సుప్రభాత కవిత ;- బృంద
వెలుగు పరిమళాలు
పంచుతోంది ఉదయం
ఆనందపు స్వరకల్పన
చేసుకుంటోంది హృదయం

నెత్తావుల మధురిమను
కొత్తగ పరిచయం చేస్తోంది
మెత్తని ఆశల మోసులు
గుత్తులుగా మోస్తోంది మానసం

ఆమని చిగురుల లాటి
ఎర్రదనం అలముకుంది గగనం
కవనమంటి  పాటేదో
పాడుతోంది భువనం

చిన్ని మొగ్గల లేత బుగ్గలపై
సుతారంగా ముద్దులు కురిపిస్తూ
ప్రేమలన్నీ పంచుతూ
మమతలేవో పంచుతోంది కిరణం

పలకరింపుతోనే పరవశాలు
పులకరింపులతో కైంకర్యాలు
కలవరింతలన్నీ కనుమరుగులు
కల వరంగా తెచ్చు వెలుగులకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు