నమో దుర్గ!;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
ఉత్పల మాల /
1.
దుర్గ!యటంచునిన్ బిలువ దోసము లన్నియు తొల్గ చేసి స
న్మార్గము చూపు తల్లి!నినుమానస మందున దల్తుమమ్మరో!
నిర్గుణ సాధనల్ సలిపి నీపద సేవలు జేసి కొల్తుమో
భర్గుని రాణి!దక్షి!భవ పాప వినాశిని!లోక నాయకీ!/


చంపకమాల/
 2.
రుజములు చుట్టుముట్టగను రోగభయంబున లోకులెల్లరున్
గజగజలాడి నీదరికి గ్రక్కున వచ్చిరి కాంచు
మమ్మ!యీ
ప్రజలకు ధైర్యమిచ్చి రుజ బాధలు కాల్చుమ!సర్వమంగళా!
సుజనుల బ్రోచు తల్లి!శశి చూడధరీ!హిత కారిణీ యుమా!/

ఉత్పల మాల /
3.
రక్కసులందరిన్ దునిమి రౌద్రపు రూపున శక్తిశాలివై
దిక్కుల నేలు మా జనని!తీయని నవ్వులు చిల్కు చుండి మా 
బ్రక్కన తోడుగన్ నిలిచి బాధలు దూరము చేయు మమ్మ!నీ
చక్కని మోము గాంచగను సాధన సల్పెదమమ్మ శ్రీకరీ!/

చంపక మాల /
4.
కరములు మోడ్చి నీదరికి
కామిత సిద్ధికి జేరు భక్తులన్
మురియుచు చేరదీసి ముద్దుగ కోర్కెలు తీర్చుతల్లి!నీ
చరితము పాడుకొంచు మనసారగ మ్రొక్కెద మమ్మ శాంభవీ!
నిరతము నీదు సన్నిధిన నిల్చెడి భాగ్యము నీయుమీశ్వరీ!/

చంపక మాల /
5.
జగముల సృష్టి చేయు శివశక్తి!విమోహ విరాగ పూజితా!
నిగమనుతా!శుభప్రదవు నిత్యము భక్తుల బ్రోచుచున్ సదా 
ప్రగతిని చూపు తల్లి!సుర వందిత నిన్ను భజింతు మమ్మ!మా
వగలను దీర్చవమ్మ!హిమ వాసిని!భక్తవశంకరీ!జయా!/
-----------------------------


కామెంట్‌లు