మనసినిమాల్లో పొడుపుకథల గీతాలు. - సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 మనిషి భాష సృష్టించుకోవడం మహాన్నత కార్యం అయితే దానినుండి సాహిత్యాని వెలికితీయడం అపూర్వం.లిఖిత గ్రంధ సాహిత్యానికి ముందు మౌఖిక సాహిత్య జానపదాలలోకొన్నిభాగాలు కనిపిస్తాయి.అవి జానపద సాహిత్యం,జానపద కథలు.సాంఘీక,జానపద ఆచారాలు.వస్తు సంస్కృతి.
ఇవన్నిజానపద జీవన స్రవంతిలో కనిపిస్తాయి.మరెన్నో పల్లెకళలుగా మనకళ్ళకు నేటికి సజీవంగా కనువిందు చేస్తాయి.
ఈసామెతలు అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో సామెతలు, సూక్తులు, నానుడులు, జాతీయాలున్నాయి. పెద్దలు తమ అనంత అనుభవాలను వీటిలో సంక్షిప్తంగా, సూత్రప్రాయంగా చెప్తారు. అలా ‘ సంక్షిప్తం ’ గా చెప్పిన సూత్రాలే- సూక్తులు, సామెతలు, జాతీయాలు, నానుడులు.
సామెతలు, జాతీయాలు, నానుడులు వాడటం వల్ల చెప్పే మాటలకు, చేసే ప్రసంగానికి, రాసేరాతకు కళాకాంతులొస్తాయి. అర్థం స్ఫుటంగా చెప్పినట్లవుతుంది.
కొన్ని హాస్య సామెతలు ‘అన్నం పెడితే అరిగిపోతుంది- చీర ఇస్తే చిరిగిపోతుంది ’, ‘ వాత పెడితే కలకాలముంటుంది ’ ‘ ఆకలివేస్తుంది అత్త అంటే- రోకలి మింగు కోడలా అందట ’, ‘ అత్తపేరు పెట్టి కూతురిని కుంపట్లో వేసినట్టు ’, ‘ ఏం చేస్తున్నవు కోడలా అంటే- ఒలకబోసి ఎత్తుతున్నా అందట..’ లాంటి సామెతలెన్నో తెలంగాణ జన జీవితంలో ఉన్నాయి.
‘ ఆరు రాజ్యాలు జయించగలం కాని, అల్లుణ్ణి జయించలేం ’,‘ అడవిలో ఆంబోతై తినాలి! అత్తవారింట్లో అల్లుడై తినాలి ’, ‘ అల్లుడా ఎప్పుడొచ్చావు అంటే- రాత్రి వండిన గారెల సంగతి చెప్పనా? ’ అన్నడట! ‘ ఉన్నది ఒకే కూతురు, ఊరంతా అల్లుళ్లు ’ ‘ ఏమి చేసుకు బ్రతుకుదునమ్మా అంటే, నోరు చేసుకు బ్రతుకు ’ అన్నదట. ‘ కుశలమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పలకూటి మొగుడు అమ్ముకుతిన్నాడట. ’
‘ కూచుంటే లేవలేడు! కూరకట్టలమ్మ లేడు! కొట్టొస్తాడమ్మా! ’ అన్నదట.
 ‘ కొండంత మొగుడు పోతే బాధలేదు, పిడికెడు కొప్పు కోసం కోడలేడ్చింది ’, ‘ చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట ’, ‘ చూపులకు సుందరి- మాటలకు మంధర ’, ‘ తలచుకున్నప్పుడే, తలంబ్రాలు కావాలంటే ఎలా? ’, ‘ తాడిచెట్టు నీడా కాదు! తగులుకున్నది పెండ్లామూ కాదు! ’, ‘ తాయెత్తుకు పిల్లలు పుడితే- తానెందుకు? ‘  ' తిప్పలాడీ! మా అప్పను చూశావా అంటే- తీర్థంలో మా బావను చూశావా ’ అందట లాంటి నానుడులు ఎన్నో జనం వాడుకలో ఉన్నాయి.
సాంఘిక జీవితంలో స్త్రీల వర్తనకు సంబంధించిన సామెతల్లో హాస్యం,కొంత మెరటు తనం , వ్యంగ్యం ఉన్నా.., అవి సందర్భాన్ని బట్టి చూడక పోతే నిందాపూర్వ కంగా, అభ్యంతరకరంగా కూడా తోస్తాయి. ఉదాహరణకు..
‘ రంకు నేర్చినది బొంకు నేర్వదా? ’ లాంటివి మనకు కనిపిస్తాయి.
