దుష్కర్మలు;- సి.హెచ్.ప్రతాప్
 మానవుడు అనుక్షణం కర్మలను ఆచరిస్తూ జీవిస్తుంటాడు.శ్రీకృష్ణభగవానుచే భగ వద్గీతలో చెప్పబడినట్లు ”నహ కశ్చిత్‌ క్షణ మపి జాతు తిష్ఠత్య కర్మకృత్‌” అంటే ఈ లోకంలో ఎవ్వరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా వుండరు . చివరకు శ్వాస తీసుకొ ని వదలటం, నడవడం, భుజించడం, మాట్లాడటం… అన్నీ కర్మలే. వీటిని నిత్య కర్మలు లేక అనివార్య కర్మలు అంటాం. ఆయా కర్మలు గుణాన్నిబట్టి సత్కర్మలు, దుష్కర్మలు అని రెండు రకాలు. సత్కర్మలను పుణ్యకర్మలు అనీ, దుష్కర్మలనే పాపకర్మలని కూడా వ్యవహారభాషలో అంటారు.దుష్కర్మల వలన మానవులు అనుక్షణం అశాంతి, ఆందోళనలకు గురవుతూ హీనస్థితికి దిగజారుతారు.ఈ దుష్కర్మలు, లేదా ప్రారబ్ధ కర్మ లను అను భవించడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మించవలసి ఉంటుంది.తెలియక చేసిన పాపకర్మల ఫలితం జ్ఞాన ప్రబోధముతో , గురు లేక దైవ సేవనంతో, పుణ్యకర్మలను ఆచరించడం వలన తొలగుతుంది. కానీ తెలిసి చేసిన దుష్కర్మల ఫలం ఏ విధంగానూ తొలగదని శాస్త్ర వాక్యం. కాబట్టి తెలిసి తెలిసి దుష్కర్మలను ఆచరించడం మహాపాపం.కానీ, దుష్కర్మలకు దూరంగా ఉండటమే అసలైన విజ్ఞత. పాపాలకు పాల్పడి నరకానికి వెళ్లడమా, ధర్మబద్ధమైన మార్గంలో నడిచి స్వర్గంలో చోటు దక్కించుకోవడమా మన చేతుల్లోనే ఉంది.భగవంతుడి అనుగ్రహం వల్ల వచ్చిన ఉన్నతమైన జన్మను, మరింత మహోన్నతంగా తీర్చుదిద్దుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది. కన్నూ మిన్నూ చూడకుండా పాపకార్యాలు చేసేవారికి నిష్కృతి ఉండదు.ష్కర్మలు చేసినవారికి నీచ జన్మ, ఈతి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం, దౌర్బల్యం, దౌర్భాగ్యం లాంటి ఫలితాలు కలుగుతాయి. అలా కలిగే ఫలితాలను అనుభవించేటప్పుడు మానవుల ఆలోచనా సరళి ఇంకోలా ఉంటుంది. వారు సాధారణంగా ‘తమకీ బాధలు కల్పించినవాడు భగవంతుడే’ అనే భావనతో ఉంటారు అంతే తప్ప తమ పాపాలను క్షమించి తమ దుష్కర్మ ఫలితాలను తొలగించమని మాత్రం పశ్చాత్తాపంతో భగవంతుడిని వేడరు.
సి.హెచ్.సాయిప్రతాప్ 
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా)
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 
కామెంట్‌లు