ఈతలో నా అనుభవము:- ప్రా.:తంగెడ జనార్దనరావు - హన్మకొండ

   మొదటి భాగము.
                ------------------------
         మాది కోతులనడుమ . ఈ ఊరు హూజూరాబాదుకు 8 కి.మీ. దూరంలో ఉండి కరీంనగర్ జిల్లాలో ఉండేది . కాని ఇప్పుడు ఇది హనుమకొండ జిల్లాలో ఉంది . 
         మా ఊరికి ఒక వాగు ఉంది . దాని ఒక ఒడ్డుమీద ఊరు ఉంది . దాని ప్రక్కనే చెరువు , దాని క్రింద పంట పొలాలు  ఉన్నవి. ఇంకొక ఒడ్డుమీద రెండు మామిడి తోటలు ఉన్నవి. 
         మా ఊరిలోని వాగులో నా బాల్యకాలములో ఎప్పుడు నీరు ఉండేది . ఈ వాగు వెళ్ళి కమలాపూర్ గ్రామపు చెరువులో కలుస్తుంది. కాబట్టి వాగుకు వరద వచ్చిన ప్రతిసారి చెరువులోని చేపలు ఎదురు ఈది వాగులోనికి వస్తుండేవి. దానితో మాకు చేపలు ఎప్పుడూ అంటే దాదాపు 8 నెలలపాటు చేపలు దొరుకుతుండేవి . వేసవి కాలములో వాగులో పర్రె (కాలువ) తోడడం వల్ల  వచ్చిన నీటితో పొలాలకు వేసవి కాలంలో నీరు దొరుకుతుండేది . అందువల్ల ఊరు చెరువు చిన్నదైన రెండు పంటలకు సంవత్సరం పొడుగున నీరు లభిస్తుండేది . వాగుకు ఇరువైపుల తాటిచెట్లు ఈతచెట్లు విరివిగా ఉండడం వల్ల ఎప్పుడు కల్లు పుష్కలంగా దొరుకుతుంది . 
ఎప్పుడైన ఇంట్లో ఏకూర లేనప్పుడు వాగులో దిగి చేపలను పట్టుకవచ్చి పులుసు చేసుకునే వారు వూరి జనులు .
 వర్షాకాలంలో పెద్ద పెద్ద చేపలు లభించేవి .మిగతా కాలంలో కనీసం పరకలైనా దొరుకుతుండేవి . 
          వరంగల్లు జిల్లాను కరీంనగర్ జిల్లాను కలుపుతు ఒక మంచి కంకర రోడ్డు ఉండేది . అందువల్ల కార్లు , లారీలు ఆ రోడ్డు మీద వెలుతుండేవి. చాలా మంది వాహనాలను ఆపుకొని మామిడి చెట్టు నీడలో కూర్చుండి కల్లు సేవించేవారు . దానికంటే  ముందు వాగులో దిగి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని చెలిమ తోడి నీళ్ళు చల్లి ఊట నీటిని త్రాగి ఉపశమనం పొదేవారు. 
            ఇలాంటి ఊరిలో చిన్నపిల్లలందరము వాగులోను చెరువులోను చిన్నప్పుడే ఈత నేర్చుకునేవారము . అలా చిన్నప్పుడే నాకు ఈత నేర్చుకునే అదృష్టం లభించింది. 
తర్వాత మోటబావులలో దిగి ఈతకొడుతు దొంగాట ఆడేవారము . ఆరోజులలో బావియొక్క ఒడ్డుమీది నుండి నీటిలో దూకి ఈతకొట్టడం , ఒడ్డుమీది నుండే “ డై “ కొట్టడం ఒక చాలెంజింగ్ గా ఉండేది. అంతకంటే గొప్పది మోట చిమ్ములెక్కి బావిలో దూకి ఈత కొట్టడం  ఒక  సాహసంగాను మహత్వపూర్ణంగాను ఉండేది. ఎందుకంటే మోటచిమ్ములు ఎక్కినప్పుడు కండ్లు తిరిగి పడిపోయే అవకాశం ఉంది . 
           ఒక వేసవి కాలంలో ఒక రోజున పిల్లలందరము ఒక మోటబావి దగ్గరకు పోయి ఈత కొడుతున్నాము. అందరము సరదాగా నీటిలో దిగి దోంగాట ఆడుతున్నాము. మాలో ఒకరు మోటచిమ్ములెక్కి దూకుదామన్నాడు . అందులో కొందరు సరే అన్నారు . ధైర్యం ఉన్నవాళ్ళందరము పైకి ఎక్కి వచ్చాము . ఆబావికి మెట్లు ఉన్నవి . అంటే అది నడబావి. నడిచి దిగవచ్చు. అది రాతి కట్టడపు బావి. అనగా బావి త్రవ్వినపుడు వొదులుగా(Loose) ఉన్న నేల అప్పుడప్పుడు కూలిపోయి సొరికలు ఏర్పడి మెల్లగా బావిదరి కూలిపోయే అవకాశం ఉంటుంది . అందుకని అలాంటి దరి ఎంతదూరం ఉంటే అంత దూరం వరకు రాతికట్టడం కడుతారు . అలా కట్టేటప్పుడు ఒకపొడుగాటి రాయిని మనం దిగేందుకు వీలుగా మెట్లరూపంలో అక్కడక్కడ అమర్చుతారు . దానవల్ల మనం ఆ బావిని దిగుడుబావి లేదా నడబావి అంటాము. 
                ధైర్యమున్నవారు మోటచిమ్ములెక్కి దూకడానికి సిద్ధపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు దూకుతున్నారు . బావిలో ఎవరు ఎక్కువ దూరంలో దూకితే వారు బలాదూర్ బిరుదాంకితులు అవుతారు. నేను చిమ్ములెక్కాను.  అందరి కంటే ఎక్కువ దూరంలో దూకాలని లంఘించి దూకాను. మోటచిమ్ముల చివరి నుండి దూకితే అవతలి రాతి దరికి వెళ్ళి నా కాళ్ళు ఢీకొట్టాయి. ఆ ఘాతంతో నా నవనాడులు కదిలి పోయాయి. కండ్లు బైర్లు కమ్మినవి. శరీరం వశం తప్పింది. చీకటి ఆవరించింది. నీటిలో మునిగి పోయే దుస్థితి దాపురించింది. యమరాజు పిలుస్తున్నాడనిపించింది. నాలోని ఏదో తెలియని అతీత శక్తి నాకు తెలువకుండానే నన్ను బావిలోని ఒక దిగుడు మెట్టును పట్టుకునేటట్టు చేసింది . ఆ మెట్టును అలాగే పట్టుకొని కొంచెం సమయం అలాగే ఉండి మెల్లెగా ప్రయత్నించి ఒక మెట్టుమీద కూర్చున్నాను. కండ్లు మూసుకొని బావిదరికి ఒదిగి పోయాను . నేను ఎక్కడున్నానో నాకే తెలియడం లెదు. శరీరం అచేతనమైపోయింది. 
           ఇది గమనించి బావిలో ఉన్న మిత్రులు నా దగ్గరకు వచ్చారట . నా దగ్గరకు వచ్చి నన్ను మెల్లమెల్లగా బావిమీదకు తీసుకువచ్చారట . భూమిపై పడుకోబెట్టి నారట . కొద్దిచేపటి తర్వాత నేను కళ్ళు తెరచి చూశానట . 
         కుదుట పడ్డాక అందరం కలిసి ఊరి ముఖం పట్టి ఎవరి ఇంటికి వాళ్ళం  వెళ్ళిపోయాము .

కామెంట్‌లు