భారతదేశం వ్యవసాయ దేశం. పల్లెప్రాంతాల్లో నివసించే రైతులు వాడే సామెతల్లో, ‘ వ్యవసాయానికి సంబంధించి ’ అనేకం వాడుకలో ఉన్నాయి. కొన్ని పంటలకు కొన్ని ‘ కార్తులు ’, అపకారం కలిగిస్తాయి. అరిగ పంటకు చిత్తకార్తె దాటితే గండం దాటినట్టే అనటానికి- ‘ పైరుకు ముదురు-పసరమునకు లేత ’ అనే సామెతలొచ్చాయి.
పంటలకు నీళ్ల వసతి ముఖ్యం. తూము దగ్గరగా మడి ఉంటే వ్యవసాయానికి బాగా అనుకూలం. అందుకే- ‘ మదుం వారమడైనా కావాలి- మాటకారి మొగుడైనా కావాలి ’ అనే సామెత ప్రసిద్ధమైంది. వ్యవసాయానికి- మబ్బులకు- వర్షానికి- అవినాభావ సంబంధం ఉంది.
‘ పడమట మెరిస్తే- పందయినా నీళ్లు తాగదు ’, ‘ ఉరిమిన మేఘం, తరిమిన పాము, కురవక,కురవక విడవవు,’ ‘ మబ్బుల్లో నీళ్ళు నమ్మి- దొనలోని నీళ్లు తెగగొట్టినట్టు ’, ‘ ఉత్తరాన ఉరిమినా రాజు పాడి తప్పినా కష్టం ’ అనే సామెతలు వచ్చాయి.‘ పల్లము దున్నినవాడు- పల్లకీ ఎక్కినవాడు సమానం ’, ‘ పాటిమీద వ్యవసాయం- కూటికైనా రాదు ’, 
‘ విశాఖ పట్టితే- పిశాచము పట్టినట్టు ’, ‘ మెట్ట దున్నినవాడు- లొట్టి తాగినవాడు ఒకటే..’ లాంటివి ఎన్నో జనరంజక జాతీయాలు న్నాయి.
రైతుకు-గొడ్డూ, గోదా, పొలం, పుట్రా వాటికి సంబంధించిన సామెతల్లో కూడా హాస్యం ఉంది.
‘ ఎద్దు తంతుందని- గుర్రపు చాటున దాగాడట ’, ‘ గుర్రానికి గుగ్గిళ్లు తినటం నేర్పాలా? ’, ‘ గుర్రంలా కుక్కను పెంచి- తానే మొరిగాడట ’, 
‘ గొడ్డులేని ఊళ్లో గోవే శ్రీమహాలక్ష్మి’, ‘ గాడిద సంగీతానికి ఒంటె ‘ఓహో..
 అంటే, ఒంటె అందానికి గాడిద ‘ ఆహా ’ అందట ’, ‘ గడ్డపారలే గాలికి పోతుంటే.. పుల్లాకు నామాటేమిటి అందట ’, ‘ కొన్నది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ ’, ‘ ఏలేవాని ఎద్దు పోతేనేం? కాచేవాని కన్ను పోతేనేం? నాముల్లె నిండితే చాలు..’ లాంటివి ఎన్నో గ్రామాల్లో వాడుకలో ఉన్నాయి.
నిత్య జీవితంలో వైద్యుడితో, మందులతో బాధ తప్పదు. అందుకే ఈ రంగానికి సంబంధించిన హాస్య సామెతలు చాలానే ఉన్నాయి.
‘ పొరుగు వారింట్లో ఘొల్లుమంటే- వైద్యుడింటిలో ఘల్లుమంటుంది ’, 
‘ ఒకరిద్దరిని చంపితే కాని వైద్యుడు కాడు..’ అనే సామెతలు అలాంటివే. ఉల్లిపాయ మంచిది అనే అర్థంలో.. ‘ ఉల్లి చేసిన మేలు- తల్లి చేయదు ’ అనే సామెతవచ్చింది.
రోగాలకు, వైద్యానికి సంబంధించి మరికొన్ని..
‘ పడిశెం పదిరోగాల పెట్టు ’, ‘ తియ్యని రోగాలకు కమ్మని మందులుంటాయా? ’, ‘ పైత్యపు రోగికి పంచదార చేదు ’, ‘ మందుకు పంపితే మాసికానికొచ్చాడు ’, ‘ జరుగుబాటుంటే.. జ్వరమంత సుఖం లేదు ’ లాంటివి ఎన్నో వాడుకలో ఉన్నాయి.
ఎప్పటికి అవసరమైన పనులు అప్పుడే చక్కపెట్టుకోవాలి అనే అర్థంలో..
‘ పండ్ల్లున్నప్పుడే శనగలు తినాలి ’, ‘ అంకిళ్లు పడిపోయాక- అత్తగారూ అరిసెలు కావాలా ’ అన్నదట.. వంటి సామెతలొచ్చాయి.ఇలా వేల సామెతలు చెప్పుకోవచ్చు.
