సునంద భాషితం - వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -287
******
 శైలూషః అంటే  నటుడు, మారేడు చెట్టు.శైలూషీ అంటే నటి.
నాటకములో వేషము వేసే స్త్రీ కానీ , పురుషుడు కానీ అనేక వేషాలు వేస్తారు.అనగా అనేక పాత్రలు పోషిస్తుంటారు.అంటే వారు  ఆ విధంగా అనేక రూపాల్లో భాసిస్తున్నా... మూల ప్రకృతిలోకి, మూలంలోకి నిశితంగా చూస్తే  వాస్తవానికి  ఒక్కరే అనే సత్యాన్ని గ్రహించగలం.
ఒక నటుడు లేదా నటి మాత్రమే కాదు ఈ జీవన రంగస్థలంపై మనమూ అనేక పాత్రలు పోషిస్తున్నామని అందరికీ తెలిసిందే.
ఈ జగత్తుకూడా ఒక్కటే కానీ అనేక రూపాలలో కనిపిస్తుందనే, దర్శనమిస్తుందనీ  మూలాల్లోకి వెళితే అంతా ఒక్కటే అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కుండ,అటిక,మూకుడు, కూజా లాంటి వస్తువులన్నీ  మట్టితో చేయబడినవే.అవి రూపంలో  భిన్నత్వాన్ని సంతరించుకున్నా అన్నింటికీ మూలం మట్టినే.మట్టి అనేది నిజం.మట్టి అనేది సత్యం.
అలాగే వేదాలు, అద్వైతం ఏం చెబుతున్నాయంటే "సర్వం బ్రహ్మ మయం"అని అంటే అంతా బ్రహ్మమే.
 ఇక భూమిలో నాటిన విత్తనం భూమి మీద మొలకెత్తి మొక్కై, మానై క్రమ క్రమంగా  పెరుగుతూ ఆకులు, కొమ్మలు, రెమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పూలూ, పళ్ళూ మొదలైన వాటిని ఇస్తుంది. ఇలా ఒక చెట్టు మూలం ఎక్కడ ఉంది నేలలోనే కదా! అంటే   నేల లేనిదే ఆ విత్తనం మొలకెత్తే ఆధారం లేదు. అందుకే నేలే  సృష్టికి మూలం.
దీనికి దగ్గరగా ఉన్న వేమన పద్యాన్ని చూద్దామా...
 "కుండ కుంభ మన్న కొండ‌పర్వతమన్న/ నుప్పు లవణమన్న నొకటి కాదె/భాషలిట్టె వేరు పరతత్వమొకటే విశ్వధాభిరామ వినురవేమ!"
కుండను కుంభమనీ, కొండను పర్వతమనీ,ఉప్పును లవణమనీ పిలిచే భాష వేరైనా, పేర్లు వేరైనా అసలు పదార్థము ఒకటే అని భావం.
అలాగే  వేమన రాసిన మరో పద్యాన్ని  చూద్దాం. ఇది తాత్వికత,సృష్టి తత్వాన్ని తెలుపుతుంది.
పక్షి మీద నొక్క వృక్షంబు పుట్టెను/వృక్షము పదమూడు విత్తులయ్యె/ విత్తులందు నుండు వృక్ష మాలించుమీ/ విశ్వదాభిరామ వినురవేమ!"
పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షం నుండి అనేక విత్తనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ విత్తనాలలోని ప్రతి విత్తనంలో ఒక్కో వృక్షము సుప్తావస్తలో ఉంటుంది.దీనిని లోతుగా అధ్యయనం చేస్తే పక్షి అంటే వృక్షమని, వృక్షము అంటే దేహమనీ, పదమూడు విత్తనాలు శరీరంలోని త్రయోదశ తత్వాలనీ,  సృష్టి మూలకమైన మనిషి దేహంలో పదమూడు రకాల అంశాలు ఉన్నాయనీ, వీటన్నింటికీ మూలం జీవ చైతన్యాన్ని కలిగించే ప్రాణమని,ఆ ప్రాణ సృష్టికి మూలం బ్రహ్మం అని అర్థం చేసుకోవచ్చు.
 ఇలా "శైలూషీ న్యాయాన్ని" తాత్విక , భౌతిక కోణాల్లో చూస్తూ వుంటారు.
 మనమంతా ఈ సృష్టిలో ఓ భాగం. జననం నుండి మరణం దాకా రకరకాల పాత్రలు  పోషిస్తామనేది ఈ  న్యాయం చెప్పిన అక్షర సత్యం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం