
పరిమితభోజనం శ్రేయోదాయకం
మాదకద్రవ్య సేవనం విషతుల్యం
మేలగు జీవనమే సుఖం విజయ!//
5.
సజ్జన సాంగత్యం సన్మార్గసోపానం
పరోపకారము పెంచునాత్మబలం
సేవాతత్పరత సర్వజనామోదం
సాధుగుణవర్తనం  శుభదాయకం
మేలగు జీవనమే సుఖం విజయ!//
6.
అరిషడ్వర్గనాశనమావశ్యకం
నిర్మలమౌ మనస్సుతో నిత్యానందం
సర్వకార్యాలు భగవత్సమర్పణం
వైరాగ్యమే భవబంధవిమోచనం
మేలగు జీవనమే సుఖం విజయ!//
7.
ఆరోగ్యమే ప్రజలకు మహాభాగ్యం
మనజీవన విధానమే కారణం
నిత్యమాచరణీయమౌ వేదపాఠం
నేర్చుకుంటే చాలు నూరేళ్ళ వసంతం
మేలగు జీవనమే సుఖం విజయ!//

కామెంట్‌లు