మన సినిమాల్లో ఎందరో మహనీయులు ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసారు.జానపద కళలకు సముచిత స్ధానం కలిగించి తరతరాల చరిత్రను ముందు తరాలవారికి తెలిసేలా సినిమాల్లో జానపదాలను నేరుగా అంతర్నాటకాలుగా ప్రవేశపెట్టారు. 
ఈజానపద కళల ప్రయోగం తొలుత " సుమంగళి " (1945) 
" మోహిని రుక్మాంగద " (1947) చిత్రాలలో ' వీధినాటకలు ' ప్రదర్మనలు." మాయిలోకం " (1945) " మనదేశం " (1949)  
" అగ్గిరాముడు " (1954) చిత్రాలలో ' బుర్ర కథలు ' ప్రవేశపెట్టారు.
అలానే " షావుకారు " (1950) " వాగ్దానం " (1961) వంటి చిత్రాలలో
 ' హరి కథలు ప్రవేశపెట్టారు.ఇలా జానపదాలకు మనతెలుగు సినిమాలకు వేదిక గామారింది. పొడుపు కథలు ' ప్రహేళిక ' లుగా ఆంధ్ర మహాభారతంలో కనిపించే ' యక్ష ప్రశ్నలు ' పొడుపు కథల్లా ఉంటాయి.
మన సినిమాల్లో ' వీధి నాటకం ' ' హరి కథ ' ' పొడుపు కథల పాటలు ప్రవేశ పెట్టిన ఘనత సీనియర్ సముద్రల వారిది. " బాలరాజు " (1948) చిత్రంలో ' ఒకరిని నానేశా-ఒకరిని చితకొట్టి,ఒకరిని చేతపట్టి ' అనే యుగళ గీతం నాటి తరం హాస్యనటుడు కస్తూరి శివరావు పాడుతూ నటించారు.
 " మనోరమ " (1959) చిత్రంలో ' చిట్టిపిల్లల్లారా,నేవేసే పొడుపు కథ విప్పుతారా ' అనేపాట." జయభేరి " ( )చిత్రంలో ' సవాల్ సవాల్ ' అనేపాట. అలానే " ఇల్లరికం " (1959) చిత్రంలో ' అడిగినదానికి చెప్పి ' అనేపాట. అలానే ' భూలోకంలో యమలోకం ' (1966) చిత్రంలో 
' చెప్పగలవా ముడివిప్పగలవా ' అనేపాట." జమిందార్ " (1965) 
' చుక్కలు పొడిచే వేళ ' అనేపాట" లక్షాధికారి " చిత్రంలో ' మబ్బులో ఏముంది ' అనేపాట. ఇవన్ని (1960) ప్రాంతంలో ఎక్కువగా వచ్చాయి.
కవిత్రయ మహాభారతంలో సందర్బోచితంగా .లోకోక్తులు. సామెతలు. పలుకుబళ్ళు జాతీయాలు ప్రయోగించబడ్డాయి.ఈపోడుపుకథల తరహాలో సాగిన మరికొన్ని పాటలగురించి తెలుసుకుందాం!
" సుమంగళి " (1965) చిత్రంలో ' ఆనాటి మానవుడు ఏమిచేసాడు ' అనే పాట. " బాలరాజు కథ " (1970) ' అడిగానని అనుకోవద్దు ' అనేపాట. 
" చిన్ననాటి స్నేహితులు " (1975) ' అడగాలని ఉంది ' అనేపాట.
" మంచికి మరోపేరు " (1976) ' విప్పే మొనగాడున్నాడా ' అనేపాట. 
" మూగ మనసులు " (1964) " పంతాలు పట్టింపులు " (1968) ' రంగు పూసుకుని వచ్చావా ' అలాగే " తల్లి కూతుళ్ళు " " ఆనంద నిలయం " (1971) " పాడవోయి భారతీయుడా " (1976) " చాణిక్య చంద్రగుప్త " (1977)నాటి బాలరాజు నుండి నేటి అరుణాచలం వరకుఎన్నో పోడుపు కథల తరహ పాటలు మన చిత్రాలలో సుందర మనోహర దృస్యాలుగా రూపొందించారు.అవి మనందరిని అలరించాయి.అసలు ఈపొడుపుకథల ముఖ్యఉద్దేశ్యం ప్రజలకు,విజ్ఞానాన్ని, వినోదాన్ని కలగజేయడమే. ఇవన్ని మనజీవితంలోముడిపడిఉన్న సజీవ జానపదకళలు.వీటిని ఆదరించి ప్రోత్సహించి కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనాఉంది. 



కామెంట్‌లు